#SPB - బాలుకు భారతరత్న ఇవ్వాల్సిందే

Saturday,September 26,2020 - 02:11 by Z_CLU

50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. భారతీయ సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన సువర్ణ అధ్యాయం. 40వేలకు పైగా పాటలు పాడిన గళం.. అన్నింటికీ మించి వివాదాలకు తావులేని వ్యక్తిత్వం. కులమతాలకు అతీతమైన ఆరాధ్య దైవం.

పాడడానికే పుట్టారు బాలు. మనల్ని మైమరిపించడానికే జన్మించారు బాలు. సినిమా ఉన్నంతకాలం ఆ మధురస్వరం వినిపిస్తూనే ఉంటుంది. బాలు జీవిస్తూనే ఉంటారు. అందుకే ఇలాంటి అద్భుతమైన వ్యక్తికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

తెలుగులో ఘంటశాల తర్వాత ఆ స్థానాన్ని పూర్తిస్థాయిలో భర్తీచేసిన ఏకైక గాయకుడు బాలు. సంగీత ప్రపంచానికి ఈయన చేసిన సేవను మాటల్లో చెప్పలేం, పేజీల్లో వర్ణించలేం. ఇలాంటి వ్యక్తికి భారతరత్నం ఇవ్వకుండా మరెవరికి ఇస్తారని ప్రశ్నిస్తోంది అభిమాన లోకం.

ఇప్పటికే పద్మశ్రీ అందుకున్నారు బాలు. ఆ తర్వాత పదేళ్లకు పద్మభూషణ్ కూడా అందుకున్నారు. కాబట్టి ఈసారి నేరుగా భారతరత్న ఇవ్వాలనేది అతడి అభిమానుల డిమాండ్.

నిజానికి బాలు గొప్పదనాన్ని అవార్డులతో కొలవలేం. కానీ ఆయన్ను స్మరించుకోవడానికి, రాబోయే తరాలకు బాలు గొప్పదనాన్ని వివరించడానికి, యావత్ సంగీతాభిమానుల గుండెల్లో ఆనందం నింపడానికి గానగంధర్వుడికి భారతరత్న ఇవ్వాల్సిందే.