గొప్ప సందేశానికి ఐదేళ్ళు!

Friday,August 07,2020 - 04:56 by Z_CLU

క్రేజ్ ఉన్న స్టార్ హీరోకి సందేశంతో కూడిన మంచి కమర్షియల్ సినిమా పడితే ఎలా ఉంటుంది..? ఇంకేం ఉంది థియేటర్స్ ముందు టికెట్ల కోసం ప్రేక్షకులు క్యూ కట్టాల్సిందే. ఫైనల్ గా బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే. ఐదేళ్ళ క్రితం సరిగ్గా ఇదే జరిగింది. దమ్మున్న కథ దొరకడంతో సూపర్ స్టార్ మహేష్ మరోసారి తన స్టామినా చూపించి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. మహేష్ శ్రీమంతుడుగా వచ్చి మంచి సందేశం ఇచ్చి ఇవాళ్టికి (ఆగస్ట్ 9) సరిగ్గా ఐదేళ్ళవుతుంది. ఈ సందర్భంగా మహేష్ కొరటాల కాంబోలో వచ్చిన ఈ సినిమాపై ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.

ఓ పెద్ద వ్యాపారవేత్త కొడుకు తన మూలాల తెలుసుకొని సొంతూరు వెళ్లి అక్కడ అభివృద్ధి పనులు చేపడితే…? కొరటాల రాసుకున్న ఈ ఐడియా బాక్సాఫీస్ ను షేక్ చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. రెండున్నర గంటల వినోదం కోసం సినిమా హాల్ కి వచ్చే ప్రేక్షకులకు ఊహించని కమర్షియల్ ఎలిమెంట్స్ తో శ్రీమంతుడు అంటూ దిమ్మతిరిగే సందేశమిచ్చి దెబ్బకి టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు కొరటాల. ఇక  క్లాస్ ప్లస్ మాస్ ఎలిమెంట్స్ మిక్సయిన కథ దొరికేసరికి మరోసారి రికార్డుల దుమ్ము దులిపేసాడు మహేష్.

శ్రీమంతుడు FULL MOVIE

‘శ్రీమంతుడు’ అంతటి భారీ విజయం సొంతం చేసుకోవడానికి చాలా కారణాలున్నాయి. హీరోయిజం, చక్కటి సందేశం, యాక్షన్, లవ్, కామెడీ, పవర్ ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే సాంగ్స్, ఇలా ప్రేక్షకులకు ఇంపుగా కనిపించే అన్ని అంశాలను జోడించి విందు భోజనం పెట్టాడు కొరటాల. ముఖ్యంగా మహేష్ ను హర్ష పాత్రలో కొరటాల ప్రెజెంట్ చేసిన విధానం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.

దేవిశ్రీ సాంగ్స్ కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. అలాగే సన్నివేశాలకు తగిన నేపథ్య సంగీతం అందించి సక్సెస్ క్రెడిట్ లో పార్ట్ తీసుకున్నాడు DSP. ‘రాములోరు వచ్చినాడు రో’, ‘శ్రీమంతుడా’ టైటిల్ సాంగ్, ‘జాగో’, ‘జతకలిసే’, ‘చారుశీల’, ‘దిమ్మతిరిగే’ ఇలా దేవి ఇచ్చిన సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. కానీ ఇందులో జాగో ఓ ప్రత్యేక గీతం అని చెప్పొచ్చు. అవును నా కెరీర్ లో ఓ బెస్ట్ సాంగ్ ఇచ్చాడు దేవి అంటూ మహేష్ కూడా ఓ సందర్భంలో ఆ సాంగ్ గురించి చెప్పుకున్నాడు. హర్ష అభివృద్ధి పనులతో వచ్చే ఆ మాంటేజ్ సాంగ్  హైలైట్ గా నిలిచింది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పాటకు ప్రాణం పోసింది.

ఇక మహేష్, శృతి హాసన్ కెమిస్ట్రీ కూడా లవ్ ట్రాక్ కి ప్లస్ అయ్యింది. అవును మహేష్ నటించే హీరోయిన్స్ లో వీళ్ళది బెస్ట్ కాంబో అనొచ్చు. అసలు హర్ష తన సొంతూరుకి పయనమవ్వడానికి కారణమయ్యే ఇంపార్టెన్స్ ఉన్న చారుశీల క్యారెక్టర్ దొరకడంతో హీరోయిన్ గా శృతి సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. ఇక రవికాంత్ గా మహేష్ తండ్రి పాత్రలో జగపతి బాబు, సొంతూరునే నమ్ముకొని ఉండే నారాయణరావు పాత్రలో రాజేంద్రప్రసాద్ కూడా మంచి నటన కనబరిచి సినిమా రీచ్ అవ్వడానికి కారణమయ్యారు. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ పల్లెటూరి రైతు పాత్రలో ఒదిగిపోయాడు. అందుకే జనాలు ఊరు వదిలి వెళ్ళే ఓ సన్నివేశంలో అతని నటన చూసి మన కళ్ళు చెమర్చుతాయి. ఇక ముకేష్ రుషి , సంపత్ రాజ్ కూడా విలనిజంతో ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్ , అలీ కామెడీ కూడా క్లిక్ అయ్యింది.

ఇక సినిమాలో కొన్ని హైలైట్స్ గురించి చెప్పుకుంటే… హీరో విలన్ ఇంటికెళ్ళి తన ఉగ్ర స్వరూపం చూపించి వార్నింగ్ ఇచ్చే సీన్ కి ఫ్యాన్స్ విజిల్స్ వేయకుండా ఉంటారా..? శ్రీమంతుడు కి కూడా అదే జరిగింది. కానీ అది కంప్లీట్ గా రివర్స్ సీన్.. డిల్లీలో ఉండే మంత్రి వెంకట రత్నం ఇంటికెళ్ళి సాఫ్ట్ గా కుర్చీలో కూర్చొని మహేష్ వార్నింగ్ ఇచ్చేలా విభిన్నంగా కొరటాల రాసుకున్న ఆ సన్నివేశానికి థియేటర్స్ లో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఇంటర్వెల్ కి ముందు ఇటుకల బట్టీ దగ్గర వచ్చే ఫైట్ తో పాటు మామిడితోటలో వచ్చే ఫైట్ కూడా అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఇక పార్టీలో సైలెంట్ గా ఎవ్వరికీ కనిపించకుండా రౌడీలను కొట్టే స్టైలిష్ ఫైట్ క్లాస్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. ఇక కొరటాల పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా సినిమాకు మరింత బలం చేకూర్చాయి. ముఖ్యంగా “ఊరిని దత్తతు తీసుకోవడం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు, రోడ్లు వేసి వెళ్ళిపోతాను అనుకున్నార్రా అంటూ మహేష్ చెప్పే డైలాగ్ క్లాస్ ఆడియన్స్ తో కూడా విజిల్స్ వేయించింది. అలాగే ఎప్పుడు చూసినా అదే పనిరా కొంచెం కూడా బోర్ కొట్టడా, మా ఫ్యామిలీ ను కాపాడుకోవడానికి కూడా నాలాంటి ఓ బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే మీలా కాదు అదో రకం’.. ఇలా మహేష్ స్టైలిష్ గా చెప్పే క్లాసీ డైలాగ్స్ కూడా ఫాన్స్ కి ఎక్కేసాయి.

మహేష్ పుట్టిన రోజుకు రెండ్రోజుల ముందే బ్లాక్ బస్టర్ గిఫ్ట్ ఇవ్వాలని నిర్మాతలు, దర్శకుడు ఫిక్స్ అయ్యారు. సినిమా దర్శక నిర్మాతలు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మహేష్ కి కూడా కథ మీద అలాగే ఫైనల్ ఔట్ ఫుట్ మీద నమ్మకం ఉంది. కానీ ఎలా ఎంత వరకు ఆదరిస్తారా అనే కన్ఫ్యూజన్.

ఆ కన్ఫ్యూజన్ అర్థరాత్రి పడిన బెన్ ఫిట్ షో తో పటాపంచలయింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ హంగామా చూసి తెల్లారి నుండే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి క్యూ కట్టారు. ఇంకేముంది ఆ తర్వాత సినిమా 100 రోజులు నిర్విరామంగా ఆడేసి రికార్డులు బద్దలు కొట్టి 100 కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఏదేమైనా మహేష్ కి అదిరిపోయే క్యారెక్టరైజేషన్ ఇచ్చి ఫ్యాన్స్ ఎప్పటికి మర్చిపోలేని ‘శ్రీమంతుడు’ లాంటి ఎవర్ గ్రీన్ సినిమాను అందించాడు కొరటాల.

ఇక ‘శ్రీమంతడు’ కి ముందు మహేష్ ఇలాంటి గొప్ప సందేశంతో కూడిన కథతో సినిమా చేయలేదు. అందుకే అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ మహేష్ చేసిన హర్ష పాత్రను ఓన్ చేసుకొని సినిమాని ఘన విజయం వైపు పరుగులు పెట్టించారు. ఫైనల్ గా ఒక గొప్పింటి కుర్రాడు సైకిలేసుకొని తిరుగుతూ సింపుల్ గా ఉండటం, సొంతూరికి కూడా ఆ సైకిల్ తీసుకెళ్లడం ఆడియన్స్ కి కొత్తగా అనిపించాయి.

నిజానికి ఈ కథను డీల్ చేయడం మాములు విషయం కాదు ఏ మాత్రం తేడా వచ్చినా సినిమా ఆడదు. కానీ తను చెప్పాలనుకున్న సందేశాన్ని నాలుగైదు సన్నివేశాలు, ఒక పాటతోనే చెప్పేసి మిగిలిన భాగాన్ని లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఎమోషన్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ తో పకడ్బందీ స్క్రీన్ ప్లేతో మెస్మరైజ్ చేసాడు కొరటాల.

ఇక రికార్డులే కాదు అవార్డులు కూడా అందుకుంది ‘శ్రీమంతుడు’. మూడు నంది ఆవార్డులతో పాటు మరో మూడు ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది సినిమా. బెస్ట్ యాక్టర్ కేటగిరిలో మహేష్ నంది అవార్డుతో పాటు ఫిలిం ఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. సంగీత దర్శకుడు దేవి అలాగే సింగర్ కార్తికేయన్ కూడా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే బెస్ట్ పాపులర్ ఫీచర్ ఫిలిం కేటగిరిలో సినిమాకు నంది అవార్డు దక్కింది. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కూడా బెస్ట్ లిరిక్ రైటర్ కేటగిరిలో నిండు భూమి పాటకు గానూ నంది అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక తమిళ్ లో కూడా సినిమా అనువదించారు.

-రాజేష్ మన్నె.