జీ స్పెషల్: మాతృదేవోభవ తెరవెనక కథ

Monday,May 11,2020 - 11:01 by Z_CLU

ఓ 27 ఏళ్ళ క్రితం… చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన రీమేక్ సినిమా… పైగా హెవీ సెంటిమెంట్ డ్రామా.. అబ్బే వర్కౌట్ అవ్వడం కష్టమే అనుకున్నారంతా. కానీ విడుదలైన 3 రోజుల తర్వాత థియేటర్లు కిటకిటలాడాయి. సినిమా చూసిన వారంతా కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుంటూ బయటికొచ్చారు. మాతృత్వంలోని మాధుర్యాన్ని, గొప్పదనాన్ని తెలియజేసి గుండెల్ని పిండేసి భావోద్వేగం అంటే ఏంటో చూపించిన ఆ చిత్రమే ‘మాతృదేవోభవ’. ప్రేక్షకుల కళ్ళను తడిచేసిన ఈ ఆణిముత్యం వెనుక ఎవరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన సంగతులున్నాయి. ఆ విషయాలు తెలియజేసే ప్రయత్నమే ఈ కథనం.

రాజశేఖర్ తో తను నిర్మిస్తున్న ‘అంగరక్షకుడు’ సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్ళారు నిర్మాత కే. ఎస్. రామారావు. సరిగ్గా అప్పుడే విడుదలైన ఓ మళయాళ సినిమా గురించి ఎవరో నిర్మాత రామారావు గారి చెవిలో వేసారు. ఎంటా సినిమా అని వాకబు చేస్తే…. ‘ఆకాశదూతు’ టైటిల్ తో మదర్ సెంటిమెంట్ పుష్కలంగా ఉన్న సినిమా అని తెలిసింది. వెంటనే సినిమా చూసారు. సినిమాలో ఉన్న బలమైన సందేశం, సెంటిమెంట్ సన్నివేశాలు ఆయన్ని కదిలించాయి. రైట్స్ తీసుకొని రీమేక్ చేసి తెలుగు ప్రేక్షకులకు సినిమా చూపించాలని గట్టిగా నిర్ణయించేసుకున్నారు. సంకల్ప బలం ఉంటే ఏమైనా చేయోచ్చన్నట్టుగా అన్ని వెంటనే కుదిరిపోయాయి. రామారావు గారు మళయాళ చిత్ర నిర్మాతను కలిసి విషయం చెప్పేసి రీమేక్ రైట్స్ ప్రపోజల్ ను ఆయన ముందు పెట్టారు. లక్షా డెబ్బై ఐదు వేలకు డీల్ క్లోజ్ అయింది (అన్ని హక్కులు కలిపి).

రీమేక్ రైట్స్ పట్టుకొని హైదరాబాద్ లో వాలిపోయారు. ఈ రీమేక్ సినిమాను చెక్కు చెదరకుండా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడు కావాలి. రామారావు గారి మదిలో తన సంస్థలో ‘కొంగు చాటు కృష్ణుడు’ తీసిన అజయ్ కుమార్ ఒక్కరే ఉన్నారు. ‘కొంగు చాటు కృష్ణుడు’ లో సుత్తివేలు ఎమోషనల్ సన్నివేశాలను అజయ్ బాగానే డీల్ చేసాడు. పైగా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో ఎప్పటి నుండో పని చేస్తున్నాడు. ఇంకేం ఆలోచించకుండా నిర్మాతగా నిర్ణయం తీసుకొని రీమేక్ బాధ్యతను దర్శకుడిగా అజయ్ కుమార్ చేతికి అప్పగించారు.

తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కథను సిద్దం చేయాలి. రచయిత సత్యమూర్తి గారి ( దేవి శ్రీ ప్రసాద్ తండ్రి) తో కలిసి దర్శకుడు అజయ్ కుమార్ ఆ పనిలో నిమగ్నమయ్యాడు. ఒకే రూములో అజయ్ కుమార్ స్క్రీన్ ప్లే సిద్దం చేస్తుంటే రచయిత సత్యమూర్తి సన్నివేశాలకు మాటలు రాస్తున్నాడు. ఇద్దరూ కలిసి పూర్తి కథను డైలాగ్ వర్షన్ తో సహా నిర్మాత ముందు పెట్టారు. అప్పటికే దర్శకుడు అజయ్ కి ఓ టైటిల్ చెప్పాడు సత్యమూర్తి. టైటిల్ ఏమైనా అనుకున్నారా ? అంటూ రామారావు గారు అడగ్గానే ‘మాతృదేవోభవ’ అంటూ తడుముకోకుండా చెప్పేసారు. కథకి యాప్ట్ టైటిల్ అని రామారావు గారు చెప్పగానే దర్శకుడు అజయ్ , రచయిత సత్యమూర్తి ఊపిరి పీల్చుకున్నారు. అవును ఇలాంటి టైటిల్ ఒప్పుకోవాలంటే నిర్మాతకి ఎంతో దైర్యం కావాలి. వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. నిర్మాత రామారావు కి సంగీత దర్శకుడు కీరవాణికి మంచి అనుబంధం ఉంది. వెంటనే సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ ఇవ్వమని కీరవాణి కి ఓ మాట చెప్పేశారాయన. కీరవాణి అందించే ట్యూన్స్ కి వేటూరి సుందర మూర్తి గారితో సాహిత్యం రాయించాలనేది దర్శకుడు అజయ్ కోరిక. నిర్మాత రామారావు, కీరవాణి ఇద్దరూ ఓకె అన్నారు. కానీ వేటూరి ఎంతో బిజీగా ఉన్నారు. రాస్తున్న పాటలు కాకుండా కొత్త పాటల ఒప్పుకునే తీరిక లేనంత బిజీగా ఉన్నారాయన. దర్శకుడు అజయ్ తనకున్న పరిచయంతో గురువు గారు ఈ సినిమాకు మీరే సింగిల్ కార్డ్ రాసిపెట్టాలని గట్టిగా బతిమిలాడితే తప్పని పరిస్థితుల్లో వేటూరి తన కలాన్ని పేపర్ పై పెట్టడానికి పచ్చ జెండా ఊపారు. కీరవాణి తో కూర్చొని వేటూరి పాటలు రాయడం మొదలెట్టారు. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ తో పాటు ‘వేణువై వచ్చాను భువనానికి’ ఇలా రెండు పాటలకు పల్లవిలు రెడీ అయిపోయాయి. ఇక కెమెరామెన్ గా అప్పటికే రెండు సినిమాలు చేసిన ఛోటా కే నాయుడు కి అవకాశం ఇద్దామని నిర్మాత రామారావుతో పాటు దర్శకుడు అజయ్ కూడా డిసైడ్ అయ్యారు. సినిమాటోగ్రాఫర్ గా ఛోటా ప్రాజెక్ట్ లోకి ఎంటరయ్యాడు.

టెక్నీషియన్స్ సైడ్ అంతా ఓకె అయిపోయారు. దర్శకుడు అజయ్ కి కొంత రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు కథను జనాల్లోకి తీసుకెళ్ళే నటీ నటులు కావాలి. ముందుగా మళయాళంలో మాధవి చేసిన తల్లి పాత్రకు గొప్ప నటి కావాలి. ఆ ఫీల్ తీసుకొచ్చే నటి అయితేనే సినిమా రీచ్ అవుతుంది లేదంటే కష్టమే. జయసుధ అయితే ఎలా ఉంటుందనుకున్నారు దర్శక -నిర్మాత. కానీ జయసుధ ఇలాంటి సెంటిమెంట్ తో కూడిన సినిమాలు చేసిందిగా, పాత్రకు ఫ్రెష్ గా అనిపించే నటి కావాలి. ఎవరున్నారు ? ఆలోచనలో పడ్డారు. ఎవరూ తట్టట్లేదు. రామారావు గారు ఒరిజినల్ సినిమాలో నటించిన మాధవినే తీసుకుంటే ఎలా ఉంటుంది ? దర్శకుడు అజయ్ సూపర్ అన్నాడు వెంటనే. పైగా మాధవి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆమెను ఇలాంటి రోల్ లో చూసి ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు. పైగా ఒరిజినల్ లో అమ్మ పాత్రకు ప్రాణం పోసింది మాధవి. డిస్కషన్ ఓవర్ అమ్మ పాత్రకు మాధవి నే హీరోయిన్ గా ఫిక్స్ చేసారు. ఇప్పుడు ఆమె భర్త పాత్రకు ఎవరైనా మంచి నటుడు కావాలి. ఎవరున్నారు మళ్ళీ డిస్కషన్…. నాజర్ అయితే ఎలా ఉంటుందని మనసులో మాట బయటపెట్టాడు దర్శకుడు. అవును నాజర్ ఇంత వరకు ఇలాంటి పాత్ర చేయలేదు. ఎక్కువగా నెగిటివ్ పాత్రలే చేస్తున్నాడు. ఈ పాత్రకి అతనే కరెక్ట్ నిర్మాత తేల్చేసారు. పిల్లల పాత్రలకు మళయాళంలో నటించిన ఇద్దర్ని తీసుకొని మరో ఇద్దర్ని ఆడిషన్స్ ద్వారా తెలుగు వారినే తీసుకున్నారు.

షూటింగ్ ఎక్కడ చేద్దామనే డిస్కషన్ మొదలైంది. ఛోటా తన మనసులో ఉన్న మాట చెప్పాడు. రాజమండ్రి పరిసర ప్రాంతలో గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఈ కథను చెప్తే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. పైగా కథకి కావాల్సిన మంచి లోకేషన్స్ దొరుకుతాయ్ అన్నాడు. నిర్మాత , దర్శకుడు సరే అన్నారు. హీరోయిన్ మాధవిను కలిసి సినిమాకు ఒప్పించి అడ్వాన్స్ అందజేశారు. తెలుగులో మళ్ళీ ఓ మంచి ఆఫర్ రావడం పైగా మళయాళంలో చేసిన పాత్రే కావడంతో మాధవి ఎగ్జయిట్ అయింది. నిర్మాత , దర్శకుడు , సినిమాటోగ్రాఫర్ తో మాధవి మీటింగ్. షూటింగ్ ఎక్కడ చేస్తారు ? అనడిగింది మాధవి. వెంటనే అప్పటికే అనుకున్న గోదావరి లోకేషన్స్ గురించి చెప్పాడు ఛోటా. రాజమండ్రా ? ఎందుకు అంత దూరం ? అక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయా ? లేదండి మహాలక్ష్మి అని ఓ హోటల్ ఉంది. బాగుంటుంది. షూటింగ్స్ కెళ్ళే స్టార్స్ అక్కడే స్టే చేస్తారు చెప్పాడు నిర్మాత రామారావు. ఆమెకు నచ్చలేదు. లేదు అంత దూరం రాలేను. హైదరాబాద్ అయితే ఒకే అనేసింది. ఆ మాట వినగానే సినిమాటోగ్రాఫర్ ఛోటా కి కోపమొచ్చింది. అర్రే మంచి లొకేషన్ మిస్ అవుతున్నాం…. అదరగొట్టేసేవాణ్ణి అనుకుంటూ రూము నుండి బయటికొచ్చేశాడు.

ఇక చేసేదేం లేక నిర్మాత , దర్శకుడితో పాటు ఛోటా కూడా కాంప్రమైజ్ అయ్యాడు. ఫైనల్ గా హైదరాబాద్ లోనే షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఫారెస్ట్ లొకేషన్ తో పాటు ఓ ఆహ్లాదకరమైన ఇల్లు కావాలి. హైదరాబాద్ కి దాదాపు ఓ యాబై కిలో మీటర్ల దూరంలో రాజు గారి తోట ఉందని తెలుసుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ తో పాటు నిర్మాత రామారావు , దర్శకుడు అజయ్ , ఛోటా కలిసి లొకేషన్ చూడ్డానికి వెళ్ళారు. లొకేషన్ బాగుంది ఇక్కడే తీద్దాం… ఫిక్సయ్యారు. ఛోటా ఎక్కడ ఏ షాట్స్ తీయాలో ఊహించేసుకున్నాడు. పక్కనే ఒక ఫ్యాక్టరీ ఉంది. ఏమిటదని ఆరా తీస్తే అందులో వుడ్ వర్క్ జరుగుతుందని. ఆర్డర్ ఇస్తే వుడ్ తో ఇల్లు కు సరిపడే ఫిట్టింగ్ తో మేటిరియల్ ఇస్తారని తెలుసుకున్నారు. వెంటనే ఛోటా కి వుడ్ తో ఇక్కడొక ఇల్లు క్రియేట్ చేస్తే అందులో ఇంట్లో సన్నివేశాలన్నీ తీసేయెచ్చనే ఆలోచన వచ్చింది. వెంటనే నిర్మాతకి అలాగే అజయ్ కి చెప్పాడు. ఆర్ట్ డైరెక్టర్ కి ఆ వర్క్ అప్పగించారు. ఇల్లు సెటప్ రెడీ. లొకేషన్ బాగుంది కానీ రోజు వెళ్లి వస్తే పులుసు కారిపొద్ది. ట్రావెలింగ్ కే చాలా సమయం వృదా అవుతుంది. ఎలా ? పోనియ్ అక్కడే ఉంటూ షూటింగ్ చేసుకుంటే అంటూ అందరూ ఓ తాటిపైకొచ్చారు. రాత్రి పగలు అక్కడే ఉంటూ షూటింగ్ చేసుకుంటున్నారు. నిర్మాత రామారావు మాత్రం ఎప్పుడైనా వచ్చి చూసి వెళ్తుండేవారు.

ఓ రోజు నిర్మాత రామారావు లొకేషన్ కొచ్చారు. నాజర్ ని చంపే సన్నివేశం తీస్తున్నారక్కడ . ఛోటా కే నాయుడు లొకేషన్ లో ఓ చెట్టు పై టాప్ లైట్ ఏదో పెట్టారు. ఛోటా అసిస్టెంట్ ను పిలిచి అక్కడ లైటింగ్ ఏంటని…. అవసరమా అన్నారు రామారావు. ఇదే విషయాన్ని ఛోటా చెవిలో వేసాడు అసిస్టెంట్ రాంబాబు. ఆయనకి ఇప్పుడేం అర్థం కాదులే తర్వాత చూడమను దీని పర్పస్ తెలుస్తుందని చెప్పాడు ఛోటా. మానిటర్ లో తీసిన సీన్ చూసాకో లేదా సినిమా చూసే సమయంలోనో తన వర్క్ రామారావ్ గారికి తెలియక పోదనే మొండి పట్టుతో ఉన్నాడు. అలాగే జరిగింది ఛోటా కే.నాయుడు కెమెరా వర్క్ కి నిర్మాతగా స్పెల్ బౌండ్ అయ్యారు రామారావ్.

నర్సాపూర్ ఫారెస్ట్ , రాజు గారి తోటలోనే దాదాపు సినిమా మొత్తం తీసారు. మాధవి తన పిల్లల్ని దత్తతు తీసుకున్న కోటా, అల్లు రామలింగయ్య లకు అప్పగించే సన్నివేశాలు మాత్రం జూబిలీ హిల్స్ , ఫిలిం నగర్ లో తీసారు. టోటల్ గా 35 రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేసారు. అప్పటి వరకు ఓ ఫ్యామిలీలా కలిసి పనిచేస్తూ అక్కడే ఉంటూ అనుబంధం ఏర్పరచుకున్న అందరూ పెళ్లయ్యాక అప్పగింతలప్పుడు బాధ పడినట్టు లోలోపల బాధ పడుతూనే తిరిగింటికొచ్చారు.

షూటింగ్ పూర్తయింది. తీసిన కంటెంట్ ను ఎడిటర్ నివాస్ చేతిలో పెట్టారు. నివాస్ ఎడిటింగ్ వర్షన్ అయిన వెంటనే కీరవాణి ఆర్.ఆర్ వర్క్ మొదలెట్టారు. షూటింగ్ స్పీడ్ గా జరిగిందో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అంతే స్పీడ్ గా పూర్తయింది. అక్టోబర్ 22న రిలీజ్ అనుకున్నారు. విడుదలకి నిర్మాత రామారావు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సారధి స్టూడియోస్ లో రాయలసీమ డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రివ్యూ వేసారు దర్శకుడు అజయ్ ను అక్కడ ఉంచి రామారావు వెళ్ళిపోయారు. డిస్ట్రిబ్యూటర్స్ లోపల సినిమా చూస్తుంటే బయట దర్శకుడు అజయ్… సీమ వారికి ఈ సెంటిమెంట్ సినిమా నచ్చుద్దో లేదో అనే డైలామాలో అటు ఇటు తిరుగుతున్నాడు. సినిమా పూర్తయింది. బయటికొచ్చి బాగుందని చెప్పి కన్నీళ్లు తుడుచుకుంటూ కొందరు సినిమా తీసుకుంటునట్లు తెలియజేసి నిర్మాతతో మాట్లాడుకుంటామని చెప్పేసి వెళ్ళారు . ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు అజయ్ కుమార్.

సినిమా రిలీజయింది. మార్నింగ్ షో కి పెద్దగా జనాల్లేరు. నారాయణగూడలో ఓ స్టూడియోలో ట్రైలర్ కట్ చేసే పనిలో ఉన్న అజయ్ , ఛోటా ఇద్దరు సినిమా టాక్ గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా మీద తనకున్న నమ్మకాన్ని చెప్తూ దర్శకుడు అజయ్ కి దైర్యం చెప్తున్నాడు ఛోటా. ఆ పనయ్యాక దర్శకుడు హైదరాబాద్ లో ఉన్న థియేటర్స్ కెళ్ళాడు. క్యాంటీన్ లో ఓ పెద్ద ప్లేటులో ఉన్న సమోసాలు లెక్క చూస్తే ఎన్ని ఉంటాయో అంతమంది ఉన్నారు లోపల. డైరెక్టర్ అజయ్ డిసప్పాయింట్. ఇంతలో నిర్మాత రామారావు నుండి ఫోన్. ఆఫీసుకు రమ్మని అజయ్ కు పిలుపు.

ఇద్దరు ఆఫీసులో మాట్లాడుకుంటున్నారు. సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్ళాలంటూ రెండో రోజు (శనివారం) కూడా చర్చ నడిచింది. ఆదివారం డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసి రెండో వారం కూడా సినిమా ఉంచాలంటూ అందుకు మీకొచ్చే నష్టం నేను భరిస్తా అన్నారు రామారావ్. నిర్మాత అలా అనేసరికి డిస్ట్రిబ్యూటర్లు సరే అన్నారు. సోమవారం మళ్ళీ మీటింగ్ మంచి సినిమా దీన్ని ఇలా వదిలేయకూడదు ఏదోకటి చేసి జనాలతో థియేటర్స్ నింపాలి అంటూ లోలోపల ఒకటే ఆరాటపడుతున్నారు నిర్మాత. పబ్లిసిటీలో క్రియేటివ్ కమర్షియల్ కి ఓ క్రియేటివ్ ప్లేస్ ఉంది. సినిమా పబ్లిసిటీ మీద రామారావుకి మంచి పట్టుంది. సినిమాకు ఏదైనా డిఫరెంట్ పబ్లిసిటీ చేయాలి ఎలా ? ఏం చేస్తే బాగుంటుంది? రెండు మూడు ప్లానులు మాట్లాడుకున్నారు. సినిమాకొచ్చిన వారికి కర్చీఫులిస్తే ఎలా ఉంటుంది ? అన్నారు నిర్మాత రామారావ్. ఆ ఐడియా అందరికీ నచ్చింది. మరుసటి రోజు(మంగళవారం) నుండి సినిమాకొచ్చిన ప్రేక్షకులకి టికెట్ తో పాటు కర్చీఫులు పంచిపెట్టమని,తెల్లారె సరికి రూపాయి లోపు ధర ఉండే కర్చీఫులు కొని థియేటర్స్ లో ఉంచాలంటూ ఆర్డర్ వేసారు నిర్మాత. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ వెంటనే ఐడియా బాగుందంటూ కర్చీఫుల ఆఫర్ అమలు చేసారు. మంగళవారం కర్చీపులు పంచిపెట్టే సరికి బుధవారం రోజు రాత్రి నుండి జనాలు థియేటర్స్ కి రావడం మొదలెట్టారు. బుధవారం రోజు సెకండ్ షో ఫుల్స్ అంటూ నిర్మాత రామారావు గారికి ఫోన్ వచ్చింది. హమ్మయ్య మన ప్లాన్ వర్కౌట్ అయిందనుకున్నారు. కర్చీఫ్ ఇచ్చి మరీ ఏడిపిస్తున్నారని ప్రచారం జరిగింది. సినిమా చూసి ఏడవకుండా ఉంటే 1000 ఇస్తాం అంటూ పత్రికల్లో కథనాలకు హెడ్డింగ్ పెట్టారు. ఇక వచ్చే వారం మరో కొత్త సినిమా అంటూ పోస్టర్ వేసుకున్న థియేటర్స్ యాజమాన్యం రెండో వారం కూడా ‘మాతృదేవో భవ’ నే కంటిన్యూ చేయాలని నిర్ణయించుకొని బోర్డులు మార్చేసారు. అక్కడి నుండి సినిమా ఎవరూ ఊహించని విధంగా మంచి వసూళ్లు సాదించి తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్ గా నిలిచింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందిన ఉత్తమ చిత్రంగా ‘మాతృదేవో భవ’ నిలిచిపోయింది. విడుదల తర్వాత పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి.

సినిమా విడుదలైన రెండో వారంలో విజయవాడ వెళ్ళిన దర్శకుడు అజయ్ కుమార్ స్టేషన్ ముందున్న ఓ రిక్షా ఎక్కాడు. రిక్షా నడిపే వ్యక్తితో మాట్లాడుతూ సినిమాల సమాచారం అడిగాడు. సినిమాలు ఏం బాగున్నాయ్ అంట ? అని అడగ్గా … ఏదో కొత్త సినిమా వచ్చిందండి కర్చీఫులిస్తున్నారట. నిన్న మా ఆవిడ కూడా చూసోచ్చింది. బాగుందట అనగానే దర్శకుడు అజయ్ కుమార్ కి చెప్పలేనంత సంతోషమొచ్చింది. ఓ రిక్షా వాడి భార్య వరకు సినిమా వెళ్లిందంటే శుభపరిణామమే అనుకున్నారు లోలోపల. ‘కొంగు చాటు కృష్ణుడు’,’అల్లరోడు’,’సింహ గర్జన’,’జీవిత ఖైదీ’,ఇలా ఓ పద్నాలుగు సినిమాలు చేసినప్పటికీ అజయ్ కుమార్ అంటే ‘మాతృదేవో భవ’ సినిమానే గుర్తొస్తుంది. థియేటర్ లో ‘మాతృదేవో భవ’ చూస్తూ శోక సంద్రంలో మునిగిపోయమంటూ కొందరు, థియేటర్ నుండి నేరుగా ఇంటికెళ్ళి తమ పిల్లల్ని గుండెలకి హత్తుకున్నమంటూ ఇంకొందరు అజయ్ కుమార్ కి ఉత్తరాలు రాసారు.

కేవలం 25 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ‘మాతృదేవోభవ’ ఎవరూ ఊహించని విధంగా దాదాపు 5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో “రాలిపోయే పువ్వా” పాటకు గానూ వేటూరి గారికి నేషనల్ అవార్డు దక్కింది. ఇక బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో అజయ్ కుమార్ కి , నిర్మాతగా రామారావు కి , ఉత్తమ నటిగా మాధవికి , బెస్ట్ విలన్ గా తనికెళ్ళ భరణి కి , “వేణువై వచ్చాను భువనానికి” పాటకు గానూ బెస్ట్ సింగర్ గా చిత్రకు నంది అవార్డులు దక్కాయి. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారు వీరికి నంది అవార్డులు అందించారు. వేదిక దిగిన వెంటనే నిర్మాత రామారావు గారితో పాటు అజయ్ కుమార్ ను పిలిచి “మద్యం మానిపించడం కోసం ప్రభుత్వం ఎన్నో యాడ్స్ చేస్తుంది, కానీ ఇలాంటి ఒక్క సినిమా చాలు మద్యం మానిపించడానికి” అంటూ కితాబిచ్చారు.

సినిమా పెద్ద హిట్టవవ్వడంతో కొండాపూర్ లో ఉన్న తన సి.సి. ఫిలింసిటీలో చిత్ర నటీ నటులకు , సాంకేతిక నిపుణులకి గ్రాండ్ గా పార్టీ ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు నిర్మాత కే.ఎస్.రామారావ్.

పది సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రవీంద్ర భారతిలో సినిమాకు శతదినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేదికపై అందరూ ఉన్నారు. ఛోటా కే నాయుడు మాత్రం కింద కుర్చిలో కూర్చున్నారు. మాధవి ఛోటా కెమెరా వర్క్ గురించి చెప్తూ స్పీచ్ ఇస్తుంటే ఎప్పుడు వేదికపైకి పిలుస్తారా అంటూ ఎదురుచూసాడు ఛోటా. ఎంత సేపటికి తనను వేదికపై రమ్మని పిలవకపోవడంతో కోపంతో బయటికొచ్చేసాడు. ఆ కోపంతో ఇంక రామారావు గారి బ్యానర్ లో సినిమా చేయకూడదని నిస్చయిన్చుకున్నాడు. తర్వాత ఓ సందర్భంలో ఏదో సినిమాకు రామారావు గారి నుండి పిలుపొసస్తే తిరస్కరించాడట ఛోటా.

సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయంలో దాదాపు ఇదే కథతో దర్శకుడు పీసీ రెడ్డి….. జయసుధ , చంద్ర మోహన్ లతో సినిమా చేసారు. అయితే ఆ సినిమాను హిందీ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. ‘మాతృదేవోభవ’ మళయాళ సినిమాకు రీమేక్. ఇక అదే కథతో తీస్తున్నారని తెలిసి నిర్మాత కే.ఎస్.రామారావు గారిని సంప్రదించారు ఆ చిత్ర నిర్మాత. కొన్ని చర్చల అనంతరం వారి సినిమాను ‘మాతృదేవో భవ’ కంటే ఓ వారం ముందే రిలీజ్ చేసుకోమని నికార్సుగా చెప్పేసారు రామారావు. నిజానికి మళయాళంలో వచ్చిన ‘ఆకాశధూతు’ కి అలాగే హిందీలో వచ్చిన మరో సినిమాకి ఇంగ్లీష్ సినిమా ‘వూ విల్ లవ్ మై చిల్డ్రన్స్’ అనేది ప్రేరణ. కాకపోతే అదే లైన్ తీసుకొని ఎవరికి నచ్చినట్టు ప్రేక్షకుల అభిరుచి మేరకు వర్షన్లు మార్చి తీసుకున్నారు.

ఈ సినిమాను హిందీలో ‘తులసి’ టైటిల్ తో 2008 లో రీమేక్ చేసారు. దానికి కూడా అజయ్ కుమారె దర్శకత్వం వహించారు. తర్వాత కన్నడలో అలాగే మిగతా భాషల్లో కూడా సినిమాను రీమేక్ చేసారు.

– రాజేష్ మన్నె