పెద్ద మనసు చాటుకుంటున్న టాలీవుడ్

Friday,April 10,2020 - 11:36 by Z_CLU

కరోనా కష్టకాలంలో టాలీవుడ్ ప్రముఖులంతా ముందుకొచ్చారు. తమకు తోచిన రీతిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. చిరంజీవి నేతృత్వంలో స్థాపించిన కరోనా క్రైసిస్ ఛారిటీతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు. తాజాగా మరికొంతమంది ప్రముఖులు మరో విధంగా ముందుకొచ్చారు.


విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్, టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సోనూ సూద్ తన మంచి మనసు చాటుకున్నాడు. కరోనా వైరస్‌ పై పోరాటంలో విశేష కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ముంబైలోని తన హోటల్‌ను ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. సిబ్బంది తన హోటల్లో ఉండొచ్చని చెప్పాడు. ఈ విషయాన్ని ఇప్పటికే ముంబై మున్సిపల్ అధికారులకు, ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ కు చెప్పాడు. ముంబై లోని జుహూ ప్రాంతంలో హోటల్ శక్తి సాగర్ లో సోనూసూద్ కుటుంబానికి ఆరంతస్తుల హోటల్ వుంది.

డిగ్రీ కాలేజీ హీరో వరుణ్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర 100 మంది ఆర్టిస్టులకు నిత్యావసరాలు అందించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర యూనియన్ కార్డ్ లేని 100 ఆర్టిస్ట్స్ కు బియ్యం, ఇతర పప్పులు అందించాడు. ఈ టైమ్ లో వరుణ్ ఇలా రియాక్ట్ అవ్వడం ఇది రెండోసారి.

కరోనా వల్ల ఇబ్బందిపడుతున్న పేదల్ని ఆదుకోవడానికి మేము సైతం అన్నారు పొలిమేర మరియు కెవిఆర్ గ్రూప్. దాదాపు 4000 మందికి పైగా నిజాంపేట, మియపూర్, బాచూపల్లికి చెందిన పేదలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. దాదాపు 10 రోజులకు సరిపడ వస్తువులు అందించారు.

కరోనా వల్ల ఇబ్బందుల్లో ఉన్న సామాన్య ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత, సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు ఆదేశాలతో, విద్యాసంస్థల సిబ్బంది శనివారం నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. తిరుపతికి దగ్గర్లోని ఏ.రంగంపేట, పుల్లయ్యగారిపల్లి, రామిరెడ్డిపల్లి పంచాయతిల్లోని పలు గ్రామాలకు సుమారు 2 టన్నుల కూరగాయలను పంపిణీ చేశారు.

కరోనా దెబ్బ ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. కరోనాను కట్టడి చేసే పనిలో భాగంగా సంగీత దర్శకుడు కోటి స్వరకల్పనలో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఓ పాటలో కనపడుతూ ప్రజలకు అవగాహాన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ పాటను చూసిన ప్రధాని మోదీ ప్రశంసించారు. తాజాగా సంగీత దర్శకుడు కోటి మరో సోషల్ అవైర్నెస్ పాటతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సేవ్ ది వరల్డ్ పేరుతో రాబోతున్న ఈ పాట త్వరలో విడుదల కానుంది. అడవులు నరకడం, ప్లాస్టిక్ అధికంగా వాడడం, అధిక కాలుష్యం కలిగే అనర్థాల గురించి గ్లోబల్ వార్మింగ్ మీద ఈ పాట ఉండబోతొంది.

పోలీసులకి  మెగాస్టార్ సెల్యూట్

లాక్ డౌన్ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఎంత‌గా శ్రమిస్తున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్ట‌డానికి మేము సైతం అంటూ ప్రాణాల‌కు తెగించి ప‌నిచేస్తున్నారు. తాజాగా ఇదే స‌న్నివేశాన్ని స్వ‌యంగా చూసిన మెగాస్టార్ చిరంజీవి పోలీసుల‌పై త‌న అభిప్రాయాన్ని ట్విట‌ర్ లో ఓ వీడియో ద్వారా పంచుకున్నారు.

సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం కు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మూడు లక్షల విరాళాన్ని ప్రకటించారు.