షాక్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్

Tuesday,May 14,2019 - 06:53 by Z_CLU

కొంత మంది హీరోలు ఊహించని విధంగా మెగా ఫోన్ పట్టి అప్పుడప్పుడూ షాక్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు డిఫరెంట్ గా స్టార్ డైరెక్టర్ వినాయక్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. కొన్ని నెలలు డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చి నటుడిగా మారబోతున్నాడు వినాయక్. అవును ఇది నిజం. దిల్ రాజు నిర్మించనున్న ఓ సినిమాలో వినాయక్ హీరోగా నటించనున్నాడు.  ఈ విషయాన్ని ఈరోజు తిరుపతిలో స్వయంగా ప్రకటించాడు దిల్ రాజు.

“దిల్ సినిమాతో ప్రారంభమైన మా బ్యానర్ పదహారేళ్ళు పూర్తి చేసుకుంది. ఆ సినిమా టైటిలే నా పేరైంది. ఈ మధ్య ఒక కథ విన్నాను. ఎవరైతే బాగుంటుందా..? అని ఆలోచించాం. నన్ను దిల్ రాజు ని చేసిన మా వి.వి. వినాయక్ ని యాక్టర్ గా పరిచయం చేద్దామని డిసైడ్ అయ్యాం. కథ వినాయక్ గారికి కూడా వినిపించడం జరిగింది. వెంటనే ఒకే చెప్పారు. దేవుడి సన్నిధిలో ఈ సినిమా అనౌన్స్ చేయమని వినాయక్ అడిగారు. అందుకే ఇక్కడే అనౌన్స్ చేశాను. ఒక మంచి సినిమా మా బ్యానర్ లో రాబోతుంది.” అంటూ వినాయక్ తో సినిమా అనౌన్స్ చేసాడు దిల్ రాజు.

ఒక మధ్య వయసు వ్యక్తి తాలుకు కథతో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను గతంలో శంకర్ దగ్గర పనిచేసిన నరసింహ రావు డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మరో మూడు నెలల్లో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఇంతకీ ఈ సినిమా కథేంటి..? ఇందులో వినాయక్ ఎలా కనిపిస్తాడు..? అనేవి తెలియాల్సి ఉంది.