టాలీవుడ్ నుంచి వెల్లువెత్తుతున్న విరాళాలు-4

Monday,March 30,2020 - 02:46 by Z_CLU

రవితేజ
క‌రోనా వ్యాప్తి భ‌యం కార‌ణంగా షూటింగ్‌లు లేక ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలుగు సినీ కార్మికులను ఆదుకోవ‌డంలో భాగంగా హీరో ర‌వితేజ రూ. 20 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. త‌న వంతుగా ఈ మొత్తాన్ని క‌రోనా క్రైసిస్ చారిటీకి అంద‌జేస్తున్న‌ట్లు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఆయ‌న తెలిపారు. ఇవ్వ‌డ‌మ‌నే విష‌యం వ‌చ్చేదాకా తీసుకోవ‌డ‌మ‌నే ప్ర‌యోజ‌నం ఎప్ప‌టికీ పూర్తికాద‌నీ తెలిపిన ర‌వితేజ‌.. ఇది బాధ‌ను కొల‌వ‌డం కాదు, సినీ కార్మికుల అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో తోడ్పాటు మాత్ర‌మే అని పేర్కొన్నారు.

సాయితేజ్
సి.సి.సి ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షేమార్థం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి 10 లక్షలు వితరణ చేసిన సుప్రీమ్ హీరో సాయి తేజ్ ఇప్పుడు రూ.10 ల‌క్ష‌ల విరాళాన్ని సినీ కార్మికుల సహాయ నిధికి అంద‌చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

విశ్వక్ సేన్
“ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో నేను నా బాల్క‌నీలో నిల్చొని ఖాళీగా ఉన్న రోడ్ల‌ను చూస్తున్న‌ప్పుడ‌ల్లా, వీలైనంత త్వ‌ర‌గా సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటే బాగుండున‌నే ఫీలింగ్ నిరంత‌రం క‌లుగుతోంది. కానీ దానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని నాకు తెలుసు. ఇది క‌ష్ట కాలమ‌ని నేను అర్థం చేసుకున్నాను. ఈ సంద‌ర్భంలో మ‌న‌మంతా మ‌నుషులుగా మ‌న బ‌లాన్నీ, బాధ్య‌తాయుత ప్ర‌వ‌ర్త‌న‌నూ, కామ‌న్ సెన్స్‌నూ, క‌రుణ‌నూ స‌మ‌ష్టిగా ప్ర‌ద‌ర్శించాల‌ని అవ‌గ‌తం చేసుకున్నాను. ఈ ప‌రిస్థితిలోని సీరియ‌స్‌నెస్‌ను అర్థం చేసుకొని, అవ‌స‌ర‌మైనంత కాలం ఒక‌రికొక‌రం సామాజిక దూరం పాటించ‌డం చాలా కీల‌కం. అంతే కాకుండా, ఒక‌రికొక‌రం.. అది చిన్న‌దైనా స‌రే.. సాధ్య‌మైనంత వ‌ర‌కు సాయం చేసుకోవాలి, మాన‌వ‌జాతిగా ఐక్యంగా ముందుకు సాగాలి. నా వంతుగా.. ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌, ఆస‌రా కోసం ఎదురుచూస్తున్న తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలోని కార్మికుల‌కు రూ. 5 ల‌క్ష‌లు విరాళంగా అంద‌జేస్తున్నాను.”

శర్వానంద్
హీరో శ‌ర్వానంద్ ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు తొలిసారిగా ‘ఐయామ్ శ‌ర్వానంద్’ అనే ట్విట్ట‌ర్ అకౌంట్‌తో సోష‌ల్ మీడియాలో అడుగుపెట్టారు. దిన‌స‌రి వేతనంతో ప‌నిచేసే కార్మికులు సినిమా సెట్ల‌పై అంద‌రికంటే ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డుతుంటార‌ని పేర్కొన్న ఆయ‌న‌, షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’కి రూ. 15 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు.

కార్తికేయ
మెగాస్టార్ పిలుపుకి మద్దతుగా నిలబడిన ఎంతో మంది తారలతో పాటు యువ హీరో కార్తికేయ గుమ్మకొండ రూ. 2 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు.
ఈ సందర్భంగా, “షూటింగుల్లో భాగంగా సెట్ లో ఎంతో కష్టపడే కార్మికులకు ఇలాంటి ఆపద సమయంలో తోడుగా ఉండడం, వీలైనంత సహాయం చేయడం మన బాధ్యత. రోజంతా మనకోసం నిలబడే వారికోసం మనమిప్పుడు నిలబడదాం. అలాగే క‌రోనా సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డానికి ప్రభుత్వం వారు అమలుపరుస్తున్న నియమాలని పాటిద్దాం, కలిసికట్టుగా ఒకే మాట మీదుండి అంద‌రూ విడివిడిగా ఇంటిప‌ట్టునే సుర‌క్షితంగా ఉంటూ సంతోషంగా ఉందాం” అని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు.