వాలంటైన్స్ డే స్పెషల్

Friday,February 14,2020 - 02:59 by Z_CLU

ప్రతి ప్రేమికుల రోజుకు టాలీవుడ్ హంగామా కామన్. ఈసారి కూడా టాలీవుడ్ లో చాలా హంగామా నడిచింది. ఫస్ట్ లుక్స్, సింగిల్స్, మూవీ ఎనౌన్స్ మెంట్స్.. ఇలా వాలంటైన్స్ డే వేదికగా టాలీవుడ్ మరోసారి బిజీ అయింది.

ప్రేమికుల రోజు కానుకగా నాగచైతన్య-సాయిపల్లవి నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. దీనికి మ్యూజికల్ ప్రివ్యూ అని పేరుపెట్టారు. 60 సెకెన్ల ఈ వీడియోలో నాగచైతన్య-సాయిపల్లవి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. పవన్ కంపోజ్ చేసిన ట్యూన్ కూడా బాగుంది.

రొమాంటిక్ సినిమాలకు పెట్టింది పేరైన పూరి జగన్నాధ్, తన కొడుకును హీరోగా పెట్టి రొమాంటిక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ప్రేమికుల రోజు స్పెషల్ గా గ్లాన్స్ ఆఫ్ రొమాంటిక్ అంటూ చిన్న వీడియో రిలీజ్ చేశారు. హీరో ఆకాష్, హీరోయిన్ కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీని ఎలివేట్ చేసేలా ఉంది ఈ వీడియో.

వాలంటైన్స్ డే సందర్భంగా కొత్త సినిమా ఎనౌన్స్ చేసింది సమంత. అయితే అది తెలుగు సినిమా కాదు. తమిళ్ లో విజయ్ సేతుపతి హీరోగా రాబోతున్న సినిమాలో సమంత హీరోయిన్ గా నటించబోతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో నయనతార కూడా హీరోయిన్ గా నటించనుంది. నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకుడు.

వాలంటైన్స్ డే గిఫ్ట్ గా భీష్మ సినిమా నుంచి సింగిల్స్ ఏంథెమ్ ను రిలీజ్ చేశారు. నితిన్ పై వచ్చే ఈ మాంటేజ్ సాంగ్ కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. మహతి స్వరసాగర్ అందించిన సంగీతానికి, అనురాగ్ కులకర్ణి వాయిస్ తోడవ్వడంతో పాట హిట్ అయింది. విజువల్ పరంగా కూడా సాంగ్ ఎట్రాక్ట్ చేస్తోంది.

బ్రహ్మాజీ కొడుకు హీరోగా పరిచయమౌతున్న ఓ పిట్టకథ సినిమా నుంచి ఓ లవ్ సింగిల్ రిలీజ్ చేశారు. హీరోయిన్ సమంత ఈ సింగిల్ ను రిలీజ్ చేసింది. ఇప్పటికే ఓ రేంజ్ లో ప్రమోషన్ చేస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ ప్రచారాన్ని పీక్స్ కు తీసుకెళ్లారు.

వాలంటైన్స్ డే సందర్భంగా కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది. నేను లేని నా ప్రేమకథ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమాను ప్రకటించారు. మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశాడు.

ప్రేమికుల రోజు కానుకగా ప్రెషర్ కుక్కర్ యూనిట్ మరో సింగిల్ రిలీజ్ చేసింది. వాలంటైన్స్ డే స్పెషల్ అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఈనెల 21న థియేటర్లలోకి వస్తోంది ప్రెషర్ కుక్కర్.

ఇక వాలంటైన్స్ డే కానుకగా.. కృష్ణ అండ్ హీజ్ లీల అనే సినిమా నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు రానా దగ్గుబాటి ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక హిట్ సినిమా నుంచి కూడా ఓ లవ్ రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.