RangDe - హరివిల్లు లాంటి సినిమా
Monday,March 22,2021 - 01:10 by Z_CLU
రంగ్ దే సినిమా హరివిల్లు టైపులో జీవితంలోని అన్ని రంగుల్ని చూపిస్తుందంటున్నాడు స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న మాటల మాంత్రికుడు.. నితిన్ తనకు తమ్ముడు లాంటివాడని చెప్పుకొచ్చాడు.
‘‘అన్ని జంతువులు నవ్వలేవు. మనిషి మాత్రమే నవ్వగలడు. అలాగే జంతువులకు ఏ వస్తువైనా బ్లాక్ అండ్ వైట్‌లోనే కనిపిస్తుంది. మనుషులకు మాత్రమే ఏడురంగులను చూసే అదృష్టం ఉంది. ఈ సినిమా జీవితంలోని ఏడు రంగులను చూపిస్తుంది. సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. ఇందులో నాకు బాగా నచ్చిన పాత్రలు అర్జున్, అను. ఎలాంటి సందర్భంలో అయినా ఓ మంచి పాటను తీసుకురాగలిగే సత్తా దేవిశ్రీ ప్రసాద్‌కు ఉంది. భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో దేవీ కూడా ఒకరు. ఇందులో ‘ఊరంతా చీకటి’ పాట థియేటర్లో చూస్తే ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చుతాయి’’ అని అన్నారు.
యూత్ స్టార్ నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.
హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. హీరోహీరోయిన్లు నితిన్, కీర్తి సురేష్, నిర్మాత, హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత సుధాకర్‌రెడ్ది, నిర్మాత ఠాగూర్ మధు,చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ, చిత్ర సమర్పకుడు పీడీవీ ప్రసాద్, చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి,సీనియర్ నటుడు వీకే నరే్‌ష్, రోహిణి, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గీత రచయిత శ్రీమణి, గాయని మంగ్లీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.