మెగాస్టార్ కెరీర్ లో మరపురాని రోజు

Thursday,August 09,2018 - 04:57 by Z_CLU

మళ్లీ మళ్లీ ఇది రాని రోజంటూ చిరంజీవి తన సూపర్ హిట్ సాంగ్ ను ఈరోజు ఎంచక్కా రిపీట్ చేసుకోవచ్చు. అవును.. చిరు కెరీర్ లో ఇదొక బిగ్ డే. సరిగ్గా 28 ఏళ్ల కిందట ఇదే రోజు చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం కొదమసింహం విడుదలైంది. అంతేకాదు.. సరిగ్గా 34 ఏళ్ల కిందట ఇదే రోజు చిరంజీవి కెరీర్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్లిన ఛాలెంజ్
సినిమా కూడా రిలీజైంది. అందుకే మెగాస్టార్ కెరీర్ లో ఇది మరపురాని రోజు.

మాస్ లుక్ లో కూడా స్టయిల్ గా కనిపించాలంటే కౌబాయ్ క్యారెక్టర్ చేయాల్సిందే. అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో మెగాస్టార్ నటించిన సినిమా కొదమసింహం. కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు తర్వాత ఇంగ్లిష్ లోకి డబ్బింగ్ అయిన రెండో తెలుగు సినిమా ఇదే. రాజ్-కోటి కలిసి స్వరపరిచిన ఇందులో పాటలకు ఇప్పటి కుర్రాళ్లు కూడా డాన్స్ చేయాల్సిందే. 1990 ఆగస్ట్ 9న విడుదలైంది ఈ సినిమా.

ఇక ఛాలెంజ్ మూవీది మరో చరిత్ర. యండమూరి రాసిన డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ ను మలుపుతిప్పింది. చిరు-కోదండరామిరెడ్డి-ఇళయరాజా కలిసి అప్పటికే అభిలాష చిత్రంతో హిట్ కొట్టారు. అదే కాంబోలో వచ్చిన రెండో బ్లాక్ బస్టర్ ఛాలెంజ్. ఇళయరాజా కంపోజ్ చేసిన ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ ఎఫ్ఎం రేడియోల్లో వినిపిస్తున్నాయంటే, ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.