2017 టాప్-10 మూవీస్

Friday,December 22,2017 - 06:02 by Z_CLU

2017లో వచ్చిన అత్యుత్తమ చిత్రాలు ఏంటనే విషయంపై ఐఎమ్ డీబీ (IMDB) సర్వే నిర్వహించింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వచ్చిన సినిమాల్లో అత్యుత్తమ రేటింగ్స్ దక్కించుకున్న మూవీస్ తో టాప్-10 లిస్ట్ తయారుచేసింది. ఈ లిస్ట్ లో ఈసారి టాలీవుడ్ నుంచి ఏకంగా 3 సినిమాలకు చోటు దక్కడం గ్రేట్.

 

టాప్-1: విక్రమ్ వేధ

ఐఎమ్డీబీ రేటింగ్స్ లో నంబర్ వన్ స్థానం దీనిదే. విజయ్ సేతుపతి, మాధవన్ నటించిన ఈ సినిమా 2017 టాప్ రేటెడ్ మూవీగా నిలిచింది. క్రిటిక్స్ అంతా మూకుమ్మడిగా మెచ్చుకున్న సినిమా ఇది. తెలుగులో కూడా ఈ సినిమాను రీమేక్ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.

 

టాప్-2: బాహుబలి 2: ది కంక్లూజన్

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన సినిమా ఇది. ఇక ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు ఈ సినిమాని. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా నటించిన ఈ  సినిమా తెలుగులో చరిత్ర సృష్టించింది.

 

 

టాప్-3: అర్జున్ రెడ్డి

అల్టిమేట్ కల్ట్ మూవీగా పేరుతెచ్చుకుంది అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్. ఈ సినిమాకు ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేడు. ఈ సినిమాను మెచ్చుకోని టాలీవుడ్ సెలబ్రిటీ కూడా లేడు. దర్శకుడు సందీప్ రెడ్డికి ఇదే మొదటి సినిమా. విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన ఈ సినిమాకు ఐఎమ్ డీబీలో థర్డ్ ప్లేస్ దక్కింది.

 

టాప్-4: సీక్రెట్ సూపర్ స్టార్

ఎక్కువమంది విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ఏటి మేటి చిత్రాల్లో సీక్రెట్ సూపర్ స్టార్ కూడా ఉంది. లిస్ట్ లో దీనికి నాలుగో స్థానం దక్కింది. అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమా ఇండియాతో పాటు పలు దేశాల్లో సూపర్ హిట్ అయింది.

టాప్-5: హిందీ మీడియం

కామెడీతో పాటు ఓ చక్కటి సందేశాన్ని అందించిన చిత్రం ఇది. ఇర్ఫాన్ ఖాన్ లీడ్ రోల్ లో నటించిన ఈ బాలీవుడ్ సినిమా అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది.

 

టాప్-6: ఘాజీ

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా భారతీయ సినీప్రేక్షకులకు ఓ సరికొత్త కథను పరిచయం చేసింది. సబ్-మెరైన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది ఘాజీ. 1971 ఇండో-పాక్ యుద్ధంలో జరిగిన ఓ ఘటనను బేస్ చేసుకొని తెరకెక్కించిన ఈ సినిమాలో రానా యాక్టింగ్ సూపర్.

 

టాప్-7: టాయిలెట్-ఏక్ ప్రేమకథ

మంచి సందేశాన్నిస్తూనే, ఎంటర్ టైన్ మెంట్ అందించే సినిమాలు తీసే అక్షయ్ కుమార్.. ఈ ఏడాది టాయిలెట్ మూవీతో అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు. స్వచ్ఛభారత్ ఉద్యమం దేశంలో చురుగ్గా సాగుతున్న టైమ్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఐఎమ్ డీబీ రేటింగ్స్ లో దీనికి ఏడో స్థానం దక్కింది.

టాప్-8: జాలీ ఎల్ఎల్ బీ-2

ఇది కూడా అక్షయ్ కుమార్ సినిమానే. ఇతడి కెరీర్ లో వంద కోట్లు కొల్లగొట్టిన సినిమాల జాబితాలో ఇది కూడా చేరిపోయింది. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తూనే, మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమాలో. అక్షయ్ కుమార్ నటన సినిమాకు పెద్ద ఎస్సెట్.

 

టాప్-9: మెర్సెల్

టోటల్ సౌత్ ను ఓ ఊపు ఊపేసిన సినిమా ఇది. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హయ్యస్ట్ రేటింగ్స్ సాధించింది. ఓ మంచి సందేశం ఇవ్వడానికి డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకోవడం ఈ సినిమాలో ప్రత్యేకత. విజయ్ ట్రిపుల్ రోల్ చేసిన ఈ సినిమాకు రెహ్మాన్ సంగీతం అందించాడు.

 

టాప్-10: ది గ్రేట్ ఫాదర్

ఐఎమ్ డీబీ లిస్ట్ లో ఆఖరి స్థానంలో నిలిచిన సినిమా ఇది. మమ్ముట్టి హీరోగా నటించిన ఈ మలయాళం సినిమా కేరళలో పెద్ద హిట్. ఏడేళ్ల గ్యాప్ తర్వాత మమ్ముట్టి, స్నేహ కలిసి నటించిన ఈ సినిమాకు క్రిటిక్స్ అంతా టాప్ రేటింగ్స్ ఇచ్చారు.