ఇయర్ ఎండ్ స్పెషల్ : కొత్త దర్శకులొచ్చారు

Wednesday,December 19,2018 - 10:02 by Z_CLU

టాలీవుడ్ లో ప్రతీ ఏడాది కొందరు కొత్త దర్శకులు కెరటంలా దూసుకొస్తూ తమ డెబ్యూ మూవీతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటారు. ఈ ఇయర్ కూడా కొందరు కొత్త దర్శకులు తమ డెబ్యూ మూవీతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి హిట్స్ అందుకున్నారు. ఈ ఏడాది తొలి సినిమాతో ప్రేక్షకులను అలరించి వారి టాలెంట్ నిరుపించుకున్న దర్శకులపై ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.

వెంకీ కుడుముల… గతంలో తేజ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఈ దర్శకుడు ఈ ఇయర్ ‘ఛలో’ అంటూ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించి మంచి ఎంటర్ టైన్ మెంట్ అందించాడు. ఈ ఇయర్ బెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా ‘ఛలో’ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తను అనుకున్న కథను ఎక్కడా తడబడకుండా ఎంటర్టైన్ చేస్తూ తెరకెక్కించి మొదటి సినిమాతోనే దర్శకుడిగా శెభాష్ అనిపించుకున్నాడు. అంతే కాదు  ఓ గ్రాండ్ హిట్ కొట్టాలని చూస్తున్న నాగ శౌర్య ని ‘ఛలో’ అంటూ మళ్ళీ ఫాంలోకి తీసుకొచ్చాడు.

 ‘తొలి ప్రేమ’ అంటూ తన డెబ్యూ మూవీతో యూత్ ఆడియన్స్ ని మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి రప్పించి సూపర్ హిట్ అందుకున్నాడు వెంకీ అట్లూరి. వరుణ్ తేజ్ – రాశి ఖన్నా లవ్ స్టోరీతో మళ్ళీ అందరికీ తమ తొలిప్రేమను గుర్తుచేసాడు. ఫస్ట్ లుక్ నుండి సినిమా రిలీజ్ వరకూ ప్రేక్షకులు సినిమాపై పెట్టుకున్న అంచనాలను ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. యాక్టర్ నుండి డైరెక్టర్ గా మారిన వెంకీ ఫస్ట్ సినిమాతోనే లవ్ స్టోరీస్ ఎక్స్పర్ట్  అనిపించుకుని మరో లవ్ స్టోరీతో రెడీ అవుతున్నాడు.

ఈ ఇయర్ తెలుగులో వచ్చిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్స్ లో ‘అ!’ సినిమా ఒకటి. ఈ సినిమాతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్ వర్మ నాని ని నిర్మాతగా మార్చి అందరినీ అవాక్కయ్యేలా చేసాడు. ముఖ్యంగా తన విజన్ , టేకింగ్ తో విమర్శకుల ప్రశంశలు కూడా అందుకున్నాడు. టాలీవుడ్ లో డిఫరెంట్ స్టోరీస్ రెడీ చేసుకుంటున్న దర్శకులకు తన సక్సెస్ తో ఎగ్జాంపుల్ గా నిలిచాడు.

 

ఫస్ట్ సినిమాతో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని ఓ బోల్డ్ ఎటెంప్ట్ చేసి ‘ఆర్ ఎక్స్ 100’ తో మంచి వసూళ్లు రాబట్టాడు అజయ్ భూపతి. వర్మ శిష్యుడిగా టాలీవుడ్ కి పరిచయమైన ఈ దర్శకుడు యూత్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో కార్తికేయ -పాయల్ రాజ్ పుత్ లను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసిన అజయ్ ఈ ఇద్దరి నుండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టి ఆడియన్స్ కి ఓ డిఫరెంట్ లవ్ ఎంటర్టైనర్ మూవీ ని అందించాడు.

ఈ ఇయర్ కొంత మంది కొత్త దర్శకులతో పాటు ఎప్పటి నుండో కంటున్న  కలను నెరవేర్చుకున్నాడు వక్కంతం వంశీ. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో  రైటర్ నుండి డైరెక్టర్ గా మారి మెగా ఫోన్ పట్టిన  వంశీ ఎట్టకేలకు  దర్శకుల లిస్టులో తన పేరు నమోదు చేసుకున్నాడు.

‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో  దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంకటేష్ మహా.. తన డెబ్యూ మూవీతో  ఓ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. రిలీజ్ కి ముందే ప్రిమియర్ షోల ద్వారా టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న వెంకటేష్ స్టార్ డైరెక్టర్స్ ని సైతం మెస్మరైజ్ చేసాడు. తన దర్శకత్వ ప్రతిభతో  రాజమౌళి… సుకుమార్..క్రిష్.. వంటి టాప్ డైరెక్టర్స్ తో శెభాష్ అనిపించుకున్నాడు. కంచరపాలెం అనే ఊరిలో జీవనాన్ని సాగించే కొందరి జీవితాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించి ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించాడు. కొత్త వారితో తెలుగు నేటివిటీ కథతో  ఓ చిన్న సినిమాను రూపొందించి ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఘనత వెంకటేష్ కే దక్కుతుంది.

 

‘నీది నాది ఒకే కథ’ అంటూ కొందరు కుర్రాళ్ళ జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాడు వేణు ఉడుగుల. శ్రీ విష్ణు క్యారెక్టర్ తో తను చెప్పాలనుకున్న కథని పర్ఫెక్ట్ గా చెప్పి దర్శకుడిగా విమర్శకుల ప్రశంశలు అందుకున్నాడు. మొదటి సినిమా అందించిన ఉత్సాహంతో  నెక్స్ట్ సినిమాకు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ రెడీ చేసుకుంటున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.

 

ఈ ఏడాది ‘గూఢచారి’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శశి కిరన్ తన డెబ్యూ మూవీతో స్టార్ హీరోలను సైతం ఎట్రాక్ట్ చేసాడు. అప్పుడెప్పుడో సూపర్ స్టార్  కృష్ణ  చేసిన జేమ్స్ బ్యాండ్ సినిమాను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి తన టాలెంట్ తో ఆడియన్స్ కి కిక్ ఇచ్చాడు. నిజానికి ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా అనుకోని రీతిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీ కి వచ్చి యాక్టర్ గా మారిన రాహుల్ రవీంద్రన్ కూడా ఈ ఏడాది ‘చిలసౌ’ తో డైరెక్టర్ గా తన కల నెరవేర్చుకున్నాడు. సుశాంత్ ని ఓ క్లాస్ హీరోగా చూపించి రొమాంటిక్ లవ్ స్టోరీతో ఎంటర్టైన్ చేసాడు రాహుల్. ఓ స్మాల్ బడ్జెట్ మూవీ గా ‘చిలసౌ’ ను తెరకెక్కించి దర్శకుడిగా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. ఫస్ట్ మూవీతోనే డైరెక్టర్ గా సక్సెస్ సాదించిన ఈ హీరో కం డైరెక్టర్ అన్నపూర్ణ బ్యానర్ లో నెక్స్ట్ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.

ఈ ఇయర్ షార్ట్ ఫిలిం మేకర్స్  చాలా మంది దర్శకులుగా మారి తమ లక్ చేసుకున్నారు. అందులో ఆర్ .ఎస్ నాయుడు ఒకడు. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన నాయుడు డెబ్యూ సినిమాతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. సినిమాలో కామెడీ , సెంటిమెంట్ ని బ్యాలెన్స్ చేస్తూ ఆడియన్స్ ని మెప్పించాడు. ఈ సినిమాతో సుదీర్ బాబు ని నిర్మాతగా మార్చిన ఆర్.ఎస్.నాయుడు  టాలెంటెడ్ యాక్ట్రెస్ నభా నటేష్ ను టాలీవుడ్ కి పరిచయం చేసాడు.

కన్నడలో ‘యూ టర్న్’ అనే సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పవన్ కుమార్ అదే సినిమాను రీమేక్ చేసి ఈ ఇయర్ టాలీవుడ్ డెబ్యూ డైరెక్టర్స్ లిస్టు లో చేరాడు. సమంతను సరికొత్త క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసి దర్శకుడిగా మంచి మార్కులు అందుకున్న పవన్ ప్రస్తుతం ‘యూ టర్న్’ నిర్మాతలతోనే మరో తెలుగు సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇయర్ ఎండింగ్ లో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే థ్రిల్లర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంతోష్ జాగర్లపూడి తన డైరెక్షన్ స్కిల్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమాలో వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాలను అనుభవం ఉన్న డైరెక్టర్ లా డీల్ చేసిన సంతోష్  దర్శకుడిగా మంచి మార్కులే అందుకున్నాడు.