గోపీచంద్ కు విలన్ దొరికేశాడు

Saturday,March 07,2020 - 11:40 by Z_CLU

ఒకప్పటి హీరోయిన్ అంజలా జవేరి భర్త, నటుడు తరుణ్‌ అరోరా మరోసారి తెలుగు తెరపై విలనిజం చూపించబోతున్నాడు. ‘ఖైదీ నంబరు 150’, ‘అర్జున్‌ సురవరం’ చిత్రాల్లో విలన్ గా మెప్పించిన అరోరా ప్రస్తుతం గోపీచంద్‌ సినిమాలో విలన్ గా నటించేందుకు రెడీ అవుతున్నాడు.

గోపీచంద్‌ హీరోగా దర్శకుడు సంపత్‌ నంది ‘సీటీమార్‌’ అనే సినిమా వస్తోంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో విలన్‌ పాత్రకు ఎంపికయ్యాడు తరుణ్‌. ఈమధ్య ఈ సినిమా మూడో షెడ్యూల్ మొదలైంది. ఇందులో తరుణ్ అరోరా పాల్గొన్నాడు.

సెట్‌లో అడుగుపెట్టి, డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్న అరోరాకు సంబంధించిన ఓ వీడియోను యూనిట్ రిలీజ్ చేసింది. తరుణ్‌ ఇందులో సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు.

గోపీచంద్‌ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక చావ్లా, దిగంగన సూర్యవంశీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి గోపీచంద్, తమన్న ఫస్ట్ లుక్స్ రిలీజయ్యాయి.