ది గ్రేట్ డైరక్టర్.. ఇక లేరు
Friday,February 22,2019 - 04:31 by Z_CLU
కోడి రామకృష్ణ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాతో మూడు దశాబ్దాల అనుబంధం ఆయన సొంతం. టాలీవుడ్ కు ఎన్నో గొప్ప చిత్రాలు అందించిన ఈ మహా దర్శకుడు ఇకలేరు. కొన్నాళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న కోడి రామకృష్ణ, కొద్ది సేపటి కిందట కన్నుమూశారు.
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా మారారు కోడి రామకృష్ణ. అలా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ డైరక్టర్ అయిపోయారు. చిరంజీవి హీరోగా నటించిన ఆ సినిమా ఓ థియేటర్ లో 525 రోజులాడింది. ఇక అక్కడ్నుంచి వెనతిరిగి చూడలేదు కోడి రామకృష్ణ.
సినిమాల్లోకి రాకముందే కేవలం దాసరి నారాయణరావు వద్ద మాత్రమే పనిచేశారు కోడి రామకృష్ణ. ఆయన సూచనలతోనే దర్శకుడిగా మారారు. తనకు జీవితం ఇచ్చిన దాసరిని అనుక్షణం గుర్తుచేసుకునేవారు. ఇక కోడి రామకృష్ణ అనగానే అందరికీ గుర్తొచ్చేవి గ్రాఫిక్ సినిమాలే. తెలుగులో గ్రాఫిక్స్ కు ఓ గుర్తింపు, వాటిద్వారా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్నారు కోడి రామకృష్ణ.
అమ్మోరు టైమ్ కి గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలుగు మేకర్స్ కు తెలియవు. అప్పటివరకు కెమెరా జిమ్మిక్కులతోనే నడిపించారు. లేదంటే 2డీ గ్రాఫిక్స్ చూపించేవారు. మొట్టమొదటిసారిగా కోడి రామకృష్ణ గ్రాఫిక్స్ వాడారు. దానికి సంబంధించిన పుస్తకాలు చదివారు. ఎంతో రీసెర్చ్ చేశారు. కేవలం టెక్నీషియన్స్ మీద ఆధారపడకుండా ఆ టెక్నాలజీని తనే తెలుసుకున్నారు. తక్కువ టైమ్ లో తక్కువ పెట్టుబడితో మంచి గ్రాఫిక్స్ రాబట్టడం ఎలాగో తెలుసుకున్నారు. అలా అద్భుతమైన గ్రాఫిక్స్ తో వచ్చి అందర్నీ అలరించింది అమ్మోరు.
అమ్మోరు నుంచి కోడి రామకృష్ణ వద్దకు వచ్చిన సినిమాల జానర్ మారిపోయింది. గ్రాఫిక్స్ అవసరమయ్యే సినిమాలన్నీ ఈయన చెంతకే వచ్చేవి. అలా తన కెరీర్ లో అరుంధతి, అంజి, దేవి, దేవిపుత్రుడు లాంటి ఎన్నో గ్రాఫిక్ సినిమాల్ని తెరకెక్కించారు కోడి రామకృష్ణ. కేవలం గ్రాఫిక్స్ పైనే ఆధారపడకుండా కథ, కథనం, ఎమోషన్స్ మిస్ అవ్వకుండా సినిమా తీయడం ఈయన స్పెషాలిటీ. అరుంధతి సినిమా అంత హిట్ అవ్వడానికి కారణం అదే.
గ్రాఫిక్ సినిమాల దర్శకుడిగా ఎక్కువ పాపులరైన కోడి రామకృష్ణ, నిజానికి తన కెరీర్ లో అంతకంటే మంచి సినిమాలు తీశారు. అంకుశం సినిమానే దీనికి పెద్ద ఉదాహరణ. ఈ సినిమాతో టాలీవుడ్ తో టాలీవుడ్ ట్రెండ్ నే మార్చేశారు కోడి రామకృష్ణ. ఆ తర్వాత అంకుశం స్పూర్తితో తీసిన భారత్ బంద్ మరో పెద్ద విజయం. తెలుగులోనే కాకుండా.. తమిళ్-కన్నడ-హిందీ భాషల్లో కూడా ఇది పెద్ద హిట్ అయింది.
కెరీర్ లో దాదాపు అన్ని జానర్స్ టచ్ చేస్తూ సినిమాలు తీసిన అతి తక్కువ దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. యాక్షన్, కామెడీ, సస్పెన్స్, ఫిమేల్ ఓరియంటెడ్, ఫ్యామిలీ.. ఇలా దాదాపు అన్ని జానర్స్ టచ్ చేశారాయన. చివరికి దేవుళ్లు లాంటి సినిమా కూడా కోడి రామకృష్ణ తీశారంటే ఇప్పటికీ చాలామంది ఆశ్చర్యపోతుంటారు.
ఇలా చెప్పుకుంటూ పోతే కోడి రామకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు. పెళ్లి, పెళ్లి పందిరి, దొంగాట, శత్రువు, మంగమ్మగారి మనవడు, మువ్వ గోపాలుడు, శ్రీనివాస కల్యాణం, స్టేషన్ మాస్టర్, ముద్దుల మామయ్య, బాల గోపాలుడు, 20వ శతాబ్దం, పెళ్లా చెబితే వినాలి, ఆస్తి మూరెడు-ఆశ బారెడు, పుట్టింటికి రా చెల్లి… ఇలా కెరీర్ లో 70శాతానికి పైగా విజయాలు సొంతం చేసుకున్నారు.
కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా.. కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నారు కోడి రామకృష్ణ. తెరపై ఆయన కనిపిస్తే దర్శకుడు అనే ఫీలింగ్ కూడా కలిగేది కాదు, అంత సహజనంగా నటించేవారు. నిత్యం తలపై ఓ తెల్లటి బ్యాండ్ తో కనిపించే ఈ గ్రేట్ డైరక్టర్ మన మధ్య లేరు. కోడి రామకృష్ణకు అశ్రునివాళి అర్పిస్తోంది జీ సినిమాలు.