మరికొన్ని గంటల్లో స్పైడర్ టీజర్ రిలీజ్

Tuesday,August 08,2017 - 11:11 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ అంతా స్పైడర్ ఫీవర్ నడుస్తోంది. ఈ రెండు రోజులు ఆ ఫీవర్ మరింత ముదిరింది. దీనికి కారణం రేపు స్పైడర్ టీజర్ రిలీజ్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకు స్పైడర్ టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపింది స్పైడర్ యూనిట్.

స్పైడర్ మొదటి టీజర్ లో కేవలం థీమ్ ను మాత్రమే తీసుకున్నారు. కానీ రేపు రిలీజ్ చేయబోతున్న రెండో టీజర్ లో సినిమాకు సంబంధించిన విజువల్స్ ను చూపించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మహేష్ డైలాగ్ తో టీజర్ రిలీజ్ చేస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

ఎన్వీఆర్ సినిమాస్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఠాగూర్ మధు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. హరీష్ జైరాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన బూమ్ బూమ్ అనే సింగిల్ సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. రేపు టీజర్ రిలీజ్ అయిన తర్వాత దశలవారీగా మిగతా పాటల్ని విడుదల చేయబోతున్నారు. దసరా కానుకగా వచ్చేనెల 27న తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి విడుదలకాబోతోంది స్పైడర్.