పెద్ద మనసు చాటుకుంటున్న టాలీవుడ్

Saturday,April 11,2020 - 11:13 by Z_CLU

చదలవాడ శ్రీనివాసరావు
కరోనా వైరస్ ప్రభావంతో చాలా మంది చిన్న నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనవంతుగా నిర్మాతల మండలికి ఆపన్న హస్తం అందించేందుకు సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ముందుకు వచ్చారు. ఆయన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి రూ. 10,11,111 విరాళం అందించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిర్మాతల కోసం ఈ మొత్తం ఉపయోగించాలని కోరారు. అవసరమైతే మరోసారి కూడా తాను సాయం చేస్తానని తెలిపారు.

దిల్ రాజు

క‌రోనా వ్యాధి వ్యాప్తి మరియు నిర్మూలనకు తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న కృషికి త‌మ వంతు భాగ‌స్వామ్యం అందించ‌డానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ముందుకొచ్చింది. ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 10 ల‌క్ష‌లు విరాళంగా కొన్ని రోజుల క్రితం సంస్థ తరపున నిర్మాతలు దిల్ రాజు మరియు శిరీష్ ప్రకటించారు. ఆ మేర‌కు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు మంత్రి కేటీఆర్‌ ను క‌లిసి రూ. 10 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు.

TSFCC
క‌రోనా మ‌హ‌మ్మారిపై తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న కృషికి త‌న వంతు భాగ‌స్వామ్యం అందించ‌డానికి తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ముందుకు వ‌చ్చింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 25 ల‌క్ష‌లు విరాళంగా అందించింది. ఈ మేర‌కు చాంబ‌ర్ ప్ర‌తినిధులు మినిస్ట‌ర్ కేటీఆర్‌ను క‌లిసి రూ. 25 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మ‌న్ పి. రామ్మోహ‌న్ రావు, చాంబ‌ర్ అధ్య‌క్షుడు కె. ముర‌ళీమోహ‌న్ రావు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సునీల్ నారంగ్‌, అభిషేక్ నామా పాల్గొన్నారు.

జీవన్

15 రోజులుగా దాదాపుగా రోజుకు వెయ్యి మందికి కడుపు నింపుతున్నాడు నటుడు జీవన్.. ఇప్పుడు నిత్యావసర సరుకులు రెండు వేల మందికి పంచుతున్నాడు.. తన సంపాదన మొత్తం ఖర్చు అయినా ప‌ర్లేదు కానీ పరులకు చేసే సాయం ఇచ్చే సంతృప్తి కి సాటి రాదు అంటున్నాడు.. లాక్ డౌన్ అయిన మ‌రుస‌టి రోజు నుండీ తమ రెస్టారెంట్ ని క‌రోనా బారిన ప‌డి ఆకలి తో అవ‌స్థ‌లు ప‌డుతున్న వారిని ఆదుకునే సేవా కేంద్రంగా మ‌లిచాడు. ప్ర‌తి రోజూ వెయ్యి మందికి పైగా స‌రిప‌డే ఆహారం త‌యారు చేసి సైబ‌రాబాద్ కరోనా కంట్రోల్ రూమ్ అధికారి ప్ర‌వీణ్ రెడ్డి బృందానికి అందిస్తున్నాడు జీవ‌న్.