ZEE Special 'ప్రేమించుకుందాంరా'కి పాతికేళ్లు

Monday,May 09,2022 - 03:18 by Z_CLU

Special Writeup on ‘PreminchukundamRaa’ on the occasion of 25th Anniversary

 

1993 అప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ లో మూడు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన జయంత్ సీ పరాన్జీ డైరెక్షన్ లో వెంకటేష్ తో ఓ సినిమా మొదలు పెట్టాడు నిర్మాత సురేష్ బాబు. సౌందర్య , మాలశ్రీ , వాణి విశ్వనాధ్ లను హీరోయిన్స్ గా ఫైనల్ చేసుకున్నారు. మణిరత్నం సినిమా ఆల్బంతో ఒక ఊపు ఊపేసిన రెహ్మాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశారు. ఫ్యామిలీ కామెడీ డ్రామాలో క్రైం సస్పెన్స్ ఎలిమెంట్ కూడా యాడ్ చేసుకున్నారు. అంతా సెట్.

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో క్లబ్ సెట్ వేసి పది రోజులు షూటింగ్ చేశారు. వెంకటేష్ , మాల శ్రీ , బాబు మోహన్ , ఆలి పై కొన్ని సీన్స్ తీశారు. రెండో షెడ్యుల్ కి ముందు స్క్రిప్ట్ రివిజన్ చేస్తే సినిమా వర్కౌట్ అవ్వదనిపించింది. వెంటనే దర్శకుడు జయంత్ , నిర్మాత సురేష్ ఈ సినిమా కరెక్ట్ కాదని ఈ స్క్రిప్ట్ పక్కన పెట్టేసి ఇంకేదైనా చేయాలని డిసైడ్ అయిపోయారు. ఈ కాంబోలో ఎన్నేళ్ళయినా గుర్తుపెట్టుకునే బ్లాక్ బస్టర్  సినిమా రావాలని డెస్టినీ డిసైడ్ చేసినప్పుడు ఓ సాదా సీదా సినిమా ఎలా చేస్తారు. అందుకే షూటింగ్ స్టేజిలోనే కథను డ్రాప్ చేసి ఇంకో కథ కోసం వెతకడం మొదలు పెట్టారు సురేష్, జయంత్.

ఆ తర్వాత జయంత్ కి డైరెక్షన్ రాదని , సీన్స్ సరిగ్గా రాకపోవడం వల్లే రష్ చూసి సురేష్ బాబు సినిమాను డ్రాప్ చేసేశారని ఇండస్ట్రీలో రకరకాలుగా మాట్లాడుకుంటూ జయంత్ ని బ్లేమ్ చేయడం మొదలెట్టారు. అవన్నీ పట్టించుకోకుండా తన యాడ్ ఫిలిం మేకింగ్స్ తో బిజీ అయిపోయాడు దర్శకుడు జయంత్. ఆ తర్వాత కొన్ని ఆఫర్స్ తలుపుతట్టినా వాటిని వద్దనుకొని సురేష్ ప్రొడక్షన్స్ లోనే అదీ వెంకటేష్ తోనే మొదటి సినిమా చేయాలని జయంత్ ఫిక్సయ్యాడు. ఓ మూడేళ్ల తర్వాత రైటర్స్ తో కూర్చొని ‘అడవి మనిషి’అనే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు జయంత్. ఈ లోపు సురేష్ బాబు నుండి జయంత్ కి కబురొచ్చింది. వెళ్తే దీన్ రాజ్ చెప్పిన ఓ లవ్ స్టోరీ లైన్ చెప్పాడు సురేష్. ఆ స్టోరీ కి జయంత్ కి బాగా నచ్చేసింది. కానీ కొన్ని మార్పులు చేయాలి లేదంటే కష్టమని భావించాడు జయంత్. అందులో మేజర్ గా చేయాల్సిన మార్పు లవ్ ట్రాక్. కథలో వెంకటేష్ కి లవ్ ట్రాక్ లేదు. ఇంటర్ మీడియట్ చదివే అక్క కొడుకు పక్కింటి ఫ్యాక్షనిస్ట్ కూతురుని లవ్ చేయడం వాళ్ళ ప్రేమకి వెంకీ హెల్ప్ చేయడం ఇదే మెయిన్ ప్లాట్. హీరో కి లవ్ లేకుండా ఎవరికో హెల్ప్ చేయడం ఏమిటి ? జయంత్ కి అస్సలు నచ్చలేదు. కానీ కథలో దమ్ముంది అది తెలుస్తుంది. సురేష్ బాబు కూడా కథని బాగా నమ్ముతున్నాడు. అందుకే ఒక దర్శకుడు చేయనని చెప్పేసి వెళ్ళిపోయిన వెంటనే కథ డ్రాప్ చేయకుండా జయంత్ ని పిలిచి స్క్రిప్ట్ వినిపించాడు. ఈ కథతో వెంకటేష్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని సురేష్ బాబు గట్టిగా నమ్మాడు. ఇక సురేష్ బాబు , జయంత్ రైటర్ దీన్ రాజ్ తో కలిసి పరుచూరి బ్రదర్స్ తో
మీటింగ్ పెట్టుకొని మేటర్ చెప్పి మార్పులు చేయడం మొదలు పెట్టారు. కథలో కొన్ని మార్పులతో గిరి -కావేరి లవ్ ట్రాక్ వచ్చింది. హమ్మయ్య స్క్రిప్ట్ లాక్. ఇప్పుడు దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని బెస్ట్ సినిమా తీయాలి దర్శకుడు జయంత్ ఫిక్స్.

వెంటనే అంజలా జవేరి ని హీరోయిన్ గా లాక్ చేసుకున్నారు. సినిమాలో పవర్ ఫుల్ విలనిజం ప్రదర్శించే నటుడు కావాలి. జయంత్ అండ్ టీం అదే పనిలో ఉన్నారు. ఒక టైంలో తన గురువు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారిని విలన్ గా చేయమని అడిగాడు జయంత్. విన్నవెంటనే రాఘవేంద్రరావు నవ్వేసి తిరస్కరించాడు.  కొన్ని రోజులు వెతుకుతూ ఉండగా జయంత్ కి ‘బొబ్బిలి రాజా’లో ట్రైబల్ కేరెక్టర్ చేసి ఓ సీన్ లో కనిపించిన జయప్రకాష్ రెడ్డి గుర్తొచ్చాడు. కనుక్కుంటే అవకాశాలు లేక అతను గుంటూరు వెళ్ళిపోయాడని తెలిసింది. కబురు పెట్టగానే హైదరాబాద్ లో వాలిపోయాడు జేపీ. లుక్ టెస్ట్ చేశారు. ఫైనల్ గా ఓ గెటప్ లాక్ చేసుకున్నారు. వెంటనే రాయలసీమ మాండలికం కోసం జయప్రకాశ్ రెడ్డి కొన్ని ప్రదేశాలకు వెళ్లిపోయాడు. తర్వాత కొన్ని మాటలు రికార్డ్ చేసుకొచ్చి దర్శకుడికి వినిపించాడు. జేపీ చేసిన రీ సెర్చ్ కి అందరూ ఫిదా. అతని పక్కనే ఉంటూ రైటా రాంగా అని చెప్పే కేరెక్టర్ కోసం శ్రీహరి ని తీసుకున్నారు. మొదట ఎక్కువ డైలాగులు లేని ఈ కేరెక్టర్ చేయడానికి శ్రీహరి ఒప్పుకోలేదు. జయంత్ శ్రీహరి ని బలవంతంగా ఒప్పించాడు. కట్ చేస్తే ప్రేమించుకుందాంరా జేపీ కి టర్నింగ్ పాయింట్ అయింది. శివుడు పాత్ర శ్రీహరికి చెప్పుకునే కొన్ని బెస్ట్ కేరెక్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

ఇక మ్యూజిక్ భాద్యతను మహేష్ కి అప్పగించారు. కానీ రెండు పాటలు కంపోజ్ చేశాక మహేష్ క్యాన్సర్ బారిన పడ్డారు. దీంతో ఏమి చేయలేని పరిస్థితిలో మహేష్ దగ్గర కీ బోర్డ్ ప్లేయర్ గా వర్క్ చేసే మణిశర్మకి మిగతా మూడు పాటలతో పాటు రీ రికార్డింగ్ భాద్యతను అప్పగించాడు జయంత్. అప్రోచ్ అయిన వెంటనే పది నిమిషాల్లో ఓ అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేసి జయంత్ కి వినిపించాడు మణి. అదే ఆల్బంలోని బెస్ట్ మెలోడీ సాంగ్ ‘మేగాల్లో తాకిందే’. విన్న వెంటనే సురేష్ బాబు తో పాటు మిగతా అందరూ ఫిదా అయ్యారు.

 

BHEL లో మొదటి రోజు షూటింగ్ …గిరి సైకిల్ మీద కావేరిని ఫాలో అయ్యే సీన్. అప్పటికే ఈ సీన్ గురించి పెద్ద డిస్కషన్. అసలు ఫ్యామిలీ సినిమాలు చేసి అందులో తండ్రి పాత్ర కూడా చేసిన వెంకటేష్ ఇలా సైకిల్ మీద లవర్ బాయ్ లా తిరిగితే ఆడియన్స్ ఒప్పుకుంటారా ? అందరికీ పెద్ద డౌట్. దర్శకుడు జయంత్ మాత్రం కాన్ఫిడెంట్ గా వెంకీ లుక్ తో అందరికీ ఆన్సర్ ఇచ్చాడు. వెంకీ మేకోవర్, కేరెక్టర్ డిజైనింగ్ తో ఆ సందేహానికి జవాబొచ్చేసింది. ఇక మొదటి రోజు నాలుగింటి వరకూ షూట్ చేశారు. ఆ ప్రపోజల్ సీన్ లో కేవలం గ్రీటింగ్ కార్డు పెట్టడం జయంత్ కి నచ్చలేదు. ఎదురుగా ఓ పాన్ డబ్బా షాపులో లిటిల్ హార్ట్స్ ప్యాకెట్స్ వేలాడుతూ కనిపించాయి. ఇదేదో బాగుంది పైగా హార్ట్ సింబల్స్ ఉన్నాయి వెంటనే రెండు ప్యాకెట్స్ కొనుక్కొచ్చి సైకిల్ మీద గ్రీటింగ్ కార్డు ముందు పెట్టాడు జయంత్. వెంకీ కూడా బాగుంది అంటూ చిన్న స్మైల్ ఇచ్చాడు. కట్ చేస్తే ఆ సీన్ సినిమాకు ఓ ఐకాన్ అయ్యింది. రిలీజ్ తర్వాత లిటిల్ హార్ట్స్ కి డిమాండ్ తెచ్చి భారీ సేల్స్ అయ్యేందుకు ఉపయోగపడింది.. ఇప్పటికి ప్రేమించుకుందాం రా అంటే ఈ లవ్ సీనే టక్కున గుర్తొస్తుంది.

ఇక భగభగ మండే వేసవిలో కర్నూల్ , కదిరి లోకేషన్స్ లో షూటింగ్ చేశారు. అదే మొదటి సారి ఓ పెద్ద హీరో సినిమా కర్నూల్ లో షూట్ జరుపుకోవడం. అక్కడ పర్మిషన్స్ విషయంలో అప్పటి రాజకీయ వేత్త పరిటాల రవి సహాయం తీసుకున్నారు. అంతా సాఫీగా జరిగిపోయింది. తర్వాత సాంగ్స్ కోసం స్విట్జర్ లాండ్ వెళ్ళారు. అక్కడ కొన్ని ఇబ్బందులు అధిగమించి బెస్ట్ లోకేషన్స్ లో మేఘాలే తాకింది సాంగ్ తీసుకొచ్చారు. బృందా మాస్టర్ ఆ సాంగ్ కంపోజ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ తీశారు. మిగతా షూట్ అంతా సాఫీగా జరిగిపోయింది. డెబ్బై రోజుల లోపే మొత్తం షూటింగ్ కంప్లీట్ చేశారు.

రిలీజ్ టెన్షన్ .. మొదటి రీల్ పూజ కోసం దర్శకుడు జయంత్ తో కలిసి సురేష్ బాబు కి తిరుపతి వెళ్ళారు. దేవుడు అంటే నమ్మకం లేకపోయినా సురేష్ బాబు బలవంతం మేరకూ తిరుపతి వెళ్ళాడు జయంత్. సురేష్ బాబు బాగా టెన్షన్ పడుతూ ఆ రాత్రి సరిగ్గా పడుకోలేదు. జయంత్ మాత్రం సినిమా పక్కా హిట్ అనే కాన్ఫిడెన్స్ తో హాయిగా పడుకున్నాడు. అక్కడి నుండి నేరుగా విజయవాడ వెళ్లారు. మెయిన్ థియేటర్ లో మొదటి షో చూస్తున్నారు. ఎవ్వరు ఎంజాయ్ చెయ్యట్లేదు. కనీసం కామెడీ కి నవ్వట్లేదు. దర్శకుడు జయంత్ కి లోపల భయం స్టార్టయింది. ‘ఈ కామెడీ కి జనం నవ్వుతారా ?’ మైండ్ లో రామానాయుడు గారు ఎక్స్ ప్రెస్ చేసిన డౌట్స్ మెదులుతున్నాయి. ఇంటర్వెల్ అయ్యింది. సినిమా ఫ్లాప్, ఆడటం కష్టమే జయంత్ లోలోపల తనలో తనే దైర్యం చెప్పుకుంటూనే ఫీల్ అవుతున్నాడు. సురేష్ బాబు మాత్రం కూల్ గా ఉన్నాడు. సరే చూద్దాం ఏం జరుగుతుందో అంటూ ఇద్దరు మళ్ళీ థియేటర్ లోపలి వెళ్లి కూర్చున్నారు. సెకండాఫ్ మొదలైంది. అక్కడి నుండి ఆడియన్స్ రియాక్షన్ చూసి జయంత్ కి కొండంత బలమొచ్చింది. క్లైమాక్స్ లో విజిల్స్ వేస్తూ హంగామా చేస్తున్న ప్రేక్షకులను వెంకటేష్ ఫ్యాన్స్ ని చూస్తూ జయంత్ మురిసిపోతున్నాడు. బయటికొచ్చి ఎస్ టి డీ బూత్ వెతుక్కొని దర్శకుడిగా గొప్ప సినిమాలు చేస్తావ్ అంటూ ఎప్పుడూ ప్రోత్సహించే భార్య అర్చన కి కాల్ చేసి సంతోషాన్ని ఆనంద పాష్పాల రూపంలో తెలియజేశాడు జయంత్. ఆల్ హ్యాపీ.

రిలీజైన రోజు నుండి బ్లాక్ బస్టర్ టాక్ తో సినిమా 175 రోజులకు పైగా థియేటర్స్ లో ఆడింది. చాలా చోట్ల రికార్డులు తిరగరాసింది. ఫ్యాక్షన్ లవ్ స్టోరీస్ కి పునాది వేసి ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంది. వెంకటేష్ కి ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కి గిరిగా ఇంకాస్త దగ్గర చేసింది. అంజలా జావేరి పెద్ద సినిమాల ఆఫర్స్ తెచ్చిపెట్టింది. మణిశర్మ టాలెంట్ ఏంటో ఇండస్ట్రీకి తెలియజేసింది. యాబై రోజుల తర్వాత టీం ఓ సక్సెస్ టూర్ చేసి ఆడియన్స్ రెస్పాన్స్ తో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. తర్వాత కర్నూల్ లో సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకొని ఓ ఫంక్షన్ చేసుకున్నారు. ఈ సినిమాకు ఇప్పటి డైరెక్టర్స్ VN ఆదిత్య , కాశి విశ్వనాధ్ , చంద్ర మహేష్ దర్శకత్వ శాఖలో పనిచేసి బ్లాక్ బస్టర్ హిట్ లో భాగమయ్యారు. ఇదీ పాతికేళ్ళు పూర్తి చేసుకున్న బ్లాక్ బస్టర్ ‘ప్రేమించుకుందాం రా’ తెరవెనుక జరిగిన ఇంట్రెస్టింగ్ స్టోరీ.

 

రాజేష్ మన్నె

 

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress
    Photos and Special topics