Choodalani vundi తెరవెనక కథ

Thursday,August 27,2020 - 01:06 by Z_CLU

బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసిన మెగా హిట్ సినిమా ‘చూడాలని ఉంది’ విడుదలై నేటికి 22 ఏళ్లవుతుంది.మెగాస్టార్ చిరంజీవి, గుణ శేఖర్, అశ్వనిదత్ కాంబినేషన్ లో తెరకెక్కి వసూళ్ళ సోనామి సృష్టించిన ఈ సినిమా తెరవెనుక విశేషాలతో ‘జీ సినిమాలు స్పెషల్’ స్టోరి.

అప్పటికే రెండు సినిమాలు డైరెక్ట్ చేసి మూడో సినిమాగా బాలలతో ‘రామాయణం’ తీసి మంచి ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు గుణ శేఖర్ ఓ సందర్భంలో తను రాసుకున్న కలకత్తా బ్యాక్ డ్రాప్ రివేంజ్ కథ గురించి మిత్రుడు సుంకర మధు మురళి(నిర్మాత) కి చెప్పాడు. అశ్వనిదత్ గారి దగ్గర మెగాస్టార్ కాల్షీట్లు ఉన్నాయి. ఆయన మంచి కథ కోసం చూస్తున్నారు. నీ కథ ఆయనకు చెప్దాం పదా అంటూ అశ్వనిదత్ గారి దగ్గరికి గుణ శేఖర్ ను తీసుకెళ్ళాడు మధు మురళి. గుణ శేఖర్ చెప్పిన రివేంజ్ స్టోరీకి నిర్మాత అశ్వనిదత్ ఫిదా అయ్యారు. చిరంజీవి గారి అప్పాయింట్ మెంట్ తీసుకొని కథ చేప్దాం అంటూ గుణ శేఖర్ కి హామీ ఇచ్చారు. చిరంజీవి గారికి మంగళవారం కథ చెప్పాల్సి వచ్చింది. వెళ్ళే ముందు అశ్వనిదత్, గుణశేఖర్ మధ్య డిస్కషన్. ఈరోజు మంగళవారం మనం జెనరల్ గా అశుభంగా భావించే రోజు. మరో రోజు చెప్దామా అనుకున్నారు. కానీ చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తుడు ఆయనకి మంగళవారం మంచి సెంటిమెంట్ అని భావించి దైర్యం చేసి మెగా స్టార్ ఇంటికి పయనమయ్యారు.

చిరుతో మీటింగ్… అదే మొదటి సారి గుణశేఖర్ మెగాస్టార్ ను కలవడం. చిరు రిసీవింగ్ చూసి షాక్ అయ్యాడు గుణ. ముందుగా కథ చెప్పడానికి వచ్చిన దర్శకుడు గుణశేఖర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు చిరు. కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. గుణ శేఖర్ మెల్లగా చిరు కి కథ చెప్పడం మొదలు పెట్టాడు. గుణా క్లారిటీకి విజన్ కి మెగా స్టార్ మెస్మరైజ్ అవుతున్నారు. చెప్పాల్సిన కథనంతా చిరు చెవిలో వేసారు గుణ. సూపర్… బాగుంది… నచ్చింది నేను చేస్తున్నా అంటూ మెగా స్టార్ నోటి నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే గుణశేఖర్, అశ్వనిదత్ సంతోషంతో పొంగిపోయారు.

మళ్ళీ మీటింగ్… క్యాస్టింగ్ , టెక్నీషియన్స్ గురించి చిరుతో డిస్కషన్. ముందుగా సినిమాటోగ్రాఫర్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటుండగా గుణ శేఖర్ అప్పటికే తనతో పనిచేసిన శేఖర్ జోసెఫ్ పేరు చెప్పారు. వద్దు ఛోటా కే నాయుడు ను పెట్టుకుందాం అన్నారు చిరు. గుణకి ఛోటా మంచి మిత్రుడు కావడంతో వెంటనే డన్ అన్నాడు గుణ శేఖర్. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ని ఫిక్స్ చేసుకున్నారు. మిగతా టెక్నీషియన్స్ గురించి ఏవో పేర్లు అనుకోని ఓకే చేసుకున్నారు. ఇక క్యాస్టింగ్ విషయానికొస్తే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ రోల్ కోసం అంజలా జవేరి ను అనుకున్నాక పద్మావతి క్యారెక్టర్ కి ఎవరైతే బాగుంటుంది అని ఆలోచిస్తూ సౌందర్య పేరు చెప్పారు గుణ శేఖర్ అందరూ పర్ఫెక్ట్ అన్నారు. విలన్ గా అక్కడికక్కడే ప్రకాష్ రాజ్ అనేసుకున్నారు. మిగతా క్యాస్టింగ్ ను ఫైనల్ చేసే బాధ్యత ఇక గుణ మీద పెట్టేసారు హీరో నిర్మాత…మీటింగ్ ఓవర్.

నిర్మాత ఛోటా కే నాయుడు ను కలిసి చిరంజీవితో మనం సినిమా చేస్తున్నాం నువ్వే సినిమాటోగ్రాఫర్ అన్నారు నిర్మాత అశ్వనిదత్. రేపు బొకే పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్దాం అని ఛోటా కి చెప్పి వెళ్ళిపోయారు అశ్వనిదత్. మాస్టర్ సినిమా తర్వాత మళ్ళీ చిరుతో సినిమా అనేసరికి ఛోటా ఫుల్ హ్యాపీ గా ఫీలయ్యాడు. మర్నాడు అశ్వనిదత్ , గుణశేఖర్, ఛోటా ముగ్గురు చిరు ఇంటికెళ్ళారు. ఆ మీటింగ్ లో ఛోటాను చూసి ఆప్యాయంగా పలకరించి చేతిలో తన చేతిలో ఉన్న కాఫీ కప్ ను చోటా చేతిలో పెట్టారు చిరు. ప్రేమతో ఇచ్చిన ఆ కాఫీను వెంటనే సిప్ చేసాడు ఛోటా. మెగా స్టార్ కి ఛోటా చాలా క్లోజ్ అన్న సంగతి ఆ సందర్భంలో తెలుసుకున్నాడు గుణ. కాసేపు లోకేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత చిరు, గుణ మధ్య సినిమాలో రామకృష్ణ -పద్మావతి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాల గురించి డిస్కస్ చేసుకున్నారు.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్. మ్యూజిక్ సిట్టింగ్ లో పాటలు వెంట వెంటనే ఓకే అయిపోయాయి. మెగా స్టార్ కోసం మణిశర్మ అదిరిపోయే సాంగ్స్ కంపోజ్ చేసిచ్చాడు. ముందుగా సినిమాలో వచ్చే చివరి పాటను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. అయితే ఆ పాటకు బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ తో కంపోజ్ చేయించాలనేది దర్శకుడు గుణశేఖర్ కోరిక. మణిశర్మ చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ పెట్టుకున్నారు గుణ. ఇక సరోజ్ ఖాన్ ను సంప్రదించి ఆమెతో మాట్లాడటానికి ఛోటా తో కలిసి ముంబై వెళ్ళారు నిర్మాత అశ్విని దత్. సరోజ్ ఖాన్ ను అశ్వనిదత్ గారు పరిచయమే. అందుకే ఆయన విషయం చెప్పి మెగాస్టార్ సాంగ్ కి కంపోజ్ చేయాలి అనగానే బిజీగా ఉన్నప్పటికీ వెంటనే ఇంకేం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అలా ముంబైలోనే ‘ఓం మారియా’ సాంగ్ ను చిరు, సౌందర్య లపై షూట్ చేసారు. ఆ సాంగ్ కంపోజిషన్ చూసి తర్వాత సరోజ్ ఖాన్ తో మరో సాంగ్ చేయించాలని డిసైడ్ అయ్యారు.

ఇక తక్కువ మంది ఆర్టిస్టులతో కొంత మంది క్రూతో కలకత్తా వెళ్లి ఆ ఎపిసోడ్ ను తొమ్మిది రోజుల్లో షూట్ చేసుకొచ్చారు. సినిమా కోసం కలకత్తా వెళ్ళడం చిరు కి అదే మొదటి సారి. మెగాస్టార్ సినిమా ఒప్పుకోవడానికి కలకత్తా నేపథ్యం కూడా ఒక కారణం. అప్పటి వరకు అక్కడ తెలుగు సినిమా షూట్ చేసింది లేదు. తర్వాత 70 లక్షల వ్యయంతో అన్నపూర్ణ స్టూడియోస్ లో కలకత్తా అపార్ట్ మెంట్ సెట్ వేసారు. ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి వేసిన ఆ భారీ సెట్ చూసేందుకు రోజు సినీ ప్రముఖులు వస్తుండేవారు. అప్పట్లో ఆ సెట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అశ్వనిదత్ మరీ ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని అందరూ మాట్లాడుకునే వారు. అయినా అవన్నీ పట్టించుకోకుండా తమ కాంబినేషన్ లో మరో బ్లాక్ బస్టర్ రానుందని గట్టిగా నమ్మేవారు అశ్వనిదత్.

‘చూడాలని ఉంది’ (Choodalani vundi) అనగానే మనకి టక్కువ గుర్తొచ్చే సీన్ రైల్వే స్టేషన్ లో చిరు అంజలా ఝవేరి కి లైనేసే సీన్. చిరు రొమాంటిక్ సీన్స్ లో అది టాప్ 1 లో ఉంటుంది. ఆ ఎపిసోడ్ అంతా నాంపల్లి రైల్వే స్టేషన్ లో షూట్ చేసారు. తొలి రోజు షూట్ కి వెళ్ళేటప్పుడు కెమెరామెన్ ఛోటా కి సీన్ చెప్పకుండా దానికి సంబంధించి ఓ పొడవు బుక్ పంపించాడు దర్శకుడు గుణ. కారులో అందరికంటే ముందుగా నాంపల్లి లొకేషన్ కి వెళ్తూ ఆ బుక్ చూసి ఇదేంటి అనుకున్నాడు ఛోటా. తీరా ఓపెన్ చేసి చదివితే అందులో రైల్వే స్టేషన్ సీన్స్ కి సంబంధించి ఫ్రేం టు ఫ్రేం క్లియర్ కట్ గా ఆర్ట్ వర్క్ తో సహా రాసుంది. గుణ క్లారిటీ కి ఛోటా మరోసారి ఫిదా అయిన సందర్భమది.

హైదరాబాద్ లో ఉన్న తాజ్ హోటల్ లో ప్రకాష్ రాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ తేజ లపై సీన్ తీస్తున్నారు. ప్రకాష్ రాజ్ తన మనవడిని స్విమ్మింగ్ ఫూల్ లోకి తోసే సీన్ అది. చిన్న పిల్లాడిని అలా స్విమ్మింగ్ ఫూల్ లో వేస్తే వాడికేదైనా జరిగితే..? ప్రకాష్ రాజ్ ఆ సీన్ చేయనంటూ చెప్పేసాడు. గుణా మాత్రం ఆ సీన్ చేయాల్సిందే నంటూ మొండి పట్టు పట్టాడు. ఇద్దరి మధ్య చాలా సేపు డిస్కషన్ నడిచింది. ఆ సీన్ ఆలస్యం అవ్వడంతో ఆ రోజు టీం కి లంచ్ కూడా లేటైంది. ఎట్టకేలకు ప్రకాష్ రాజ్ కన్విన్స్ అయి ఆ సీన్ చేయడం వెంటనే మాస్టర్ తేజను స్విమ్మింగ్ ఫూల్ నుండి బయటికి తీసేయడం జరిగింది. నిజానికి గుణ శేఖర్ రాసుకున్న ఆ సీన్ సినిమాలో ప్రకాష్ రాజ్ విలనిజాన్ని బాగా ఎలివేట్ చేసింది. తర్వాత ప్రకాష్ రాజ్ కూడా ఆ సీన్ చూసి మురిసిపోయాడు.

సినిమాలో రెండు మూడు ఛేజింగ్ సీన్స్ ఉంటాయి. వాటి కోసం కెమెరామెన్ ఛోటా కే నాయుడు , స్టంట్ మాస్టర్ విజయన్ బాగా కష్టపడ్డారు. వారి కష్టం సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ కి ముందు వచ్చే ట్రక్ ఛేజింగ్ సీన్ ఆడియన్స్ ను బాగా థ్రిల్ చేసింది.

తలకోన అడవుల్లో సినిమా షూట్ జరుగుతుండగా టైటిల్ డిస్కషన్ వచ్చింది. ‘చూడాలని ఉంది’ అంటూ డైరెక్టర్ టీం కి చెప్పగానే అందరూ చిరు సినిమాకి ఈ టైటిలా వర్కౌట్ అవ్వదు అనుకున్నారు. తర్వాత గుణ శేఖర్ అందరి ఫీడ్ బ్యాక్ తీసుకొని ఫైనల్ గా నిర్మాత, చిరుతో మాట్లాడి అదే టైటిల్ ను ఫిక్స్ చేసి పెట్టారు. కంటెంట్ ఉన్న సినిమాలకు ఏ టైటిల్ పెట్టినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిరూపించిన సినిమాల్లో ఇదొకటి.

చిరు ,సౌందర్యల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు థియేటర్స్ లో బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ సీన్స్ లో చిరు కామెడీ టైమింగ్ చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. ఆ సన్నివేశాలు అంత బాగా రావడానికి చిరు స్పెషల్ కేర్ తీసుకొని గుణ శేఖర్ తో డిస్కషన్ చేసి సౌందర్యతో కో ఆర్డినేట్ అవుతూ చేసారు. అందుకే ఆ సీన్స్ అంతలా క్లిక్ అయ్యాయి.


మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు :

*కలకత్తా ఎపిసోడ్ లో వచ్చే ఓ ఫైట్ ను విజయన్ మాస్టర్ కేవలం మూడు రోజుల్లో తీసారు. సహజంగా ఏ ఫైట్ కయినా మినిమం పది రోజులు తీసుకునే విజయన్ మాస్టర్ మెగాస్టార్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించి కేవలం మూడు రోజుల్లోనే మంచి క్వాలిటీతో తీసి పెట్టారు. నిర్మాత శ్రేయస్సు కోరి సినిమా షూట్ తక్కువ రోజుల్లో ఫినిష్ చేయడానికి మెగా స్టార్ స్పెషల్ కేర్ తీసుకున్నారు.

*‘రామ్మా చిలకమ్మా’ సాంగ్ కోసం అకేలా క్రేన్ వాడారు ఛోటా.

*సినిమాలో చిరు కోసం డిఫరెంట్ కాస్ట్యూమ్ వాడారు. ముఖ్యంగా కలకత్తా ఎపిసోడ్ లో ఆ డ్రెస్ లాంటిదే మరికొన్ని కుట్టిస్తామని చెప్పినా ఆ ఆలోచనని తిరస్కరించి కంటిన్యూ కోసం దాదాపు ఇరవై ఇదు రోజులు ఒకే డ్రెస్ వేసుకొని నటించారు చిరు.

*‘సినిమాలో ముందుగా వచ్చే కలకత్తాను పొగుడుతూ వచ్చే సాంగ్ ను ‘రఘు వంశ సుదాంబుధీ’ కీర్తన రాగంలో కంపోజ్ చేసారు మణిశర్మ. అసలు చిరు సినిమాకి మొదటి సాంగ్ ఇలా ఉంటే బాగుంటుందా..? అంటూ టీం అనుకున్నప్పటికీ ‘యమహా నగరి’ అంటూ వచ్చే ఆ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఆ పాటకు సంబంధించి గుణ శేఖర్ సాహసానికి ముచ్చుకోవాల్సిందే. ఆ సాంగ్ ను ఒకే కారులో వెళ్లి కలకత్తా లోకేషన్స్ లో రాజు సుందరం నేతృత్వంలో ఛోటా షూట్ చేసుకొచ్చారు.

*‘చూడాలని ఉంది’ (Choodalani vundi) సినిమా కంటే ముందు చిరు హీరోగా అశ్వనిదత్ సింగీతం శ్రీనివాస్ తో ఒక సినిమా మొదలు పెట్టారు. ఆ సినిమా కొన్ని రోజులకే ఆగిపోయింది. మళ్ళీ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో చిరు , అశ్వనిదత్ కాంబోలో సినిమా మొదలైంది. అది కూడా షూటింగ్ దశలోనే నిలిచిపోయింది. ఆ తర్వాత కొన్ని నెలలకి ‘చూడాలని ఉంది’ సినిమా సెట్ అయ్యి పూర్తయింది. ఇక ముందు సింగీతం , ఆర్ జీ వి తీసిన సినిమాల్లోని పాటలను ‘వినాలని ఉంది’ అనే టైటిల్ తో ఆడియో రిలీజ్ చేసారు. ఆ పాటలను ‘చూడాలని ఉంది’ 50 రోజుల రన్ తర్వాత సినిమాలో యాడ్ చేసి మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు.

*‘చూడాలని ఉంది’… శతదినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా జరిపారు. ఈ వేడుకలకి విచ్చేసిన పవన కళ్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

గుణ శేఖర్ డైరెక్షన్ లో మెగా స్టార్ సినిమానా ..? కెరీర్ జోరుగా ఉన్న ఈ టైంలో చిరుకి ఇలాంటి రిస్కీ ప్రాజెక్ట్ అవసరమా..? ‘చూడాలని ఉంది’ అసలు మెగాస్టార్ బొమ్మకి ఇలాంటి టైటిల్ పెడతారా ? కలకత్తా నేపథ్యమా.. అసలు కథేంటో..? ఇవన్నీ సినిమా థియేటర్స్ లోకి రాకముందు వినిపించిన కామెంట్స్… కానీ బొమ్మ స్క్రీన్ మీద పడగానే మెగా ఫ్యాన్స్ తో పాటు సినిమా అభిమానులు కూడా గుణ శేఖర్ చూపించిన లవ్ అండ్ రివేంజ్ స్టోరీకి కనెక్ట్ అయిపోయి బ్లాక్ బస్టర్ రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత 175 డేస్ బొమ్మగా తీర్చిదిద్ది చివరికి రికార్డులు తిరగరాసిన ఇండస్ట్రీ హిట్ చేసారు. దమ్మున్న సినిమా పడితే పాత రికార్డుల్ని కొట్టడం చిరుకి షర్ట్ వేసుకున్నంత సులువని నిరూపించింది ‘చూడాలని ఉంది’. అంతే కాదు రిలీజ్ తర్వాత సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి , థియేటర్స్ కౌంటర్ లో కూర్చొనే వారికి, ఫైనల్ గా నిర్మాత అశ్వనిదత్ గారికి డబ్బు లెక్కపెట్టుకోవడంతోనే సరిపోయింది. అలాగే ఈ సినిమాతో నటీ నటులకి , టెక్నీషియన్స్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాతోనే ప్రకాష్ రాజ్ కి విలన్ గా బ్రేక్ వచ్చింది. చూడాలని ఉంది తర్వాత ప్రకాష్ రాజ్ విలన్ గా మరిన్ని అవకాశాలు అందుకొని వెనక్కి తిరిగిచూసుకోకుండా దూసుకెళ్లాడు. 62 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని ఇరవై కోట్లు కొల్లగొట్టింది. అదీ ఈ చిత్రం సాధించిన అరుదైన విజయం తాలుకూ సువాసనలు. ఇప్పటికీ టివీలో ఈ సినిమా వస్తే అతుక్కుపోయి మళ్ళీ మళ్ళీ చూసే సినిమా అభిమానులెందరో…!

-రాజేష్ మన్నె.