ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే స్పెషల్

Monday,June 01,2020 - 12:35 by Z_CLU

‘తెలుగు సినిమా చరిత్ర’ అనే పుస్తకంలో ప్రతీ దర్శకుడికి కొన్ని పేజీలుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి ఓ గొప్ప దర్శకుడి గురించే. ఆయనే ఎస్.వి.కృష్ణా రెడ్డి. ఒకప్పుడు విజయాలకు చిరునామా ఆయన. కొత్త కథలకు రూపం ఆయన. ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించి దర్శకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి  జన్మదినం సందర్భంగా ‘జీ సినిమాలు‘ స్పెషల్ స్టోరీ.

మొదటి చిత్రం ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ నుండి మొదలుపెడితే ‘మాయలోడు’, ‘యమలీల’, ‘ఘటోత్కచుడు’ ఇలా ప్రయోగాత్మకమైన కథలతో ట్రెండ్ సెట్ చేసారు కృష్ణారెడ్డి. కమెడియన్ ఆలీని హీరోగా మార్చి ‘యమలీల’ తో సూపర్ డూపర్ హిట్టు కొట్టడం, సూపర్ స్టార్ కృష్ణను సరికొత్త అవతారంలో చూపించి ‘నంబర్ 1’ గా తీర్చిదిద్దడం, ఘటోత్కచుడు అంటూ అన్ని అంశాలతో ఓ ప్రయోగంతో కూడిన కమర్షియల్ సినిమా తెరకెక్కించడం, ‘శుభలగ్నం’ సెంటిమెంట్ తో ఫ్యామిలీలను మళ్ళీ మళ్ళీ సినిమా హాళ్ళకు రప్పించడం ఇవి దర్శకుడిగా కృష్ణారెడ్డి గారు సాధించిన విజయాలు.

ఒకటా రెండా ఆయన సూపర్ సినిమాల లిస్టు చూస్తే ఔరా కృష్ణా రెడ్డి అనిపించకమానదు. ‘శుభలగ్నం’, ‘మావిచిగురు’, ‘ఎగిరే పావురమా’ ఇలా వరుస సూపర్ హిట్లతో ఒకప్పుడు దర్శకుడిగా కృష్ణా రెడ్డి పరిశ్రమలో చక్రం చెప్పారు. దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి వరుసగా ఐదు సూపర్ హిట్లు కొట్టడం మాములు విషయం కాదు. తనకున్న అతితక్కువ అనుభవంతో ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు కృష్ణారెడ్డి. అవును ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’, ‘మాయలోడు’, ‘నంబర్ 1’, ‘యమలీల’, ‘శుభలగ్నం’ ఇలా వరుసగా 5 సూపర్ హిట్లు కొట్టి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో నిరుపించారాయన.

తెలుగు చిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలి అనే బిరుదు చాలా తక్కువ మందికి దక్కింది. అందులో కృష్ణా రెడ్డి ఒకరు. రచయితగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. డైరెక్షన్ తో పాటు మ్యూజిక్ కూడా చేసిన అతికొద్ది మందిలో కృష్ణా రెడ్డి ముందు వరుసలో ఉంటారు. దర్శకుడిగా ఆయనెంత సక్సెస్ అయ్యారో, సంగీత దర్శకుడిగా కూడా అంతే సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు ఎస్.వి.కృష్ణారెడ్డి మ్యూజిక్ తో సినిమా పాటలు రిలీజయ్యాయని తెలిస్తే చాలు ఆడియో క్యాసెట్ల షాపుల ముందు క్యూ కట్టేవారు. ఒక టైంలో మాస్ బీట్ సాంగ్స్ తో శ్రోతలను ఆకట్టుకుని మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక ఊపు ఊపారు. అందుకే ఆయన ఆల్బమ్స్ ను మ్యాగ్న లాంటి ఆడియో కంపెనీ భారీ ఎమౌంట్ ఇచ్చి కొనుగోలు చేసేవారు.

ఇక నటుడిగా నాలుగు సినిమాలు చేసారు ఎస్.వి. ‘పగడాల పడవ’, ‘కిరాతకుడు’ సినిమాల్లో చిన్న వేషాలు వేసిన కృష్ణా రెడ్డి హీరోగా ‘ఉగాది’, ‘అభిషేకం’ సినిమాలు చేసారు. 43 ఏళ్ల సినీ ప్రయాణంలో నలబై సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈరోజు 59వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కృష్ణా రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది ‘జీ సినిమాలు’.