టాలీవుడ్ వాలంటైన్స్ డే స్పెషల్

Wednesday,February 14,2018 - 04:13 by Z_CLU

వాలంటైన్స్ డే సందర్భంగా టాలీవుడ్ లో చాలా హంగామా నడిచింది ఈరోజు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 10 సినిమాలు తమ మూవీ అప్ డేట్స్ తో హంగామా చేశాయి. ఎక్కువమంది తమ సినిమాలకు సంబంధించి స్టిల్స్ రిలీజ్ చేస్తే, మిగతావాళ్లు ట్రయిలర్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేశారు.

నా పేరు సూర్య వాలంటైన్స్ డే స్టిల్
ప్రేమికుల రోజు కానుకగా ఓ కొత్త స్టిల్ రిలీజ్ చేసింది నా పేరు సూర్య యూనిట్. కేవలం స్టిల్ విడుదల చేయడమే కాకుండా సినిమాకు సంబంధించి సెకెండ్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు. బన్నీ, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకుడు.

ఛల్ మోహన్ రంగ
నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చల్ మోహన్ రంగ సినిమాకు సంబంధించి వాలంటైన్స్ డే కానుకగా ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. అందుకే టీజర్ రిలీజ్ కు ఈరోజును సెలక్ట్ చేసుకుంది టీం.

కిరాక్ పార్టీ వాలంటైన్స్ డే పోస్టర్
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వస్తోంది కిరాక్ పార్టీ. ఈ సినిమాలో కూడా లవ్ దే కీలక పాత్ర. అందుకే ప్రేమికుల రోజును మిస్ అవ్వలేదు యూనిట్. వాలంటైన్స్ డే సందర్భంగా అదిరిపోయే స్టిల్ ను రిలీజ్ చేశారు. లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిగా నిఖిల్ కనిపించే ఫొటో రిలీజ్ చేసి, సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచారు.

తొలిప్రేమ వాలంటైన్స్ డే పోస్టర్
ఇప్పటికే హిట్ అయిన తొలిప్రేమ సినిమాకు సంబంధించి వాలంటైన్స్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎన్నో స్టిల్స్ కు అదనంగా విడుదలైన ఈ స్టిల్ ఎట్రాక్టివ్ గా ఉంది. ఇప్పటికే సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తుండడంతో ఈ వాలంటైన్స్ డే స్టిల్ కు కూడా మంచి క్రేజ్ వచ్చింది.


ప్రేమ పావురాలు
నయనతార ప్రధాన పాత్రలో వాసుకి లాంటి సంచలన సినిమాను అందించిన శ్రీరామ్ సినిమా బ్యానర్ లో వస్తొన్న రెండో చిత్రం “ప్రేమ పావురాలు”. గతేడాది తమిళ్ లో “కాదల్ కన్ కట్టుదే ” పేరుతో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ఇప్పుడు తెలుగులో ప్రేమ పావురాలుగా విడుదలకు సిద్దమైంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ స్టిల్ ను విడుదల చేశారు.

హ్యాపీ వెడ్డింగ్
యువి క్రియేష‌న్స్, పాకెట్ సినిమా సంయుక్త నిర్మాణంలో ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వంలో హీరో సుమంత్ అశ్విన్, హీరోయిన్ నిహారిక కొణిదెల జంట‌గా నటిస్తున్న సినిమా హ్య‌పీ వెడ్డింగ్. చక్కటి ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఫిదా లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిల్మ్ కి సంగీతం అందించిన శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఫిబ్ర‌వ‌రి 14 వేలంటైన్స్ డే సంద‌ర్బంగా ఈచిత్రం ఫస్ట్ లుక్ ని విడుద‌ల చేశారు.


హైదరాబాద్ లవ్ స్టోరీ
రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించిన కొత్త సినిమా “హైదరాబాద్ లవ్ స్టోరీ”. ప్రేమికుల రోజు సందర్భంగా ఈరోజు ఈ సినిమా ట్రయిలర్ ను లాంచ్ చేశారు. సినిమా పీపుల్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు రాజ్ సత్య దర్శకత్వం వహించారు. సునీల్ కశ్వప్ సంగీత దర్శకుడు. ఎమ్.ఎల్ రాజు, కిషన్, వేణుగోపాల్ నిర్మాతలు.

మసక్కలి ట్రయిలర్ లాంచ్
వాలంటైన్స్ డే సందర్భంగా తెరపైకొచ్చిన మరో సినిమా మసక్కలి. ప్యూర్ సోల్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ట్రయిలర్ ను ఈరోజు లాంచ్ చేశారు. సుమిత్ సింగ్ నిర్మించిన ఈ సినిమాకు మలయాళం ఇండస్ట్రీకి చెందిన అబి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా ఇతడే.

సాక్ష్యం ఫస్ట్ లుక్
శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా “సాక్ష్యం” అనే డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ రెడీ అవుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం హైద్రాబాద్ లోని రామోజీ ఫీలిం సిటీలో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకొంటున్న చిత్ర బృందం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సినిమాలో హీరోహీరోయిన్ లుక్స్ ను విడుదల చేశారు.

పరిచయం
ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై హైద్రాబాద్ నవాబ్స్ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పరిచయం’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రియాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా విరాట్ కొండూరు హీరో గా పరిచయమవుతున్నాడు. సిమ్రత్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రీ-లుక్ ను వాలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు.