సమ్మర్ లో కళకళలాడిన టాలీవుడ్

Tuesday,May 22,2018 - 04:54 by Z_CLU

40 రోజులు.. 4 బ్లాక్ బస్టర్స్.. 600 కోట్ల వ్యాపారం

ఈ సమ్మర్ టాలీవుడ్ కు కలకాలం గుర్తుండిపోతుంది

ఇంత కళకళలాడిన సమ్మర్ బాక్సాఫీస్ ను టాలీవుడ్ ఈమధ్య కాలంలో చూడలేదు. బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలు రిలీజ్ అవ్వడం ఒకెత్తయితే.. అవన్నీ వరుసపెట్టి సూపర్ హిట్ అవ్వడం మరో ఎత్తు. ఈ ఒక్క దెబ్బతో ఈ ఏడాది స్లంప్ మొత్తం కొట్టుకుపోయింది. జస్ట్ ఈ 40 రోజుల్లో 600 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందంటే.. ఇండస్ట్రీ ఏ రేంజ్ లో క్లిక్ అయిందో అర్థంచేసుకోవచ్చు.

రంగస్థలం: సమ్మర్ బాక్సాఫీస్ సందడి ఈ సినిమాతోనే మొదలైంది. బాక్సాఫీస్ కు సిసలైన కళ ఈ సినిమాతోనే వచ్చింది. మార్చి 30 న రిలీజైన ‘రంగస్థలం’ సినిమా మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక అక్కడ్నుంచి 50 రోజుల రన్ పూర్తయ్యేవరకు వెనక్కితిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 80 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ తో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 230 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

భరత్ అనే నేను: రంగస్థలం తర్వాతొచ్చిన అతిపెద్ద మూవీ భరత్ అనే నేను. సాధారణంగా ఓ పెద్ద సినిమా తర్వాత వచ్చిన మరో బడా మూవీ ఫెయిల్ అవ్వడం టాలీవుడ్ లో ఎప్పట్నుంచో ఉన్న బ్యాడ్ సెంటిమెంట్. దాన్ని తిరగరాస్తూ భరత్ అనే నేను సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విడుదలైన 2 రోజులకే వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా.. 3 రోజులకే ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. ఆ తర్వాత 4 రోజుల్లో 125 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. అలా 240 కోట్ల రూపాయలతో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

 

నా పేరు సూర్య : అగ్రెసివ్ మిలిటరీ మ్యాన్ లా బన్నీ నటించిన నా పేరు సూర్య సినిమా కూడా సూపర్ హిట్ అయింది. విడుదలైన మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 17 కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా.. బన్నీ కెరీర్ లోనే సెకెండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఓవర్సీస్ తో పాటు ఏపీ, నైజాంలోని ప్రతి సెంటర్ లో స్టడీగా వసూళ్లు రాబడుతూ బన్నీ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది నా పేరు సూర్య.

 

మహానటి : ఈ సమ్మర్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ ఒకెత్తు. మహానటి ఒక్కటి మరో ఎత్తు. బ్లాక్ బస్టర్ అనే పదం కూడా దీనికి చాలా చిన్నది. ఈ వేసవిలో కుర్రాళ్ల నుంచి ఫ్యామిలీస్, సీనియర్ సిటిజన్ల వరకు అందర్నీ థియేటర్లకు రప్పిస్తున్న ఒన్ అండ్ ఓన్లీ మూవీగా నిలిచింది మహానటి. సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని కొందరు దృశ్యకావ్యం అంటారు. మరికొందరు ఎపిక్ మూవీగా అభివర్ణిస్తారు. కానీ ఈ పదాలు కూడా చిన్నవే అంటారు ఇంకొందరు. ఇది అంత పెద్ద హిట్ అయింది. లిమిటెడ్ రిలీజ్ కారణంగా ఈ సినిమా వసూళ్లు కాస్త తక్కువ అనిపించొచ్చు కానీ, మరికొన్ని వారాల పాటు స్టడీగా థియేటర్లలో కొనసాగేంత స్టఫ్ ఈ సినిమాలో ఉంది.