టాప్-10 సాంగ్స్ @ 2017

Tuesday,December 26,2017 - 05:51 by Z_CLU

2017లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు. వాటిలో ఎన్నో హిట్ సాంగ్స్. కానీ ఈ ఏడాది ఆడియన్స్ మనసులో నిలిచిపోయిన సాంగ్స్ మాత్రం కొన్నే. యూట్యూబ్ హిట్స్, జ్యూక్ బాక్స్ క్లిక్స్ ఆధారంగా అలాంటి టాప్-10 సాంగ్స్ ను మీకు అందిస్తున్నాం.

ఈ ఏడాది సూపర్ డూపర్ హిట్ అయిన సాంగ్ బాహుబలి-2 సినిమాలో “సాహోరే” పాట. భాషతో సంబంధం లేకుండా అందరూ ఈ ట్యూన్ కు కనెక్ట్ అయ్యారంటే ఇది ఎంత పెద్ద హిట్ అయిందో అర్థంచేసుకోవచ్చు. కీరవాణి సంగీతం అందించిన ఈ సాంగ్ యూట్యూబ్ లో విడుదలైనప్పటి నుంచి మొన్నటివరకు ట్రెండింగ్ లో కొనసాగింది.

ఈ ఏడాది సూపర్ హిట్ అయిన సాంగ్స్ లో సెకెండ్ ప్లేస్ లో నిలిచింది ఫిదాలోని “వచ్చిండే” అనే సాంగ్. పూర్తిగా తెలంగాణ యాసలో కంపోజ్ అయిన పాట ప్రాంతంతో సంబంధ లేకుండా హిట్ అయింది. ఇప్పటికీ పెళ్లిళ్లు, ఫంక్షన్లు, డాన్స్ కాంపిటిషన్లలో ఈ పాటదే హవా. శక్తికాంత్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇక టాప్-10 సాంగ్స్ లో మూడో స్థానంలో నిలిచింది ఖైదీనంబర్ 150 మూవీ. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాలోని “అమ్మడు లెట్స్ డు కుమ్ముడు” సాంగ్ ఇనిస్టెంట్ గా హిట్ అయింది. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ పాట యూత్ ను ఓ ఊపు ఊపేసింది.

ఊపున్న పాటలే కాదు, మనసును తాకే మెలొడీలు కూడా టాప్ చార్టుల్లో నిలిచాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్నుకోరి సినిమాలోని “అడిగా అడిగా” అనే పాట. ఈ ఒక్క సింగిల్ కే యూట్యూబ్ లో కోటి 20 లక్షల వ్యూస్ వచ్చాయంటే ఇది ఎంత పెద్ద హిట్ అయిందో అర్థంచేసుకోవచ్చు. నాని నటించిన సినిమాలు ఎన్ని రిలీజ్ అయినప్పటికీ, ఇప్పటికీ ఎఫ్ఎం రేడియోల్లో ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది.

టాప్-5లో నిలిచిన సూపర్ హిట్ సాంగ్ “మెల్లగా తెల్లారిందే”. శతమానం భవతి సినిమాలో ఈపాట కుర్రాళ్లతో పాటు పెద్దోళ్లకు కూడా విపరీతంగా నచ్చింది. మిక్కీ జే మేయర్ సంగీతానికి, శ్రీమణి అందించిన సాహిత్యం అతికినట్టు సూట్ అయింది. ఇప్పటికీ ఈ పాటకు యూట్యూబ్ లో ప్రతి రోజు వ్యూస్ వస్తున్నాయి.

అర్జున్ రెడ్డి.. ఈ సినిమా ఎంత హిట్ అయిందో, ఇందులోని బ్రేకప్ సాంగ్ కూడా అంతే హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే సినిమా రిలీజ్ కు ముందే ఈ సాంగ్ హిట్. సినిమాపై హైప్ తీసుకొచ్చింది కూడా ఈ పాటే. రథన్ సంగీతం అందించిన ఈ పాటకు రాంబాబు సాహిత్యం ఇవ్వగా.. రేవంత్ అద్భుతంగా ఆలపించాడు.

ఇక ఈ ఏడాది సూపర్ హిట్ అయిన సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది బొంబాట్ సాంగ్. తనలో మేజిక్ తగ్గలేదని మరోసారి ఈ సాంగ్ తో నిరూపించాడు సంగీత దర్శకుడు మణిశర్మ. నితిన్ హీరోగా నటించిన లై సినిమాలోనిది ఈపాట. కాసర్ల శ్యామ్ ఈ పాట రాయగా.. రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా కలిసి పాడారు.

బన్నీ నటించిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో కూడా ఓ పాట టాప్-10 లిస్ట్ లో చోటుదక్కించుకుంది. అస్మైక యోగ అనే క్లాసికల్ లిరిక్స్ తో సాగే ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. సాహితి ఈ పాట రాయగా.. కార్తికేయన్, చిత్ర ఆలపించారు.

దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన మరో పాట కూడా ఈ ఏడాది టాప్ లిస్ట్ లో చేరింది. జై లవకుశ సినిమాలో ‘నీ కళ్లలోని కాటుక..’ అనే పాట ఇనిస్టెంట్ గా హిట్ అయింది. చంద్రబోస్ ఈ పాట రాయగా.. హేమచంద్ర పాడాడు.

రీసెంట్ గా రిలీజైన హలో సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ ఏడాదిలోనే బెస్ట్ సాంగ్స్ లిస్ట్ లో హలో కూడా చేరిపోయింది. మరీ ముఖ్యంగా హలో టైటిల్ సాంగ్ పెద్ద హిట్. అనూప్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.