ఇయర్ ఎండ్ స్పెషల్ : కొత్త కథలు

Friday,December 21,2018 - 10:01 by Z_CLU

టాలీవుడ్ లో ఈ ఏడాది కొత్త కథలతో కూడిన ప్రయోగాత్మకమైన సినిమాలు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించాయి.. తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ  కొన్ని సినిమాలు అందరినీ ఎట్రాక్ట్ చేసాయి.  ఈ ఇయర్   ప్రయోగాలతో కూడిన సినిమాలపై ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.

ఇప్పటికే తెలుగులో చాలా రివేంజ్ డ్రామా సినిమాలొచ్చినప్పటికీ రివేంజ్ సినిమాల్లో స్పెషల్ అనిపించుకుంది ‘రంగస్థలం’. చిట్టి బాబు అనే పల్లెటూరి చెవిటి కుర్రాడి నటించి నటుడిగా ఓ ప్రయోగం చేసాడు రామ్ చరణ్.  ఓ సాదా సీదా రివేంజ్ కథను 1980 నేపథ్యంలో తెరకెక్కించి ఎవరూ ఊహించని క్లైమాక్స్ తో ప్రయోగం చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు సుకుమార్.  ప్రేక్షకులను మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి కలెక్షన్స్ తో  తెలుగు సినిమాను ముందుకు తీసుకెళ్ళాడు.

ఈ ఏడాది నాగ్ అశ్విన్ కూడా సావిత్రి గారి బయోపిక్ తో ఓ ప్రయోగం చేసాడు. అలనాటి ‘మహానటి’ సావిత్రి గారి జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించి ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతి కలిగించాడు.  ఈ తరానికి మహానటి గురించి ఏం తెలుసు… అసలు  ఈ బయోపిక్ డబ్బులు తెచ్చిపెడుతుందా..? అనే ప్రశ్నలకు చెక్ పెట్టి బ్లాక్ బస్టర్ హిట్ తో అందరికీ జవాబిచ్చింది మహానటి.

ఫ్యాక్షన్ సినిమాల్లో మరో కోణాన్ని ఆవిష్కరించిన సినిమా ‘అరవింద సమేత’..  రెండూర్ల మధ్య వైరం, రెండు గుంపుల యుద్ధం, సినిమా ప్రారంభమైన కాసేపటికి హీరో ఎంట్రీ , క్లైమాక్స్ లో భారీ ఫైట్ ఫ్యాక్షన్ సినిమా అంటే ఇదేకదా అనుకునే ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ సినిమా అందించాడు త్రివిక్రమ్. రొటీన్ కి భిన్నంగా సినిమా ఆరంభంలోనే  ఓ భారీ ఫైట్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఎమోషనల్ గా కథను నడిపించాడు. యుద్ధం తర్వాత ఆ కుటుంబాల పరిస్థితి వారి బాధలను కళ్ళకి కట్టినట్టుగా చూపించి దర్శకుడిగా కొత్త ప్రయోగం చేసాడు త్రివిక్రమ్.

‘అ!’ సినిమా ఈ ఏడాది అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఎవరూ ఊహించని క్లైమాక్స్ తో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ నానిని సైతం  ఇంప్రెస్ చేసి నిర్మాతగా మార్చింది. కొత్త కథ కావడంతో నటీ నటులతో పాటు నాని కూడా నిర్మాతగా ఈ సినిమాకు మంచి సపోర్ట్ అందించి ముందుకు తీసుకెళ్ళాడు. మొదటి షోకే అందరి మన్ననలు అందుకొని టాలీవుడ్ లో ఓ కొత్త ప్రయోగం అనిపించుకుంది ‘అ!’.

ఈ ఇయర్ ‘RX100’ సినిమాతో  బోల్డ్ ఎటెంప్ట్ చేసాడు అజయ్ భూపతి.. ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని ఓ లవ్ స్టోరీ తో యూత్ ని మెస్మరైజ్ చేసాడు.  ఇంత వరకూ ఏ హీరోయిన్ ని చూడని ఓ నెగిటీవ్ క్యారెక్టర్ లో పాయల్ ని చూపించి సరికొత్త క్లైమాక్స్ తో ఓ ప్రయోగం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అజయ్.

‘గూఢచారి’ కూడా ఈ ఇయర్ ఆడియన్స్ కి ఓ కొత్త ఎక్స్పీరియన్స్ అందించింది. హాలీవుడ్ స్టైల్ మేకింగ్ తో స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా స్టార్స్ ని సైతం ఎట్రాక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర  బాగా పెర్ఫాం చేసింది. అడివి శేష్ , దర్శకుడు శశి చేసిన ఈ ప్రయోగం టాలీవుడ్ లో ఓ మంచి  ఎక్స్పరిమెంట్ అనిపించుకుంది.

కంచర పాలెం అనే ఊరు అక్కడ నివసించే కొందరి జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది ‘ C/O కంచరపాలెం’.. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన  ఈ సినిమా రిలీజ్ కి ముందే అందరి ప్రశంసలు అందుకొని చిన్న సినిమాలకు ఊపిరి పోసింది. నటనలో ఏ మాత్రం అనుభవం లేని కంచరపాలెం స్థానికులతో వెంకటేష్ మహా చేసి ఈ ప్రయోగానికి కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా కథలన్నిటినీ ఓ కంచికి చేర్చిన క్లైమాక్స్ సినిమా అభిమానులకు కొత్త అనుభూతి కలిగించింది.

తెలుగుతెరపై ఇప్పటి వరకూ చూడని పంచభూతాల కాన్సెప్ట్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసింది ‘సాక్ష్యం’. పంచభూతాల సహకారంతో హీరో తీర్చుకునే రివేంజ్ కాన్సెప్ట్  ఈ ఏడాది ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించింది.

విజయ్ దేవరకొండ నుండి ఈ ఇయర్ వచ్చిన ‘టాక్సీ వాలా’ కూడా ఓ ప్రయోగాత్మక సినిమా అనిపించుకొని ఆకట్టుకుంది.  కామెడీ , హారర్ , సైకలాజికల్ థ్రిల్లర్ ఇలా కొన్ని జోనర్లతో మిక్సయిన ఈ స్టోరీ ఆడియన్స్ కి ఓ డిఫరెంట్ ఫీల్ కలిగించి సూపర్ హిట్ సినిమాల లిస్టు లో చేరింది.

మొదటి సినిమా ‘ఘాజీ’ తో ప్రేక్షకులను సబ్ మెరీన్ లోకి తీసుకెళ్ళి ఎంటర్టైన్ చేసిన సంకల్ప్ రెడ్డి  ఈ ఏడాది ప్రేక్షకులను అంతరిక్షానికి తీసుకెళ్ళే ప్రయోగం చేసి మరోసారి సక్సెస్ అయ్యాడు. తెలుగులో మొదటి స్పేస్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా 2018 ప్రయోగాల్లో ఒకటిగా నిలిచింది.