#SPBforever - ఆ గానం పంచామృతం

Friday,September 25,2020 - 02:37 by Z_CLU

16 భాషలు… 46వేలకు పైగా పాటలు
గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్
6 జాతీయ అవార్డులు.. మరెన్నో లెక్కలేనన్ని రివార్డులు
మన బాలు గొప్పదనం చెప్పడానికి, ఆయన టాలెంట్ ను కొలవడానికి ఇవి మాత్రమే సరిపోవు. ఇంతకుమించిన వ్యక్తిత్వం, సామర్థ్యం బాలు సొంతం. కేవలం తెలుగు సినిమాకే కాదు.. ఆ మాటకొస్తే భారతీయ సినీసంగీతానికే తన గొంతుతో ప్రాణం పోశారు ఎస్పీ బాలసుబ్రమణ్యం.

ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి చెప్పాలంటే, రాయాలంటే పేజీలు సరిపోవు. ఆయన పాడిన యుగళగీతాల గురించి మాట్లాడాలా.. లేక రోమాలు నిక్కబొడిచేలా పాడిన దేశభక్తి గీతాల గురించి మాట్లాడాలా.. ఎమోషనల్ సాంగ్స్ గురించి చెప్పాలా.. కమ్మటి మెలొడీస్ గురించి రాయాలా..? జానర్ ఏదైనా బాలు మార్క్ సుస్పష్టం. ఆయన పాట అజరామరం. ఎవర్ గ్రీన్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ బాలు గాత్రం.

విమర్శల్లేవు.. పెదవి విరుపుల్లేవు.. కెరీర్ కష్టాల్లేవు. ఆ మాటకొస్తే కఠోర పరిశ్రమ కూడా తక్కువే అని చెప్పాలి.. ఎందుకంటే.. పాట కోసమే పుట్టారు బాలు. నెల్లూరులోని స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన బాలుకు పాట చిన్నప్పట్నుంచే అబ్బంది. ఎందుకంటే ఆయన తండ్రి
హరికథా కళాకారుడు. ఆ రక్తమే బాలులో కూడా ఉంది. ఆ సంగీత జ్ఞానమే ఆయన్ను సరస్వతీ పుత్రుడ్ని చేసింది.

అయితే తండ్రి మాత్రం బాలు తన రంగంవైపు రావాలని కోరుకోలేదు. తన కష్టం కొడుకు పడకూడదనుకున్నారు. అందుకే కష్టపడి ఇంజినీరింగ్ చదివించారు. అయితే చదివేది ఇంజనీరింగ్ అయినా బాలు మనసు మాత్రం పాటపైనే ఉండేది. ఓవైపు పరీక్షలు రాస్తున్నా.. పాటలతో గెలిచిన కప్పులతోనే బాలుకు తృప్తి ఎక్కువగా ఉండేది. అలా రెండు పడవల ప్రయాణం చేసిన బాబు.. చివరికి తండ్రి అనుమతితో సినిమా రంగంవైపు వచ్చారు.

బాలుకు తొలి ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి జానకి. ఓ స్టేజ్ షోలో బాలు గానం విన్న జానకి మంచి భవిష్యత్తు ఉంటుందని మెచ్చుకున్నారు. ఆ తర్వాత తొలి రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తి కోదండపాణి. ఆయన తీసుకెళ్లి బాలును పద్మనాభంకు పరిచయం చేశారు. అలా శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాతో బాలును సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేశారు పద్మనాభం.

పుట్టుకతోనే అద్భుతమైన గాత్రం ఉన్న బాబుకు ఇండస్ట్రీలో రెడ్ కార్పెట్ పరిచింది. పరిశ్రమకొచ్చిన ఏడాదికే బాలు బిజీ అయిపోయారు. ఎంతలా అంటే సూపర్ స్టార్ కృష్ణ లాంటి హీరోలు తమ ప్రతి సినిమాలో బాలు పాట ఉండాలని పట్టుబట్టేంత బిజీ అయ్యారు. అంతేకాదు.. ఒక దశలో టైమ్ సరిపోక హెలికాప్టర్ అద్దెకు తీసుకొని వివిధ స్టుడియోలకు వెళ్లి పాటలు పాడేవారు బాలు.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు బాలు పాడిన వేల పాటల్లో కొన్నింటిని మాత్రమే ఇక్కడ చెప్పుకోవడం సమంజసం కాదు. తన పాటలతో వేల అనుభూతుల్ని, అన్ని రకాల ఎమోషన్స్ ను పండించారు బాలు. ఇక సంగీత దర్శకుల పరంగా చూసుకుంటే.. బాలు-ఇళయరాజా కాంబినేషన్ ఎవర్ గ్రీన్. వీళ్లిద్దరూ కలిసి ఆణిముత్యాల్లాంటి పాటలిచ్చారు.

ఈ కాంబినేషన్ తో పాటు బాలు-రమేష్ నాయుడు, బాలు-చక్రవర్తి, బాలు-కోదండపాణి కాంబినేషన్లు కూడా బాగా క్లిక్ అయ్యాయి. అలనాటి మేటి సంగీత దర్శకుల నుంచి నేటితరం తమన్, దేవిశ్రీ వరకు దాదాపు మ్యూజిక్ డైరక్టర్లందరితో పాటలు పాడి తన గాత్రానికి తరాల అంతరం లేదనిపించుకున్నారు బాలు. ఇక హీరోల పరంగా చూసుకుంటే.. అప్పటితరం ఎన్టీఆర్-ఏఎన్నార్-కృష్ణ నుంచి ఇప్పటితరం హీరోల వరకు అందరికీ సూపర్ హిట్స్ ఇచ్చారు.

కేవలం గాయకుడిగా మాత్రమే కాకుండా.. నటుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, మ్యూజిక్ డైరక్టర్ గా సేవలందించారు బాలు. ఆయన చేసిన పాడుతా తీయగా అనే కార్యక్రమం ఎంతోమంది గాయనీగాయకుల్ని పరిశ్రమకు పరిచయం చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్న సింగర్స్ అంతా బాలు ఆశీర్వాదంతో ఎదిగిన వాళ్లే. అంతేకాదు.. ఎంతోమందికి రిఫరెన్స్ లు ఇచ్చి సింగర్స్ గా మార్చిన ఘనత బాలు సొంతం. ఆ మంచితనమే ఆయన్ను లెజెండ్ ను చేసింది.

తన కెరీర్ లో బాలు లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు. 6 నేషనల్ అవార్డులతో పాటు.. 25 నంది అవార్డులు అందుకున్నారు. ఇతర రాష్ట్రాలు ఇచ్చిన పురస్కారాలు,, మిగతా అవార్డులు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈయన సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ అవార్డులు కూడా ఇచ్చింది.

తన గానంతో యావత్ భారతదేశాన్ని మెస్మరైజ్ చేసిన బాలు.. పాట ఉన్నంతకాలం జీవించే ఉంటారు. #SPBforever