Tollywood Review - మే నెలలో మెరిసిన మూవీస్

Tuesday,May 31,2022 - 01:19 by Z_CLU

Tollywood Box Office ‘May’ Review

గడిచిన 4 నెలలతో పోలిస్తే మే నెలలో సినిమా రిలీజెస్ కౌంట్ తక్కువగానే ఉంది. అటుఇటుగా 17 సినిమాలు (డబ్బింగ్, డైరక్ట్ ఓటీటీతో కలిపి) మాత్రమే రిలీజ్ అయ్యాయి. అయితే సినిమాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ హిట్స్ సంఖ్య ఎక్కువగా ఉండడం మే నెల స్పెషాలిటీ.

మే మొదటి వారం.. అశోకనవంలో అర్జున కల్యాణం, భళా తందనాన, జయమ్మ పంచాయితీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో విశ్వక్ సేన్ నటించిన అశోకనవంలో అర్జున కల్యాణం సినిమా క్లీన్ హిట్ అనిపించుకుంది. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ పైకొచ్చాడు విశ్వక్. ఇక సుమ నటించిన జయమ్మ పంచాయితీ, శ్రీవిష్ణు చేసిన భళా తందనాన డిసప్పాయింట్ చేశాయి.

మే సెకెండ్ వీక్.. సర్కారువారి పాట రిలీజైంది. సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలా ఏళ్ల తర్వాత మహేష్ నుంచి ఓ సాలిడ్ మేకోవర్, ఓ మంచి ఎంటర్ టైనర్ రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు పరశురామ్ డైరక్టర్. ఈ మూవీ వచ్చిన వన్ డే గ్యాప్ లో డాన్ సినిమా వచ్చింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ డబ్బింగ్ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కలెక్షన్లు రాలేదు.

మే మూడో వారం.. శేఖర్, డేగల బాబ్జీ, ధ్వని, ధగడ్ సాంబ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ సినిమాపై హోప్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమా నిరాశపరిచింది. బండ్ల గణేశ్ నటించిన డేగల బాబ్జీ, సంపూర్ణేష్ బాబు చేసిన ధగడ్ సాంబతో పాటు ధ్వని అనే సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

మే నెలకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ.. ఎఫ్3 సినిమా వచ్చింది. వరుణ్-వెంకీ హీరోలుగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో అందరికీ నవ్వులు పంచుతూ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అనేది తెలియాలంటే మరికొన్ని రోజులాగాలి.

ఓవరాల్ గా మే నెలలో అశోకవనంలో అర్జునకల్యాణం, సర్కారువారి పాట, ఎఫ్3 సినిమాలు హిట్ అనిపించుకున్నాయి.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics