టాలీవుడ్ నుంచి వెళ్లువెత్తుతున్న విరాళాలు 7

Thursday,April 09,2020 - 01:07 by Z_CLU

రామ్ తళ్లూరి
కరోనా పై పోరాటానికి ప్ర‌ముఖ నిర్మాత‌, పారిశ్రామిక‌వేత్త రామ్ త‌ళ్లూరి కూడా ముందుకొచ్చారు. 5.5 ల‌క్ష‌ల రూపాయ‌లు విర‌ళాన్ని ప్ర‌క‌టించారు. ఈ మొత్తంలో 5 ల‌క్ష‌ల రూపాయ‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కి మ‌రో యాభై వేలు విలువ చేసే నిత్య అవ‌స‌రాల స‌రుకులు సినీ కార్మీకుల‌కు అందించారు. తాను అధినేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్కై జోన్ ఇండియా సంస్ధ‌లు త‌రుపున రామ్ త‌ళ్లూరి ఈ విరాళం అందించ‌డం జ‌రిగింది. గ‌త నెల‌లో త‌న కంపెనీ ప‌ని మీద అమెరికా వెళ్లిన రామ్ త‌ళ్లూరి లాక్ డౌన్ నేప‌థ్యంలో అక్క‌డే నిలిచిపోయారు.

పద్మావతి గల్లా
అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై కుమారుడు అశోక్ గ‌ల్లా ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఒక చిత్రాన్ని నిర్మిస్తోన్న ప‌ద్మావ‌తి గ‌ల్లా… క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి రూ. 10 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో షూటింగ్‌లు లేక‌పోవ‌డంతో ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ నిత్యావ‌స‌రాల‌ను కొనుగోలు చేయ‌లేని స్థితిలో ఉన్న పేద సినీ కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి ఎంతోమంది సినీ పెద్ద‌లు ముందుకు రావ‌డం శుభ ప‌రిణామ‌మ‌నీ, ఆ మంచి ప‌నిలో భాగం కావాల‌నే ఉద్దేశంతో సీసీసీకి త‌మ వంతుగా రూ. 10 ల‌క్ష‌లు అంద‌జేస్తున్నామ‌నీ ప‌ద్మావ‌తి తెలిపారు.

నరేష్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడు వీకే న‌రేష్ త‌నలోని దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారి తాండవం చేస్తున్న ఈ సమయంలో ‘మా’ సభ్యులకు అండగా నిలబడటం త‌న‌ బాధ్యతగా భావించిన ఆయ‌న త‌న‌ వంతుగా 100 కుటుంబాలని దత్తత తీసుకుని ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 10 ల‌క్ష‌లు ఆర్థిక సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వారిలో ‘మా’ సర్వే చేయించిన‌ 58 మంది సభ్యులకు ఇప్పటికే వారి బ్యాంక్ అకౌంట్‌లో రూ. 10,000 చొప్పున డిపాజిట్ చేశారు. అదేవిధంగా సినీ కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి మెగాస్టార్ చిరంజీవి చైర్మ‌న్‌గా ఏర్పాటైన క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి త‌న వంతుగా మ‌రో రూ. 1 ల‌క్ష విరాళం అంద‌జేస్తున్న‌ట్లు న‌రేష్ ప్ర‌క‌టించారు.

సంపత్ నంది
కరోనా సంక్షోభం వలన సినిమా షూటింగులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సహాయం అందించేందుకు ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) కు దర్శకుడు సంపత్ నంది 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.