టాలీవుడ్ కు అసలైన సంక్రాంతి వచ్చేసింది

Monday,January 13,2020 - 09:55 by Z_CLU

సంక్రాంతి పెద్ద పండగ మాత్రమే కాదు, టాలీవుడ్ కు పెద్ద సీజన్ కూడా. ఈ సీజన్ లో ఏ సినిమా వచ్చినా దానికి మినిమం గ్యారెంటీ. అందుకే స్టార్స్ అంతా ఈ సీజన్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు పోటీపడుతుంటారు. అయితే ఈసారి సంక్రాంతి సీజన్ కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. హెవీ కాంపిటిషన్ మధ్య వచ్చిన రెండు పెద్ద సినిమాలు హిట్ అయ్యాయి.

అవును.. సంక్రాంతి బరిలో నిలిచిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు రెండూ క్లిక్ అయ్యాయి. ఇలా సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు ఒకేసారి హిట్టవ్వడం ఈమధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైమ్. ప్రతి సంక్రాంతికి ఏదో ఒక పెద్ద సినిమా ట్రేడ్ ను ఇబ్బంది పెడుతూనే ఉంది. కానీ ఈసారి మాత్రం మహేష్-బన్నీ సినిమాలు రెండూ క్లిక్ అవ్వడంతో ట్రేడ్ పండగ చేసుకుంటోంది. ఈ రెండు సినిమాలతో అటుఇటుగా 200 కోట్ల రూపాయల ట్రేడింగ్ నడుస్తోంది.

మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా వరల్డ్ వైడ్ అటుఇటుగా వంద కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఒక్క తెలుగులోనే ఈ సినిమా 74 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇందుకు తగ్గట్టుగానే వసూళ్లు భారీగా ఉన్నాయి. మొదటి రోజు ఈ సినిమాకు ఏకంగా 32 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్స్
తోనే 8 లక్షల డాలర్లు ఆర్జించింది. ప్రస్తుతం 1.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది.

ఇక అల వైకుంఠపురములో విషయానికొద్దాం. ఈ సినిమా కూడా సూపర్ హిట్టయింది. తొలి రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అటు ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో కలుపుకొని 1.34 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవడంతో పాటు.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ లో ఈ సినిమా మొదటి రోజే బ్రేక్-ఈవెన్ అయింది.

ఇలా సంక్రాంతికి విడుదలైన రెండు పెద్ద సినిమాలు వందేసి కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయడమే కాకుండా.. అంతే స్థాయిలో రెవెన్యూ కూడా రాబట్టే దిశగా దూసుకుపోతున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమా కూడా ఈసారి సంక్రాంతి బరిలో క్లిక్ అయింది. మరో 2 రోజుల్లో రాబోతున్న కల్యాణ్ రామ్ సినిమా ఎంత మంచివాడవురా కూడా హిట్టయితే ఈ సంక్రాంతి టాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 250 కోట్ల రూపాయల బిజినెస్ చేసిన ఈ సంక్రాంతి, అదే స్థాయిలో రెవెన్యూ కూడా జనరేట్ చేయడం గ్యారెంటీ అని తేలిపోయింది.