తేజ ఇంటర్వ్యూ

Tuesday,August 08,2017 - 06:31 by Z_CLU

రానా-కాజల్ జంటగా కేథరిన్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘నేనే రాజు నేనే మంత్రి’ రిలీజ్ కి రెడీ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం థియేటర్స్ లోకి రానున్న సందర్భంగా దర్శకుడు తేజ మీడియాతో మాట్లాడారు.

 

మార్పులు చాలా జరిగాయి

హోరా హోరీ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఓ కథను రెడీ చేసి ఓ హీరో కి చెప్పాను. ‘అహం’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాం. కానీ అనుకోని కారణాల వల్ల కథలో కొన్ని మార్పులు చేసి సురేష్ బాబుకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత రానా కథలోకొచ్చాడు. రానాకి కథ బాగా నచ్చడంతో ఎప్పుడు మొదలెడదాం..అని అడుగుతూ ఎగ్జైట్ అయ్యాడు. సో అలా కథలో కొన్ని మార్పులు జరిగి ఫైనల్ గా ఈ సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ గా థియేటర్స్ లో రానుంది.

 

కథ పరంగా వీక్ అయ్యాను

తేజ అనే వాడు డైరెక్టర్ గా వీక్ అయ్యాడనుకుంటున్నారు కానీ నేను దర్శకత్వంలో వీక్ అవ్వలేదు. కేవలం కథ పరంగానే వీక్ అయ్యానంతే.. స్క్రిప్ట్ స్ట్రాంగ్ గా ఉంటే ఎవరైనా డైరెక్ట్ చెయ్యొచ్చని నా ఫీలింగ్. సో గత సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కథ వీక్ గా ఉండటమే రీజన్.


బాహుబలి-2 కంటే ముందు మేమే

‘బాహుబలి-2’ స్టార్ట్ అవ్వడానికి ముందే రానా ఈ సినిమాకు డేట్స్ ఇచ్చి వెంటనే స్టార్ట్ చేసేద్దామని చెప్పాడు. కానీ మా సినిమా స్టార్ట్ అవ్వగానే ‘బాహుబలి 2’ కూడా స్టార్ట్ అయింది. కొంత వరకూ ఆ సినిమాకి ముందు తీసి మళ్ళీ ఆ సినిమా అయిపోయాక మిగిలిన కొంత పార్ట్ తీశాం.

 

కాజల్ కి కథ బాగా నచ్చింది

సురేష్ బాబు ఈ సినిమాలో రాధ క్యారెక్టర్ కాజల్ చేస్తేనే బాగుంటుందని అన్నారు. వెంటనే కాజల్ కి స్క్రిప్ట్ చెప్పాను. తనకి కూడా కథ బాగా నచ్చడంతో వెంటనే డేట్స్ ఇచ్చింది. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాకి ఇప్పటికీ కాజల్ నటిగా చాలా నేర్చుకుంది. నాకే పాఠాలు చెప్పేంతలా ఎదిగింది. తనను పరిచయం చేసిన దర్శకుడిగా గర్వపడుతున్నాను.

 

సురేష్ బాబు పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్

ఈ కథ సురేష్ బాబు దగ్గరికి వెళ్ళాక చాలా బెటర్ గా మారింది. కొన్ని సీన్స్ బాగోకపోతే బాగాలేదని నిర్మోహమాటంగా చెప్పి ఇంకా బెటర్ కోరుకుంటారు. ఆయన చెప్పినప్పుడు కొంచెం కోపం వచ్చినా ఒక గంట తర్వాత ఆయనే కరెక్ట్ అనిపిస్తుంది. నిర్మాతగా సురేష్ బాబు పర్ఫెక్ట్. ఒక పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ తో ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీ. రీసెంట్ గా ఆయన సినిమా చూసి చాలా హ్యాపీ గా ఫీలయ్యారు.


అన్ని అంశాలుంటాయి

నిజానికి సినిమా ట్రైలర్ చూసాక అందరూ ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అనుకుంటున్నారు. కానీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో అన్ని అంశాలతో ఉండే సినిమా ఇది. పాలిటిక్స్ అనేది ఇందులో 10 % మాత్రమే.. నిజానికి పూర్తి పొలిటికల్ డ్రామా అయితే నేనే నా ఫ్యామిలీతో ఆ సినిమాకి వెళ్లను.. అలాంటిది నేనెలా తీయగలను.. ‘నేనే రాజు నేనే మంత్రి’ అన్ని మసాలాలతో కలగలిపి అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది.

 

ఇప్పుడు చేతులు కలుపుతున్నారు

ఫ్లాపులొచ్చినప్పుడు చేతులు జేబులో పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ట్రైలర్ చూసి జేబులో నుంచి చేతులు తీసి ట్రైలర్ బాగుందండి.. కచ్చితంగా హిట్ కొడతారు అంటున్నారు. ఫైనల్ గా ఇక్కడ సక్సెసే ఇంపార్టెంట్. కానీ నేను అవన్నీ పెద్దగా పట్టించుకోను. అన్నిటి కంటే ముందు నన్ను నేను సంతోషపరుచుకుంటాను. మిగతా వాటి గురించి పెద్దగా ఆలోచించను.

 

నిజం విషయంలో కొంచెం ఫీల్ అయ్యాను

నేను ఇప్పటి వరకూ తీసిన సినిమాల్లో కొన్ని సూపర్ హిట్స్ తో పాటు అట్టర్ ఫ్లాపులు కూడా ఉన్నాయి. ఏ సినిమాకి అంచనాలు పెట్టుకోలేదు. కానీ ‘నిజం’ విషయంలో మాత్రం కొంచెం ఫీలవుతుంటాను. మహేష్ బాబుతో చేసిన ఆ సినిమాకి చాలా కష్టపడ్డాం. ఆ సినిమా కంటే ముందే ఒక్కడు రిలీజ్ అవ్వడం ఆ సినిమాతో మహేష్ బాబు ఇమేజ్ మారిపోవడంతో నిజంపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకే ఆ సినిమా అనుకున్నంత విజయం అందుకోలేకపోయింది.


ఆయనుంటే బాగుండేది

చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేటప్పుడు సినిమా పోస్టర్స్ పై డి.రామానాయుడు అని పేరు కనిపించేది. దర్శకుడిగా పరిచయం అయినప్పుడు ఆయనతో ఎప్పటికైనా ఓ సినిమా చేయాలని అనుకున్నా. ఫైనల్ గా సురేష్ ప్రొడక్షన్ లో సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది.. కానీ ఆయనుంటే ఈ సినిమా చూసి ఉంటే చాలా హ్యాపీ గా ఫీలయ్యే వారు.

 

రానా ఇంటెలిజెంట్ యాక్టర్

రానా చాలా ఇంటెలిజెంట్ యాక్టర్. ఏదైనా ఒక సీన్ గురించి చెప్తే రాత్రంతా దాని గురించే ఆలోచిస్తూ పొద్దున్నే ఆ సీన్స్ కి ఎలా బిహేవ్ చేయాలో సరిగ్గా అలాగే నటిస్తూ అదే యాటిట్యూడ్ చూపిస్తాడు. అలాంటి నటులు అరుదు అనే చెప్పాలి. సెట్ లో నేను రానా అని కాకుండా జోగేంద్రలా బిహేవ్ చేసేవాడు. రానా లో ఆ ఇంటెలిజెంట్ యాక్టింగ్ నాకు బాగా నచ్చింది.

 

నాసినిమాల్లో హీరోయిన్ అలాగే ఉంటుంది

నా సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కానీ మిగతా విమెన్ క్యారెక్టర్స్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ సినిమాలో కూడా రాధా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎక్కువగా విమెన్ ని స్ట్రాంగ్ గా చూపించడానికి ఇష్టపడతాను. ఏదో పాటల గురించి కొన్ని రొమాంటిక్ సీన్స్ గురించి విమెన్ ని పెట్టడం నాకిష్టం ఉండదు.

 

మనుషులతో చెస్ ఆడితే …

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఏడుగురు కలిసి ఒకరితో ఒకరు ఆడుకునే ఇంటెలిజెంట్ గేమ్ తో తెరకెక్కించిన సినిమా ఇది. అలా అని ట్విస్ట్ లు, స్క్రీన్ ప్లే లో ఇంటెలిజెన్స్ లాంటివేం ఉండవు. అందరికీ అర్ధం అయ్యేటట్లే నార్మల్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనుషులతో మనుషులు చెస్ ఆడితే ఎలా ఉంటుందో..అదే ఈ సినిమా.


అదే నా టార్గెట్

ఒక దర్శకుడిగా నా సినిమా వల్ల వందల కుటుంబాలను సంతోషపరచడం, వారికి ఉపాధి కల్పించడమే నా టార్గెట్. సినిమా చేసేటప్పుడు వాళ్ళను, ఆడియన్స్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటా. కానీ కొన్ని సార్లు హిట్ అవ్వొచ్చు ఫ్లాప్ అవ్వొచ్చు. అవి మన చేతిలో లేవు.

 

దమ్ముండాలి

మన తెలుగు సినిమా స్థాయి చాలా గొప్పది. అప్పట్లో ఓ 50 ఏళ్ళు పై బడిన వ్యక్తితో శంకరాభరణం అనే టైటిల్ తో సినిమా తీసి అంత పెద్ద హిట్ కొట్టామంటే మామూలు విషయం కాదు. ఇప్పటికీ ఆ సినిమా పాటలు ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. శంకరాభరణం సినిమా ఇప్పుడు తీసినా చూస్తారు. కానీ తీసే దమ్ముండాలి. అంత గొప్పగా తీయగలిగే టాలెంట్ మన తెలుగు వాళ్లలో ఉంది. దర్శకుడిగా ఎంత కష్టపడితే అంత విజయం సాధించొచ్చని నా ఫీలింగ్.

 

నాలా నేనుంటా

హిట్ ఫ్లాపు అనేవి పట్టించుకోకుండా నాలా నేనుంటా.. సూపర్ హిట్స్ వచ్చినప్పుడు పొంగిపోలేదు, అట్టర్ ఫ్లాపు తగిలినప్పుడు కుంగిపోలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తా.. హిట్ వచ్చినా ఫ్లాపొచ్చినా నాకు తెలిసిన పని మాత్రం సినిమా తీయడమే.. అందుకే నా పని నేను చేసుకుంటూ ముందుకెళ్తుంటాను. ఎవరి మాటలు పట్టించుకోను.

 

ఇంకా అనుకోలేదు

ఈ సినిమా ట్రైలర్ చూసి నెక్స్ట్ సినిమా మాతో చేయమని కొంత మంది సూట్ కేసులతో వచ్చి అడిగారు. కానీ నేను మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాతే నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తా.. ఇక నా నుంచి వచ్చే సినిమాలు బెటర్ గా ఉండేలా జాగ్రత్త తీసుకుంటాను.