సరదా సెప్టెంబర్: అన్నీ వినోదాన్ని పంచే సినిమాలే

Tuesday,September 04,2018 - 11:00 by Z_CLU

ప్రతి నెలా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో అన్ని జానర్స్ కు చెందిన మూవీస్ ఉంటాయి. కానీ ఈనెల మాత్రం సంథింగ్ స్పెషల్. ఈ నెలలో విడుదలైన సినిమాల్లో 90శాతం ఎంటర్ టైనర్స్ ఉన్నాయి. థ్రిల్, సస్పెన్స్, హారర్ లాంటి ఎలిమెంట్స్ కు దూరంగా పూర్తి వినోదాన్నందించే సినిమాలే ఎక్కువ.

 

సెప్టెంబర్ ఫస్ట్ వీకెండ్ లో 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో అల్లరి నరేష్, సునీల్ నటించిన ‘సిల్లీ ఫెలోస్’ ఒకటి..  ‘వెలైను వందుట్ట వెల్లైకారాన్’ అనే తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం నుండి థియేటర్స్ లో సందడి చేయనుంది. రానా సమర్పిస్తున్న ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా కూడా అదే రోజు విడుదలవుతుంది. రిలీజ్ కి ముందే మంచి సినిమాగా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాతో చాలా మంది కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలతో పాటు రాజా గౌతం- చాందిని జంటగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన  మను, కొత్తవారితో రూపొందిన’ ప్రేమకు రెయిన్ చెక్’ సినిమాలు కూడా సెప్టెంబర్ 7 న రిలీజ్ అవుతున్నాయి.

 

సెప్టెంబర్ 13న వినాయక చవితి కానుకగా మూడు సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. మారుతి డైరెక్షన్ లో నాగచైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’, సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యూ టర్న్’సినిమాలతో పాటు కొత్తవారితో రూపొందించిన ‘మసక్కలి’ సినిమా కూడా అదే రోజు విడుదలవుతుంది. రియల్ లైఫ్ భార్యభర్తలు నాగచైతన్య-సమంత చెరో సినిమాతో ఒకే రోజు పోటీ పడుతున్నారు. వీటిలో శైలజారెడ్డి అల్లుడు సినిమాపై భారీ అంచనాలున్నాయి. తన కెరీర్ లోనే ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతోందంటూ గర్వంగా చెబుతున్నాడు చైతూ.

 

సుధీర్ బాబు నిర్మాతగా మారి సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమా ఈ నెల 21 న విడుదల కానుంది. ఇది కూడా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్. ఈ సినిమాతో ఆర్.ఎస్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు ‘శుభలేఖలు’ అనే మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కూడా ఆరోజే థియేటర్స్ లోకి వస్తుంది.

 

ఇక సెప్టెంబర్ ఆఖరి వారంలో మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘దేవదాస్’ థియేటర్లలోకి వస్తోంది. నాగార్జున-నాని కాంబినేషన్ లో శ్రీరామ్ ఆదిత్య  డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా… ఔట్ అండ్ ఔట్ కామెడీగా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 26న దాసు, దేవ కలిసి థియేటర్లలోకి వస్తున్నారు.

 

ఇక సెప్టెంబర్ లో నేను కూడా ఉన్నానంటూ ‘ఇదం జగత్’ సినిమాతో 28న ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు సుమంత్. ఈ సినిమాతో అనిల్ అనే డెబ్యూ డైరెక్టర్ ను పరిచయం చేస్తున్నాడు సుమంత్.  ఇక ఇదే నెలలో ఫైట్ మాస్టర్ విజయ్ అబ్బాయి రాహుల్ విజయ్  హీరోగా పరిచయం అవుతున్న ‘ఈ మాయ పేరెమిటో’ సినిమాతో పాటు జయప్రద ప్రధాన పాత్రలో నటించిన సువర్ణ సుందరి కూడా విడుదలవుతుంది.

ఇలా సెప్టెంబర్ లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో 90శాతం సరదాగా సాగిపోయే సినిమాలే ఉన్నాయి.