అక్టోబర్ బాక్సాఫీస్ రివ్యూ

Wednesday,October 31,2018 - 03:02 by Z_CLU

ఎప్పట్లానే టాలీవుడ్ లో అక్టోబర్ బాక్సాఫీస్ కూడా కొన్ని మెరుపులతో ముగిసింది. అంచనాలను అందుకొని కొన్ని సినిమాలు హిట్ అయితే, ఊహించని విధంగా మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. మిగతా సినిమాలన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి.

 

‘దేశంలో దొంగలు పడ్డారు’ అనే సినిమాతో అక్టోబర్ బాక్సాఫీస్ పరుగు మొదలైంది. మూవీపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఆ అంచనాలకు తగ్గట్టే ఆడింది ఈ సినిమా. ఇక విజయ్ దేవరకొండ నటించిన నోటా సినిమా మాత్రం అందరికీ షాకిచ్చింది. ‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ‘నోటా’ బ్రహ్మాండంగా ఆడుతుందని అంతా ఊహించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇక ఇదే వారం విడుదలైన ‘భలే మంచి చౌకబేరమ్’ సినిమా కూడా ఫ్లాప్ అయింది.

 

అక్టోబర్ రెండో వారంలో మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ అరవింద సమేత థియేటర్లలోకి వచ్చింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఆ అంచనాలన్నింటినీ నిజం చేస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అరవింద సమేత. ఈ దసరాకు సిసలైన సందడి తీసుకొచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో స్టడీగా రన్ అవుతోంది.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఫస్ట్ మూవీగా వచ్చిన అరవింద సమేత ప్రేక్షకుల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. వీళ్లిద్దరి కాంబోలో ఆడియన్స్ ఎలాంటి సినిమా ఎక్స్ పెక్ట్ చేశారో,సరిగ్గా అలానే ఉంది అరవింద సమేత. ఎన్టీఆర్ మెస్మరైజింగ్ యాక్టింగ్, అతడి మార్కెట్ స్టామినాకు త్రివిక్రమ్ రైటింగ్ యాడ్ అయితే ఎలా ఉంటుందో.. అరవింద సమేత కలెక్షన్లు ప్రూవ్ చేస్తున్నాయి. ఈ మూవీతో పాటు వచ్చిన ‘మూడు పువ్వులు ఆరు కాయలు’, ‘బేవర్స్’ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

 

ఇక మూడో వారంలో రామ్ నటించిన హలో గురు ప్రేమకోసమే, విశాల్ చేసిన పందెంకోడి-2 సినిమాలు వచ్చాయి. దసరా వీక్ లో థియేటర్లలోకి వచ్చిన ఈ రెండు సినిమాల్లో ఒకటి పక్కా క్లాస్ అయితే,ఇంకోటి మాస్ మూవీ. వీటిలో రామ్ సినిమా దసరా సీజన్ లో సక్సెస్ ఫుల్ మూవీగా నిలిస్తే, పందెంకోడి-2 సినిమా బి, సి సెంటర్లలో హిట్ అయింది.

 

అక్టోబర్ లాస్ట్ వీక్ లో ఏకంగా 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ దురదృష్టవశాత్తూ ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు. ఓ మోస్తరు అంచనాల మధ్య వచ్చిన వీరభోగవసంతరాయలు సినిమా కూడా ఫ్లాప్ అయింది. సుధీర్ బాబు, నారా రోహిత్, శ్రీవిష్ణు, శ్రియ లాంటి నటీనటులు ఉన్నప్పటికీ ఈ సినిమా డిసప్పాయింట్ చేసింది. ఈ మూవీతో పాటు వచ్చిన బంగారి బాలరాజు, రథం, ఐశ్వర్యాభిమస్తు, 2 ఫ్రెండ్స్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.