జీ స్పెషల్: యమలీల తెరవెనక కథ

Tuesday,May 19,2020 - 12:44 by Z_CLU

కొన్ని సినిమాలు మనల్ని థియేటర్లో నవ్విస్తాయి. మరికొన్ని గుండెల్ని బరువెక్కించి ఏడిపిస్తాయి. మొదటి కేటగిరి సినిమాల్ని సినిమా హాల్ నుండి బయటికి రాగానే మరిచిపోతాం ఎప్పుడో ఓ సారి గుర్తుచేసుకొని కాసేపు నవ్వుకుంటాం. కానీ రెండో కేటగిరి సినిమాల్ని ఇంటికెళ్ళాక కూడా గుర్తుచేసుకుంటూ గుండెల్లో పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకునేది మూడో కేటగిరి సినిమా గురించి. అవును.. థియేటర్ లో మనల్ని నవ్విస్తూ, సెంటిమెంట్ తో ఏడిపించి మనకెప్పటికి గుర్తుందిపోయే చిరస్థాయి చిత్రంగా నిలిచింది ‘యమలీల’. యముడిని భూలోకానికి రప్పించి ఆటలాడిస్తూ చివర్లో మన హృదయాన్ని బరువెక్కించిన ఈ సెన్సేషనల్ హిట్ సినిమా వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. వాటి గురించి చెప్పే ప్రయత్నమే ఈ ‘ జీ స్పెషల్: ది బిహైండ్ స్టోరీ ఆఫ్ యమలీల’.

మనీషా వీడియో క్యాసెట్ల వ్యాపారంతో సక్సెసయిన కిషోర్ రాఠి, ఎస్.వి.కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి కలిసి తమకి అచ్చొచ్చిన పేరుతోనే ‘మనీషా ఫిలిమ్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి మొదటి ప్రయత్నంగా ‘కొబ్బరి బొండం’ అనే సినిమా తీసారు. ఆ సినిమాకు ఎస్.వి.కృష్ణా రెడ్డి కథ -స్క్రీన్ ప్లే తో పాటు సంగీతం అందించగా రవితేజ కాట్రగడ్డ దర్శకత్వం వహించారు. నిర్మించిన మొదటి సినిమా సూపర్ హిట్. అదే బ్యానర్ లో ఎస్.వి.కృష్ణా రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ రాజేంద్ర ప్రసాద్ తో ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ తీశారు. అది ఎవరూ ఊహించని విధంగా పెద్ద హిట్టయింది. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ నే పెట్టి ‘మాయలోడు’ తీసారు. అది కూడా సూపర్ హిట్…బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్లతో దర్శకుడిగా ఎస్.వి.కృష్ణా రెడ్డి సూపర్ సక్సెస్. మూడు సినిమాలకే మనీషా ఫిలిమ్స్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ఎస్.వి.కృష్ణా రెడ్డి దర్శకుడిగా సూపర్ స్టార్ కృష్ణతో మూడో సినిమా కమిట్ అయ్యారు.

ఈలోపు నాలుగో సినిమా గురించి చర్చ.. ఎలాంటి సబ్జెక్ట్ తో చేస్తే బాగుంటుంది..? ఇప్పటి వరకు తీసిన సినిమాలన్ని కొత్త కథలతో చేశాం. అందుకే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మన బ్యానర్ లో నా డైరెక్షన్ లో మరో సినిమా అంటే ప్రేక్షకులు అవే అంచనాలతో థియేటర్స్ కొస్తారు. ఏం చేస్తే బాగుంటుందంటూ అచ్చిరెడ్డితో కలిసి కృష్ణా రెడ్డి తర్జనభర్జన పడుతున్నారు. సరిగ్గా కృష్ణారెడ్డికి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే కొత్త కథ తట్టింది. బ్రహ్మ దేవుడు రాసిన మన విధి రాతలన్ని చిట్టా రూపంలో యముడి దగ్గరుంటాయి కదా. ఒకవేళ ఆ చిట్టా యమలోకం నుండి జారి భూలోకంలో పడితే.. ? అదెవరైనా చూసి ముందే తమ జాతకాల గురించి తెలుసుకుంటే ..? అంటూ కృష్ణారెడ్డి ఆసక్తికరంగా లైన్ చెప్పగానే నిర్మాత అచ్చిరెడ్డికి సూపర్ అన్నారు. ఇద్దరికీ ఆ థాట్ కొత్తగా అనిపించింది. ఆ ఆలోచనను వెంటనే రైటర్ దివాకర్ బాబు, ఎడిటర్ శరత్ , కో డైరెక్టర్ రంగారావు కుర్రాలతో పంచుకున్నారు. వారు కూడా పాయింట్ బాగుంది మంచి కథ కుదిరిందన్నారు.

ఓ వైపు ‘యమలీల’ కథ సిద్దం చేస్తూనే మరోవైపు సూపర్ స్టార్ కృష్ణతో ‘నెంబర్ వన్’ సినిమా షూటింగ్ చేస్తున్నారు కృష్ణా రెడ్డి. షూటింగ్ స్పాట్ లో కృష్ణా రెడ్డి, అచ్చి రెడ్డిలతో సరదాగా మాట్లాడుతూ వరుస హిట్లు కొడుతున్నారు. మన సినిమా కూడా బాగా వస్తుంది. ఫ్యాన్స్ నన్ను స్క్రీన్ పై కొత్తగా చూస్తారని చెబుతూ ఇంతకి మీ నెక్స్ట్ సినిమా ఏంటి ? అనడిగారు కృష్ణ. వెంటనే రెడీ అవుతున్న ‘యమలీల’ పాయింట్ చెప్పారు కృష్ణారెడ్డి. భలే ఉంది. కొత్త కథ.. దీనికి ఎవరైనా కొత్త హీరో అయితే బాగుంటుందన్నారు. మా మహేష్ ను హీరోగా పరిచయం చేయడానికి ఇలాంటి కథైతే బాగుంటుంది. కానీ వాడింకా చదువుకుంటున్నాడు ఇంకా నాలుగైదేళ్ళు పడుతుంది. అప్పటి వరకు ఈ కథను ఆపమనడం కరెక్ట్ కాదేమో అంటూ మనసుకి అనిపించింది చెప్పేశారు. సూపర్ స్టార్ అలా అనేసరికి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలకు ‘యమలీల’ పై నమ్మకం రెట్టింపైంది.


నటీనటుల ఎంపిక విషయానికొస్తే సినిమాలో హీరోగా ఎవరైతే బాగుంటుందనే చర్చ నడిచింది. మరీ కొత్త కుర్రాడు కాకుండా కాస్త పరిచయం ఉన్న నటుడైతే బాగుంటుందని కృష్ణా రెడ్డి , అచ్చి రెడ్డిలు అనుకుంటున్నారు. ఆలీతో ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఉన్నపళంగా అచ్చిరెడ్డితో అన్నారు కృష్ణారెడ్డి. అప్పటికే వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో ఆలీ మంచి పాత్రలు చేయడం, పైగా నటుడిగా చిన్నతనం నుండే మంచి గుర్తింపు అందుకోవడంతో వెంటనే బాగుంటుందన్నారు అచ్చిరెడ్డి. ఇదే విషయాన్ని టీంతో పంచుకున్నారు.

ఆ చర్చలో ఆలీ హీరో అనగానే ఎవరూ నోరు మెదపట్లేదు. ఇక లాభం లేదని నిర్మాత అచ్చిరెడ్డి ఆలీ స్టార్ కమెడియన్ కాదు, ఇంత పెద్ద కథ అతను మోయగలడా ? అసలు సినిమాకు ఆలీ హీరో అంటే బిజినెస్ అవుతుందా? ఇవన్నీ మీ మనసులో ఉండొచ్చు మేమూ అవన్ని ఆలోచించాం. అవన్నీ పక్కన పెట్టి నటుడిగా అతను ఈ పాత్రను చేయగలడా లేదా అన్నది చెప్పండి అవసరమైతే మనమే సొంతంగా రిలీజ్ చేసుకుందాం అన్నారు. వెంటనే తమ మనసులో ఉన్న ప్రశ్నలు నిర్మాత నోటి వెంట వచ్చే సరికి సరిగ్గా మేము ఇవే అనుకున్నాం కానీ ఈ కథకు నటుడిగా ఆలీ బెస్ట్ అనేశారందరు. హీరోగా ఆలీ ఫిక్స్. విషయం చెప్పగానే ఆలీ ఎగిరి గంతేశాడు. ఎస్.వీ. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మనీషా ఫిలింస్ బ్యానర్లో హీరోగా సినిమా అంటే ఎవరికైనా అలాగే ఉంటుంది మరి.

ఆలీ సరసన హీరోయిన్ కావాలి… ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తునారు. కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డిల మైండ్ లో ఒకే పేరు వినబడుతుంది. తనెవరో కాదు సౌందర్య. అప్పటికే కృష్ణా రెడ్డి డైరెక్షన్ లో హీరోయిన్ గా మూడు సినిమాలు చేయడంతో ఇంకేం ఆలోచించకుండా సౌందర్యను వెంటనే కలిసి కథ చెప్పారు. కథ బాగుంది హీరో ఎవరని అడిగింది. ఆలీ అనగానే నవ్వేసింది సౌందర్య. కథ నచ్చడంతో హీరో ఆలీ అయినప్పటికి హీరోయిన్ గా సినిమా చేస్తానని మాటిచ్చి పచ్చ జెండా ఊపింది. హీరోయిన్ ఫిక్స్. హమ్మయ్యా అనుకున్నారు కృష్ణా రెడ్డి , అచ్చిరెడ్డి లిద్దరు.

ఆలీ సరసన సౌందర్య సినిమా అంటూ వార్త బయటికొచ్చేసింది. అలా వార్త చక్కర్లు కొచ్చేసరికి ఊహించని ట్విస్టు దర్శక-నిర్మాతకు ఎదురైంది. విషయం తెలుసుకొని వారి సినిమాలకు అడ్వాన్సులిచ్చిన నిర్మాతలు సౌందర్యను కలిసి ఆలీతో సినిమా ఏంటండి..? ఇలాంటి నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. ఆ సినిమా తర్వాత హీరోయిన్ గా మీ గ్రాఫ్ పడిపోయి కెరీర్ క్లోజ్ అయినట్టే అంటూ భయపెట్టారు. ఆ భయంతో కెరీర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న సౌందర్యకి జ్వరం వచ్చేసింది. విషయాన్ని కృష్ణారెడ్డి , అచ్చిరెడ్డిలకు తెలియజేశాడు సౌందర్య తండ్రి సత్యనారాయణ. అర్రే తన కెరీర్ గ్రాఫ్ గురించి మేం ఆలోచించలేదు. పిచ్చిపిల్ల ఇంత విషయానికే జ్వరం తెచ్చుకుందా…. మేమొచ్చి ఏదోకటి చేస్తామని భరోసా ఇచ్చారు.

మరుసటి రోజే ప్రశాంత్ కుటీర్ లో ఉంటున్న సౌందర్యను కలిసి తను కాకుండా కథకు ఎవరైనా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నామంటూ కూల్ గా విషయం చెప్పారు. అవునా అదేంటి..? సౌందర్య కి డౌట్. మెల్లగా అన్ని కవర్ చేసి సౌందర్యకి నిజం చెప్పకుండా అగ్రిమెంట్ కాన్సిల్ చేసుకొచ్చేసారు కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి. అదే రోజు హీరోయిన్ గా ఇంద్రజను ఎంపిక చేసుకున్నారు. అలా హీరోయిన్ గా ఇంద్రజ అనుకోకుండా ప్రాజెక్టులోకి ఎంటరయింది.

ఇక సినిమాలో అసలు సిసలైన యముడి పాత్ర ఉంది కదా ఎవరు చేస్తారు ? మళ్ళీ చర్చ. కైకాల సత్యనారాయణ ఒక్కరె ఆప్షన్. కానీ ఆయన ఈ వయసులో నగలు, దుస్తులు వేసుకొని నటించగలరా ఇబ్బంది పడతారేమో సరే ఇంకెవరున్నారు..? ఎంత ఆలోచించినా ఎవరూ తట్టట్లేదు. చేసేదేం లేక సత్యనారాయణ గారిని కలిసి కథతో పాటు యముడి పాత్ర విషయం ఓపెన్ అయ్యారు కృష్ణా రెడ్డి. కథ బాగుంది కానీ ఇబ్బంది పడతాను అంటూనే మనసుకి నచ్చిన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు కైకాల. వెంటనే కమెడియన్ గా మంచి ఫాంలో ఉన్న బ్రహ్మానందంను చిత్రగుప్తుడిగా ఫిక్స్ చేసారు.

 ఇక సినిమాలో మరో మెయిన్ క్యారెక్టర్ ఉంది. ఆలీ తల్లి పాత్ర.. సెంటిమెంట్ బాగా పండించగల నటి కావాలి ఎవరున్నారు ? ‘శంకరాభరణం’ మంజు భార్గవి గారితో చేయిస్తే ఎలా ఉంటుందని కృష్ణా రెడ్డి అనగానే మంచి నటి అంటూ అందరూ ఓటేశారు. బెంగుళూరులో ఉన్న ఆమెకు ఫోన్ చేసి పాయింట్ తో పాటు ఆమె పాత్ర తాలుకూ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు చెప్పారు కృష్ణా రెడ్డి. కథ విన్నవెంటనే ఆమె ఎన్ని డేట్స్ కావాలండీ అంది. సినిమాలో ఓ కామెడీ విలన్ రోల్ కోసం అప్పటికే అడపాదడపా పాత్రలు చేసిన తనికెళ్ళ భరణి ను తీసుకున్నారు, అలీతో పాటు సినిమా అంతా ఉండే పాత్రకు గుండు హనుమంతురావును అనుకున్నారు. మెయిన్ క్యాస్టింగ్ ఫైనల్ అయిపోయింది.

ఇక కృష్ణారెడ్డి తన సంగీత ప్రతిభకు పనిచెప్పి మ్యూజిక్ డైరెక్టర్ గా ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. ఆ సందర్భంలో సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటే బాగుంటుందేమో అనే ఆలోచన ఆయన మదిలో మెదిలింది. ప్రత్యేక గీతం పెడితే బాగుంటుంది కానీ ఎవరితో చేయిద్దాం ? కృష్ణా రెడ్డి , అచ్చిరెడ్డి ఇద్దరికి సూపర్ స్టార్ ఒక్కరే సూపర్ ఆప్షన్ లా కనిపిస్తున్నారు. దైర్యం చేసి ఆయన్ను అడిగేశారు. అప్పటికే ‘నెంబర్ వన్’ సినిమా సూపర్ హిట్టవ్వడం పైగా అందులో పాటలకి మంచి రెస్పాన్స్ రావడంతో ‘యమలీల’ లో స్పెషల్ సాంగ్ కి సంతోషంగా పచ్చ జెండా ఊపేశారు కృష్ణ. వెంటనే సూపర్ స్టార్ చేయబోయే స్పెషల్ సాంగ్ ను అదే జోష్ లో ‘జుమ్బారే’ అంటూ కంపోజ్ చేసారు కృష్ణా రెడ్డి.

అలాగే యముడికి కూడా ఓ సాంగ్ పెడితే బాగుంటుందేమో అనుకున్నారు. ‘అభివందనం’ అంటూ ఓ సాంగ్ ను రికార్డ్ చేసారు. పాటలు పూర్తయ్యాయి. రైటర్ దివాకర్ బాబుతో కలిసి కృష్ణా రెడ్డి కథకు తుది మెరుగులు దిద్దుతున్నారు. సినిమాలో వచ్చే హాస్య సన్నివేశాలకు దివాకర్ బాబు ఏదో కొత్త పదాలతో మాటలు రాస్తున్నారు. స్క్రిప్ట్ పూర్తయింది. షూటింగ్ కి వెళ్ళే ముందు మెయిన్ టెక్నీషియన్స్ అందరిని పిలిచి ఎప్పటి లాగే కథను వినిపించారు కృష్ణా రెడ్డి. అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయడానికి ఓ ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. ఓ బడ్జెట్ అనుకొని ఎట్టిపరిస్థితుల్లో ఆ లైన్ దాటకుండా అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చకచకా జరిగిపోయింది. ముప్పై రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనుకున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆర్ట్ డైరెక్టర్ రాజు ‘యమలోకం’ సెట్ వేసారు. చూసిన వారందరూ యమలోకంలో అడుగుపెట్టినట్టు ఫీలవుతున్నారు. ఆయన వర్క్ సక్సెస్. అలాగే రామానాయుడు , సారధి స్టూడియోస్ తో పాటు హైదరాబాద్ లో కొన్ని లోకేషన్స్ ఫైనల్ చేసారు. షూటింగ్ మొదలెట్టడమే ఆలస్యం అన్నట్టుగా చకాచకా పనులు జరిగిపోతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలో అలీపై మొదటి సన్నివేశం… ఫస్ట్ షాట్ అవ్వగానే అందరు క్లాప్స్ కొట్టారు. ఇక అక్కడి నుండి దర్శకుడు కృష్ణా రెడ్డి విజన్ ను క్యాచ్ చేస్తూ కెమెరామెన్ శరత్ జెట్ స్పీడ్ లో సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. కాస్ట్యూమ్ ప్రసాద్ సమయానికి కాస్ట్యూమ్స్ అందిస్తూ తన పని తను చేసుకుపోతున్నారు.

కొరియోగ్రాఫర్ సుచిత్ర సినిమాలో పాటలకు నటీనటులతో అదిరిపోయే స్టెప్స్ వేయిస్తూ మంచి అవుట్ పుట్ వచ్చేలా చూస్తున్నారు. ముఖ్యంగా యముడి సాంగ్ ను హుందాగా కంపోజ్ చేయడానికి చాలా కష్టపడ్డారు సుచిత్ర. అందుకే ఈ సినిమాకు గానూ ఆమెకు ఉత్తమ డాన్స్ మాస్టర్ గా నంది అవార్డు లభించింది. కథ మొత్తం తెలుసు కనుక అందరూ చాలా క్లారిటీతో వర్క్ చేస్తున్నారు. షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ మేనేజర్ నుండి బాయ్ వరకు అందరు ఓ గొప్ప సినిమాకి పనిచేస్తున్నామనే ఫీలింగ్ తో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేయడంతో చాలా వేగంగా షూటింగ్ పూర్తయింది. ఒక్కసారి షూటింగ్ ఎన్ని రోజులు చేశామని చూసుకుంటే కేవలం 28 రోజుల లెక్క తేలింది.

ఎడిటర్ రాంగోపాల్ రెడ్డి షూటింగ్ కి ముందు నుండే ఫాలో అవుతున్నారు కాబట్టి చాలా తొందరగానే ఎడిట్ టేబుల్ నుండి అవుట్ పుట్ బయటికొచ్చేసింది. స్టార్టింగ్ లో అలీ హీరో అని వెనకడుగు వేసిన డిస్ట్రిబ్యూటర్స్ మళ్ళీ ముందడుగేసి సినిమాను కొనుగోలు చేసారు. నైజాం మినహా మిగతా ఏరియాలన్ని క్లోజ్. నైజాంలో మయూరి సంస్థతో కలిసి మనిషా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూట్ చేసారు.

సినిమా ఆల్బం రేంజ్ ముందే ఊహించిన మ్యాగ్న సౌండ్ వారు సాంగ్స్ రెడీ అవ్వగానే ఆడియో రైట్స్ తీసుకొని విడుదల చేసారు. ఓ భారీ సినిమా రేంజ్ లో ఆడియో క్యాసెట్లు విపరీతంగా సేల్ అవ్వడంతో హైదరాబాద్ తాజ్ హోటల్ లో యూనిట్ ను పిలిచి ఆడియో కంపెనీ వారు ఘనంగా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ నిర్వహించారు.

1994 లో ఏప్రిల్ 28న రిలీజైన ‘యమలీల’ మెల్లమెల్లగా ప్రేక్షకులను ఆకట్టుకొంటూ దూసుకుపోయింది. రోజు రోజుకి సైకిల్ స్టాండులో సైకిళ్ళ లెక్క పెరుగుతుంది. క్యాంటీన్ లో సమోసాలు ఎన్ని తీసుకొచ్చినా అయిపోతున్నాయి. టికెట్ల కోసం కుటుంబాలు క్యూ కట్టడం చూస్తున్న థియేటర్ ఓనర్లు కౌంటర్లో డబ్బులు లెక్కేసుకుంటూ సంబరపడిపోతున్నారు.

ముందుగా 50 ప్రింట్లతో విడుదల కాగా రోజు రోజుకి భయంకరమైన రెస్పాన్స్ వస్తుండటంతో వారానికో పది , ఇరవై, చొప్పున దాదాపు 100 అధిక ప్రింట్లు వేయాల్సి వచ్చింది. సినిమాలో యముడి కామెడీ సన్నివేశాలు , మదర్ సెంటిమెంట్ , సాంగ్స్ ఇలా అన్నిటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కృష్ణ స్పెషల్ సాంగ్ కూడా ఓ రేంజ్ లో క్లిక్ అయింది. ఇక సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు, అలాగే ఎగ్జిబ్యూటర్లతో పాటు థియేటర్స్ లో సైకిల్ స్టాండ్ , క్యాంటీన్ వాళ్ళు కూడా బాగానే లాభ పడ్డారు. అందుకే సెన్సేషనల్ హిట్ సినిమాగా ‘యమలీల’ వారికి ఎప్పటికి గుర్తుంటుంది. ఇప్పటికీ ఆ టైటిల్ వింటే చాలు ఆ ఘన విజయాన్ని తలుచుకుంటూ సంతోషపడతుంటారు.

కోటి లోపు బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా దాదాపు 10 కోట్లు కలెక్ట్ చేసి ఔరా ‘యమలీల’ అనిపించుకుంది. 40 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా 12 కేంద్రాల్లో 175 రోజులాడింది. షిఫ్టింగ్ అవుతూ హైదరాబాద్ లో 400 రోజులు ప్రదర్శించబడింది.

సిద్దిపేటలో బాలాజీ డీలక్స్ థియేటర్ లో రోజుకు నాలుగు షోల చోపున యాబై రోజులాడిన మొదటి సినిమా ‘యమలీల’నే . అందుకు గానూ సిద్దిపేట్ లో థియేటర్ యాజమాన్యం అర్థ శతదినోత్సవ వేడుక చేసి యూనిట్ ను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఆ సెలెబ్రేషన్ కు అప్పటి ఎం.ఎల్.ఏ గా ఉన్న ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై తన మాటలతో ఆ వేడుకకు మరింత అందం తీసుకొచ్చారు.

అలాగే వంద రోజుల ఫంక్షన్ ను మేకర్స్ హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో చేసారు. శతదినోత్సవ వేడుకకు అప్పటి మినిస్టర్ పీ.వి.రంగారావు గారితో పాటు హీరోలు కృష్ణ , నందమూరి బాలకృష్ణ , వెంకటేష్, హీరోయిన్లు సౌందర్య, రోజాతో పాటు పలువురు హాజరై యూనిట్ కు షీల్డులు అందజేసి అభినందించారు.


సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే కథ మీద నమ్మకంతో సినిమాకు సంబంధించి హిందీ రైట్స్ కొనుగోలు చేసారు సూపర్ స్టార్ కృష్ణ. ఆ తర్వాత కృష్ణ గారి నుండి రామానాయుడు గారు ఆ రైట్స్ తీసుకొని వెంకటేష్ హీరోగా హిందీలో ‘తక్దీర్ వాలా’ పేరుతో రీమేక్ చేసారు. తర్వాత తమిళ్ లో కార్తిక్ హీరోగా ‘లక్కీ మెన్’ గా రీమేక్ అయింది.

మొదట్లో సినిమా వసూళ్లు చూసి అలీ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్లా అంటూ ఆశ్చర్య పోయిన ఇండస్ట్రీ జనాలు తర్వాత సినిమాలో ఉన్న దమ్ము తెసుకొని మేకర్స్ ను ఫోన్లు చేసి ప్రశంసించారు. ఇక ‘యమలీల’ ప్రభంజనంతో అలీ ఉక్కిరిబిక్కిరయ్యే రేంజ్ లో ఆఫర్లు అందుకొని హీరోగా యాబై సినిమాలు చేసే స్థాయికెళ్ళాడు. 4 ఏళ్ల పాటు అలీకి రెస్ట్ తీసుకోవడానికి కూడా టైమ్ దొరకలేదంటే యమలీల అతడి జీవితాన్ని ఎంతలా మార్చేసిందో అర్థంచేసుకోవచ్చు.

ఇది కమెడియన్ అలీను హీరోగా పెట్టి డైరెక్టర్ ఎస్.వి.కృష్ణా రెడ్డి తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ ‘యమలీల’ తెరవెనుక సంగతి.