కరోనా కట్టడికి టాలీవుడ్ చేయూత

Wednesday,April 15,2020 - 01:58 by Z_CLU

క‌రోనా మ‌హ‌మ్మారిపై తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న కృషికి త‌న వంతు భాగ‌స్వామ్యం అందించ‌డానికి తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ముందుకు వ‌చ్చింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి
రూ. 25 ల‌క్ష‌లు విరాళంగా అందించింది.

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో విధి నిర్వహణలో ఉంటున్న హైదరాబాద్ పోలీసులకు ఫేస్ ప్రొటెక్షన్ షీల్డ్ లను అందజేసింది డాక్టర్స్ అసోసియేషన్. ముఖ్య అతిథిగా హాజరై ఫేస్ ప్రొటెక్షన్ షీల్డ్స్ ను ఆవిష్కరించారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ మనస్పూర్తిగా తెలంగాణ పోలీస్ ను అభినందించారు.

ఛారిటీలో ఎప్పుడూ ముందుండే హీరో శ్రీకాంత్, లాక్ డౌన్ టైమ్ లో మరింత యాక్టివ్ అయ్యారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పోలీసులతో పాటు రోజువారీ కూలీలకు ఆహారం, హ్యాండ్ శానిటైజర్లు పంచారు.

ఇదివ‌ర‌కే క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం స‌హాయ‌నిధికి రూ. 10 ల‌క్ష‌లు, తెలంగాణ సీఎం స‌హాయ‌నిధికి రూ. 10 ల‌క్ష‌లు అంద‌జేసిన సుప్ర‌సిద్ధ చ‌ల‌న‌చిత్ర నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ తాజాగా క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి మ‌రో రూ. 5 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించింది. ఫ‌లితంగా ఇప్ప‌టివ‌ర‌కు వైజ‌యంతీ మూవీస్ అంద‌జేసిన‌ క‌రోనా విరాళం మొత్తం రూ. 25 ల‌క్ష‌ల‌కు చేరుకుంది.

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు స‌తీమ‌ణి శ్యామలా దేవి సామాజిక కార్య‌క్ర‌మాల్లో ఎప్పుడూ ముందుంటారు. ఇటీవ‌లే లాక్ డౌన్ నేప‌థ్యంలో ఆప‌న్న హ‌స్తంలో భాగంగా 4 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. కాగా హైద‌రాబాద్ సిటీలో లాక్ డౌన్ సేవ‌ల్లో పాల్గొంటున్న పారిశుద్ది కార్మికులు, పోలీసు సిబ్బందికి..మీడియా వారికి ఆమె స్వ‌హ‌స్తాల‌తో త‌యారు చేసిన పాయ‌సాన్ని పంపిణీ చేసారు.

క‌రోనా సృష్టించిన విపత్తులో ప్రాణాలకు తెగించి ఉద్యోగ భాద్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న పోలీస్ అధికారుల‌తో ముచ్చ‌టించారు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ.హైద‌రాబాద్ క‌మీష‌న‌రేట్ లో హైద‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్
అంజ‌న్ కుమార్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌మ విధుల‌ను నిర్వ‌ర్తిస్తూ నిజ‌మైన హీరోలుగా నిలుస్తున్న పోలీసు అధికారుల‌ను, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప‌ల‌క‌రించారు హీరో విజయ్
దేవ‌ర‌కొండ‌. నిరంత‌రం ప‌నిచేస్తూ అల‌స‌ట పొందుతున్న పోలీస్ సిబ్బందికి విజ‌య్ ప‌ల‌క‌రింపులు , మాటలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయ‌ని అధికారుల‌ను అన్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం స్తంభించి పోయింది. చిత్ర పరిశ్రమలో పనులు కూడా ఆగిపోయాయి. దీనితో చాలా మంది నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు తనవంతుగా నిర్మాతల మండలికి ఆపన్న హస్తం అందించేందుకు సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ముందుకు వచ్చారు. మొన్న ఆర్ధికంగా వెనుకబడిన నిర్మాతలకు 10,11,111 రూపాయలు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా లాక్ డౌన్ పొడిగించిన కారణంగా ఇప్పుడు మరో 10,11,111 రూపాయలు అనౌన్స్ చేశారు. ఈ మొత్తంలో 5 లక్షలు ఆర్ధికంగా వెనుకబడిన నటి నటులకు..జూనియర్ నటీనటులకు ఇవ్వడం జరుగుతుంది. మరియు 3,11,111ను ఆర్థికంగా వెనుకబడిన నిర్మాతలకు ఇస్తారు.

హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్స్, మాస్క్ లు పంపిణీ చేశారు నిర్మాత దిల్ రాజు.

ప్రభుత్వం ప్రకటిస్తున్న లాక్ డౌన్ నియమాల్ని అందరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు సినీ నటి మీనా. ప్రభుత్వం మాటలు వినకపోతే అమెరికా, ఫ్రాన్స్ కు పట్టిన గతే మనకూ పడుతుందని హెచ్చరించారు.
ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేయడానికి ఇంతకంటే మంచి టైమ్ దొరకదన్నారు.

ప్రధాని మోడీ సూచించిన నియమాల్ని తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాలని నటుడు సాయికుమార్ పిలుపునిచ్చారు. కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కర్ని గౌరవించాలని, వారికి సహకరించాలని కోరారు. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం అన్నారు.