టాలీవుడ్ లో ఉగాది స్పెషల్

Sunday,March 18,2018 - 10:59 by Z_CLU

ప్రేక్షకులకు శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెబుతూ టాలీవుడ్ లో ఫెస్టివ్ మూడ్ కనిపించింది. దాదాపు డజను సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాగా, మరికొన్ని సినిమాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా కొన్ని ఎనౌన్స్ అయ్యాయి. అవేంటో చూద్దాం.


ఉగాది రోజున కొత్త సినిమా లాంఛ్ చేశాడు నాగశౌర్య. ఛలో సక్సెస్ తో మంచి ఊపుమీదున్న ఈ హీరో తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై నర్తనశాల అనే సినిమాను స్టార్ట్ చేశాడు. శ్రీనివాస్ చక్రవక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లాంచింగ్ రోజునే టైటిల్ లోగో డిజైన్ ను విడుదల చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాకు క్లాప్ కొట్టాడు.

బన్నీ నటిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ నా పేరు సూర్య. ఇప్పటికే ఆడియో సాంగ్స్, ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ తో హల్ చల్ చేస్తోంది ఈ సినిమా. ఉగాది సందర్భంగా మేకర్స్ మరోసారి తమ సినిమాను గుర్తుచేస్తూ.. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు అందించారు. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు, అదితిరావు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా సమ్మోహనం. కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఉగాది సందర్భంగా మరో కొత్త పోస్టర్ విడుదల చేశారు.

నాని డ్యూయల్ రోల్ పోషించిన చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు సంబంధించి, ఉగాది సందర్భంగా మరో పోస్టర్ విడుదల చేసి ప్రేక్షకులకు శుభాకాంక్షలు అందించారు. మేర్లపాక గాంధీ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అనుపమ, రుక్సార్ హీరోయిన్లు.

ఉగాది సందర్భంగా రాజ్ తరుణ్ కొత్త సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ హీరో రాజుగాడు అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అమీరా దస్తర్ హీరోయిన్. సంజనా డైరక్టర్. ఈ మూవీని మే 11న విడుదల చేయబోతున్నట్టు ఉగాది సందర్భంగా స్పెషల్ పోస్టర్ విడుదల చేసి మరీ ప్రకటించారు.

అటు ఆచారి కూడా ఉగాది శుభాకాంక్షలు అందించాడు. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. బ్రహ్మానందం కీలక పాత్ర పోషించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్.

షకలక శంకర్ హీరోగా మారి నటిస్తున్న సినిమా శంభోశంకర. ఉగాది సందర్భంగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ విడుదల చేశారు. శ్రీధర్ ఈ సినిమాకు దర్శకుడు.

యదార్థ ప్రేమగాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం పరిచయం. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏషియన్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రియాజ్ నిర్మించారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఉగాది సందర్భంగా ఈ మూవీ నుంచి మరో బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదలైంది.

ఈ సినిమాలతో పాటు ఉగాది సందర్భంగా ఆనందం, రాజరథం, దేశముదుర్స్, అనగనగా ఒక ఊళ్లో సినిమాల నుంచి కూడా సరికొత్త లుక్స్ విడుదలయ్యాయి.