నటులే కాదు.... అంతకు మించి

Sunday,February 24,2019 - 02:22 by Z_CLU

టాలీవుడ్ లో కొందరు నటులు కేవలం నటనే కాకుండా తమలో మరో టాలెంట్ ఉందని నిరూపిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. ఓ వైపు నటులుగా సినిమాలు చేస్తూనే మరోవైపు రైటర్ గా , అలాగే  మెగా ఫోన్ పట్టి డైరెక్టర్స్ గా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్న  కొందరు నటులపై ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లోజీవ్ స్టోరీ.

నటుడిగా ఎన్నో సినిమాల్లో కనిపించిన రవిబాబు ‘అల్లరి’ సినిమాతో మెగా ఫోన్ పెట్టుకుని డైరెక్టర్ గా మారాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాడు. డైరెక్షన్ చేసే సమయంలో గ్యాప్ దొరికినప్పుడల్లా నటుడిగా కూడా కనిపిస్తూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు రవి బాబు.

‘అష్టా చెమ్మా’ తో నటుడిగా పరిచయమైన అవసరాల శ్రీనివాస్ కూడా ‘ఊహలు గుస గుస లాడే’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా తర్వాత  నటుడిగా సినిమాలు చేస్తూనే ‘జ్యో అచ్యూతానంద’ సినిమాను డైరెక్ట్ చేసాడు.

ఇప్పుడున్న మల్టీ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్  ఒకడు. ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు తన రైటింగ్ , డైరెక్షన్ స్కిల్స్ ని బయటపెట్టాడు శేష్. ‘కిస్’ సినిమాను డైరెక్ట్ చేసిన అడివి శేష్ రీసెంట్ గా ‘గూఢచారి’ కి రైటర్ గా పనిచేసాడు. ఆ సినిమా విజయంలో ఇటు హీరోగానూ అటు రైటర్ గానూ భాగస్వామిగా నిలిచాడు.

ఇక ‘తొలి ప్రేమ’తో దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరి కూడా ముందుగా హీరోగా సినిమాలు చేసాడు. అయితే యాక్టింగ్ తర్వాత రచయితగా మారి కొన్ని కథలు రాసుకున్నాడు. ఎట్టకేలకు వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’ సినిమా తెరకెక్కించి తనలోని డైరెక్షన్ టాలెంట్ ని బయటపెట్టాడు.

‘పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కూడా ప్రస్తుతం నటుడిగా అవతారమెత్తాడు. మహానటి సినిమాలో సింగీతం పాత్రలో కనిపించిన తరుణ్ ‘ఫలక్ నుమా దాస్’  సినిమాలో పోలీస్ పాత్ర పోషించాడు. ప్రస్తుతం విజయ దేవరకొండ నిర్మాతగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో హీరోగా కూడా నటిస్తూ నటుడిగా బిజీ అయ్యాడు తరుణ్.

హీరోగా సినిమాలు చేస్తూనే అందరికీ షాక్ ఇచ్చాడు రాహుల్ రవీంద్రన్..  వరుసగా సినిమాలు చేస్తూ ‘చిలసౌ’ అనే టైటిల్ తో ఓ చిన్న సినిమాను డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాతో దర్శకుడిగా అందరితో ప్రశంసలు అందుకున్నాడు రాహుల్. ప్రస్తుతం నటన ని పక్కనపెట్టి డైరెక్షన్ మీదే పూర్తి ఫోకస్ పెట్టాడు ఈ యంగ్ హీరో.

‘వెళ్లిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల్లో హీరోగా నటించిన విశ్వక్ సేన్  ‘ఫలక్ నుమా దాస్’ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే మరో వైపు డైరెక్షన్ బాధ్యత కూడా భుజాలపై వేసుకున్నాడు.