సైరా ట్రయిలర్ రివ్యూ

Wednesday,September 18,2019 - 06:04 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సైరా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ కొద్దిసేపటి కిందట విడుదలైంది. మెగాభిమానుల వెయిటింగ్ కు తిరుగులేని సమాధానంగా నిలిచింది సైరా ట్రయిలర్. 2 నిమిషాల 54 సెకెన్ల నిడివి ఉన్న ఈ ట్రయిలర్ అదిరింది. సినిమాపై అంచనాల్ని మరింత పెంచేసింది.

బ్రిటిషర్లపై పోరాటం చేసిన తొలి స్వతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కింది సైరా సినిమా. ఆ విషయాన్ని ట్రయిలర్ లో స్పష్టంగా చెప్పారు. స్వతంత్ర పోరాటంతో పాటు నరసింహారెడ్డి వ్యక్తిగత జీవితాన్ని కూడా సినిమాలో టచ్ చేశారు. తన ప్రాంత ప్రజల్లో నరసింహారెడ్డి ఎలా స్వతంత్ర స్ఫూర్తిని రగిల్చాడు, బ్రిటిష్ పై ఎంత వీరోచితంగా పోరాడాడనే ఎలిమెంట్స్ ను ట్రయిలర్ లో చూపించారు.

అందరూ ఊహించినట్టుగానే ట్రయిలర్ లో యుద్ధ సన్నివేశాలకు, గ్రాండియర్ విజువల్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. విజువల్స్ చూస్తే సినిమా ఎంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిందో ఊహించుకోవచ్చు. ఇవన్నీ ఒకెత్తయితే, సినిమాకు భారీగా గ్రాఫిక్స్ ఉపయోగించారనే విషయం కూడా ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

దాదాపు కీలక పాత్రలన్నింటినీ ట్రయిలర్ లో పరిచయం చేశారు. చిరంజీవితో పాటు నయనతార, తమన్న, విజయ్ సేతుపతి, సుదీప్, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు.. ఇలా అన్ని పాత్రల్ని ట్రయిలర్ లో చూపించారు. ఈరోజు ఏపీ, నైజాంలో 96 థియేటర్లలో ట్రయిలర్ ను ఎక్స్ క్లూజివ్ గా ప్రదర్శించారు. రేపట్నుంచి దాదాపు అన్ని మెయిన్ థియేటర్లలో ట్రయిలర్ ను ప్రదర్శిస్తారు.