ఇయర్ ఎండ్ స్పెషల్ : కొత్త హీరోలు

Saturday,December 22,2018 - 10:02 by Z_CLU

ఈ ఏడాది టాలీవుడ్ లోకి కొత్తగా అడుగుపెట్టిన రష్మిక, నిధి అగర్వాల్, కైరా అద్వానీ, పాయల్ రాజ్ పుత్ మెరుపులు మెరిపించారు. మరి కొత్త హీరోల సంగతేంటి? ఈ ఏడాది కూడా కొత్త హీరోల సందడి కనిపించింది. దాదాపు 15 మందికి పైగా హీరోలు తెరపైకొచ్చారు. కానీ వాళ్లలో మెరిసింది మాత్రం కొంత మందే.

ఆర్ఎక్స్-100 సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు కార్తికేయ. ఈ ఏడాది ఇండస్ట్రీలోకి ఇలా ఎంటర్ అవుతూనే సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో ఇతడు. ఈ ఒక్క సినిమా సక్సెస్ తో అమ్మాయిల హాట్ ఫేవరెట్ అయిపోయాడు కార్తికేయ. ఆర్ఎక్స్100 సక్సెస్ తో న్యూ ఇయర్ లో మరిన్ని క్రేజీ మూవీస్ లైన్లో పెట్టాడు

ఈ ఏడాది మెగా కాంపౌండ్ నుంచి కూడా ఓ హీరో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. విజేత సినిమాతో చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ తెలుగుతెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. డాన్స్ లో కూడా మెగా కాంపౌండ్ హీరో అనిపించుకున్నాడు.

2018లో తెలుగుతెరకు పరిచయమైన మరో హీరో రాహుల్ విజయ్. ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు ఇతడు. ఈమాయ పేరేమిటో సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు ఇంట్రడ్యూస్ అయ్యాడు. లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నాడు రాహుల్. ప్రస్తుతం నిహారిక కొణెదలతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు.

టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన మరో హీరో యష్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమాతో ఈ నటుడు తెలుగు వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ మూవీలో యష్ లుక్స్, టాలీవుడ్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేశాయి.కన్నడనాట ఇప్పటికే రాకింగ్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ నటుడు, కేజీఎఫ్ తర్వాత తన సినిమాల్ని రెగ్యులర్ గా తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

రక్షిత్ తరహాలోనే మారుతి చలవతో ఇండస్ట్రీకి పరిచయమైన మరో హీరో సుమంత్ శైలేంద్ర. మారుతి అందించిన కథతో సుమంత్ శైలేంద్ర హీరోగా నటించిన ఆ సినిమా బ్రాండ్ బాబు. ఈషా రెబ్బా, పూజిత, మురళీ శర్మ, రాజా రవీంద్ర లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమా సుమంత్ శైలేంద్రకు టాలీవుడ్ లో మంచి ఫ్లాట్ ఫాం క్రియేట్ చేసింది.

ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో విమర్శకుల ప్రశంసలు ఎక్కువగా అందుకున్న మూవీ కేరాఫ్ కంచరపాలెం. ఈ సినిమాతో మోహన్ భగత్, కార్తీక్ అనే ఇద్దరు నటులు టాలీవుడ్ కు పరిచయమయ్యారు. సినిమాలో వీళ్లిద్దరి యాక్టింగ్ అందరికీ బాగా నచ్చింది. కొత్త ఏడాదిలో మరిన్ని కొత్త ఛాన్సుల కోసం వీళ్లిద్దరూ వెయిటింగ్.

చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చినా మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో డెబ్యూ హీరో అభినవ్. హుషారు సినిమాలో నలుగురిలో ఒకడిగా ఉన్నప్పటికీ తన యాక్టింగ్ టైమింగ్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేయగలిగాడు అభినవ్. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది ఈ మూవీ. కొత్త ఏడాదిలో ఈ కుర్రాడికి మరిన్ని అవకాశాలు రావడం గ్యారెంటీ.

ఇయర్ ఎండింగ్ లో వచ్చినప్పటికీ ఓ మోస్తరుగా ఎట్రాక్ట్ చేసిన హీరో ధనంజయ్. వర్మ సమర్పించిన భైరవగీత సినిమాతో టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అయ్యాడు ఈ హీరో. నిజానికి ఇతడు ఇప్పటికే 10 సినిమాలు చేశాడు. కానీ తెలుగుతెరపైకి రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. సో.. టాలీవుడ్ కు ఇతడు డెబ్యూ హీరో కిందే లెక్క.