టాలీవుడ్ నుంచి వెల్లువెత్తుతున్న విరాళాలు-2

Saturday,March 28,2020 - 11:57 by Z_CLU

హారిక హాసిని క్రియేషన్స్
కరోనా నివారణ చర్యలకు రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘హారిక అండ్ హాసిని’ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) రూ. 20 లక్షలు విరాళం ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.10 లక్షలు, తెలంగాణా ప్రభుత్వానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు).

అశ్వనీదత్
కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం కోసం ప్ర‌ముఖ నిర్మాత, వైజ‌యంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీద‌త్ రూ. 20 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి రూ. 10 ల‌క్ష‌లు, తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 10 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. క‌రోనా వ్యాప్తి నిరోధం విష‌యంలో రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తున్నాయ‌ని ప్ర‌శంసించిన అశ్వినీద‌త్‌.. ప్ర‌భుత్వాల స‌ల‌హాలు, సూచ‌న‌లు ప్ర‌జ‌లంద‌రూ తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌ని కోరారు.

సుధీర్ బాబు
కరోనా పై పోరాటానికి ప్ర‌ముఖ హీరో సుధీర్ బాబు కూడా ముందుకొచ్చారు. 2 ల‌క్ష‌ల రూపాయ‌లు విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఈ మొత్తంలో ల‌క్ష రూపాయ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హా నిధికి మ‌రో లక్ష రూపాయ‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కి అందించ‌నున్నారు. దేశ ప్ర‌ధాని పిలుపు మేర‌కు 21 రోజులు లాక్ డౌన్ కి త‌న సంపుర్ణ మ‌ద్ధ‌త్తు తెలిపిన సుధీర్ బాబు, ఇంటి ద‌గ్గ‌ర ఉంటూనే ఫిట‌నెస్ ని మెయింటైన్ చేయడంపై వీడియోలు చేసి విడుద‌ల చేశారు.

దగ్గుబాటి కుటుంబం
క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం విశ్రాంతి లేకుండా కృషి చేస్తుంది. వీరికి సాయంగా తెలుగు ప‌రిశ్ర‌మ కూడా న‌డుం బిగించింది. ఇప్పటికే ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు భారీ విరాళాలు ప్ర‌క‌టించ‌గా, తాజాగా ద‌గ్గుబాటి ఫ్యామిలీకి చెందిన వెంకటేష్‌, రానా, సురేష్ బాబు సంయుక్తంగా కోటి రూపాయ‌ల విరాళాన్ని అందించ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ విరాళాన్ని లాక్‌డౌన్ కార‌ణంగా ప‌నిలేక ఇంటికే ప‌రిమిత‌మైన సినిమా వ‌ర్క‌ర్స్‌కి అలానే హెల్త్ వ‌ర్క‌ర్స్‌కి అందించ‌నున్న‌ట్టు తెలిపారు.