సురేష్ ప్రొడక్షన్స్ లో అడుగుపెడితే అంతేనా..?

Tuesday,June 19,2018 - 04:30 by Z_CLU

ఇండస్ట్రీలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉన్న అతిపెద్ద రిమార్క్ ఇది. ఆ బ్యానర్ లో అడుగుపెడితే ఇక బయటకు రాలేమని, స్టోరీ చెప్పి సురేష్ బాబును మెప్పించేసరికి జీవితకాలం పూర్తయిపోతుందనే విమర్శలున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో నలుగుతున్న ఈ విమర్శపై ఎట్టకేలకు రియాక్ట్ అయ్యారు ప్రొడ్యూసర్ సురేష్ బాబు.

“నేను కథ ఓకే చేయను, చాలా ఏళ్లు నానుస్తాననే విమర్శ ఉంది. కానీ అన్ని సినిమాలకు అలా చేయను. కొన్ని సినిమాలకు అలా జరుగుతుంది. క్రాఫ్ట్ లేని సినిమాలకు అలా జరుగుతుంది. క్రాఫ్ట్ ఉండే సినిమాలకు నేనెప్పుడూ అడ్డు చెప్పను. వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిస్తాను. అలాంటి సినిమాలే హిట్ అవుతాయి.”

ఇలా తన మైండ్ సెట్ కు సంబంధించి ఇలా పూర్తి క్లారిటీ ఇచ్చారు సురేష్ బాబు. కంప్లీట్ క్రాఫ్ట్ తో వస్తే తను ఖర్చు గురించి ఎప్పుడూ ఆలోచించనని, కుర్రాళ్లకైతే వాళ్ల టాలెంట్ ను బయటపెట్టే అవకాశాన్ని పూర్తిగా కల్పిస్తానని సురేష్ బాబు తెలిపారు.

ఇదే విషయాన్ని దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా చెప్పుకొచ్చాడు. సురేష్ బాబు దగ్గర నాన్చే వ్యవహారాలు ఉండవని, ఫటాఫట్ మేటర్ సెటిల్ చేస్తారని అంటున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై “ఈ నగరానికి ఏమైంది” అనే సినిమా తీశాడు ఈ దర్శకుడు.

“సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అడుగుపెడితే బయటపడలేవని నన్ను కూడా చాలామంది హెచ్చరించారు. కానీ ఇక్కడికొచ్చాక నాకే బయటకు వెళ్లాలనిపించలేదు. పెళ్లిచూపులు తర్వాత నేను ఎక్కువ టైం తీసుకున్నాను. సురేష్ గారు నన్ను తొందరపెట్టేవారు. నేను సంవత్సరం గ్యాప్ తీసుకొని కథ చెబితే, సింగిల్ సిట్టింగ్ కే ఓకే చెప్పారు. నేను షాక్.”

సో.. సురేష్ ప్రొడక్షన్స్ లో అడుగుపెడితే బయటకురాలేం అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. స్టోరీ, క్రాఫ్టింగ్ సరిగ్గా ఉంటే క్షణాల్లో ఓకే చెబుతారు సురేష్ బాబు.