కరోనాపై పోరు..టాలీవుడ్ పెద్ద మనసు

Friday,April 24,2020 - 02:07 by Z_CLU


కరోనా లాక్‌డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా హీరో శ్రీకాంత్ అతని బ‌ృందం పోలీసులకు, సాధారణ ప్రజలకు ఉచిత భోజనం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా హీరో శ్రీకాంత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీసులకు ఉచిత శానిటైజర్లు, మాస్కులు అందించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ లో పోలీసులు చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు హీరో శ్రీకాంత్, శ్రీమిత్ర చౌదరి, నటుడు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్ మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సును, విత‌ర‌ణ‌ను చూపించారు. ఇప్ప‌టికే లాక్‌డౌన్ కార‌ణంగా క‌ష్టాలు ప‌డుతున్న‌ 2వేల కుటుంబాల‌కు నిత్యావ‌ర వ‌స్తువుల‌ను అంద‌జేసిన ఆయ‌న‌, తాజాగా చిరంజీవి ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి రూ. 10 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. గోపీచంద్ విత‌ర‌ణ ఇంత‌టితో ఆగ‌లేదు. రోజూ 1500 మంది అనాథ‌ల‌కు రెండు నెల‌ల పాటు ఆయ‌న అన్న‌దానం చేస్తుండ‌టం విశేషం.

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ రెండో కుమార్తె, ‘దొరసాని’ సినిమాతో తెలుగు వెండితెరకు కథానాయికగా పరిచయమైన శివాత్మిక.. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చారు. అలాగే, రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ మరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యారు. ఆయనకు చెక్స్ అందజేశారు.


ప్ర‌ముఖ నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ త‌న సేవా హృదయాన్ని మ‌రోసారి చాటుకున్నారు. లాక్ డౌన్ స‌మ‌యంలో క‌రోనాని ధీటుగా ఎదుర్కుని, త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా విధులు నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కు త‌న వంతు తోడ్పాటుగా అత్యంత అధునాత‌న‌మైన, నాణ్య‌మైన ప‌ర్స‌న‌ల్ ప్రొట‌క్ష‌న్ ఎక్యూప్‌మెంట్ (పీపీఈ) కిట్స్‌ల‌ను పంపిణీ చేశారు. బ‌షీర్‌బాగ్‌లో హైద‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్ శ్రీ అంజ‌నీకుమార్‌ని క‌లిసిన అగ‌ర్వాల్ ఈ కిట్స్‌ని ఆయ‌న స‌మ‌క్షంలో అంద‌జేశారు.