ఓంపురి కన్నుమూత

Friday,January 06,2017 - 12:30 by Z_CLU

ప్రముఖ నటుడు,రంగస్థల కళాకారుడు ఓంపురి కన్నుమూశారు. ఈరోజు ఉదయం ముంబయిలోని అంధేరిలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు ఓంపురి. తీవ్రమైన గుండె పోటు రావడంతో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు.. దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో నటించిన విలక్షణ నటుడిగా ఓంపురికి పేరుంది. కేవలం ఆర్ట్ సినిమాలకే పరిమితం కాకుండా, కమర్షియల్ సినిమాల్లో కూడా నటించి తన మార్క్ చూపించారు ఓంపురి. ప్రస్తుతం ఓ పాకిస్థానీ సినిమాతో పాటు, హాలీవుడ్ మూవీలో నటిస్తున్న ఓంపురి.. ఆ సినిమాల చిత్రీకరణ పూర్తి కాకుండానే కన్నుమూశారు.

1950, అక్టోబర్‌ 18న హరియాణలోని అంబాలాలో జన్మించిన ఓంపురి.. పుణే ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరి గ్రాడ్యూయేషన్ పూర్తిచేశారు. ‘అర్ద్‌ సత్య’, ‘జానే భీదో యారో’,‘పార్‌’ లాంటి సినిమాల్లో ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. 8 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులతో పాటు 2 జాతీయ అవార్డులు అందుకున్నారు. 1990లో భారతప్రభుత్వం, ఓంపురికి పద్మశ్రీ పురస్కారం అందించింది. తెలుగులో రాత్రి, అంకురం లాంటి సినిమాల్లో ఓంపురి నటించారు.