Sirivennela Seetharama Sastry - సిరివెన్నెల కన్నుమూత

Tuesday,November 30,2021 - 05:24 by Z_CLU

Sirivennela Seetharama Sastry Passed away

సినీసాహిత్యంలో ఓ శకం ముగిసింది. విలువైన అధ్యాయం పూర్తయింది. ప్రముఖ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న సిరివెన్నెల ఈరోజు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 సంవత్సరాలు.

75 ఏళ్ల సినీ చరిత్రలో ఎంతోమంది గేయ రచయితలు వచ్చారు. ఆ తరం ఆత్రేయ, వేటూరి నుంచి ఈతరం చంద్రబోస్ వరకు ఎంతోమంది ఉన్నారు. ఈ 2 తరాల మధ్య వారధిగా నిలిచారు సిరివెన్నెల. గ్రాంధికం నుంచి అలతి పదాలవైపు సినీ సాహిత్యం పరుగులు తీస్తున్న క్రమంలో.. సిరివెన్నెల తన పాటలతో ప్రేక్షకుల్ని సమ్మోహనం చేశారు. ఓవైపు ‘విధాత తలపున’ అంటూ భారమైన పదాలతో సాహిత్యాన్నందిస్తూనే, మరోవైపు ‘గాలి వాలుగా’ అనే చిన్న చిన్న పదాలతో రొమాంటిక్ సాంగ్స్ కూడా రాశారు.

1955లో అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి, బాలకృష్ణ హీరోగా నటించిన జననీ జన్మభూమి సినిమాతో కెరీర్ ప్రారంభించారు. కె.విశ్వనాథ్ తీసిన సిరివెన్నెల సినిమాతో సీతారామశాస్త్రి పేరు మారుమోగిపోయింది. ఆ సినిమా ఆయనకు ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టడంతో పాటు అదే ఆయన ఇంటిపేరుగా కూడా మారిపోయింది.

కె.విశ్వనాధ్ కు సిరివెన్నెల అంటే ఎంతో ఇష్టం. ఆయన్ను ముద్దుగా సీతారాముడు అని పిలుచుకునేవారు. కేవలం విశ్వనాథ్ గారికి మాత్రమే కాదు.. త్రివిక్రమ్, కృష్ణవంశీ లాంటి ఎంతోమంది దర్శకులకు.. దేవిశ్రీప్రసాద్, తమన్, మణిశర్మ లాంటి మరెంతోమంది సంగీత దర్శకులకు సిరివెన్నెల లేకపోతే పని జరగదు. తమ సినిమాల్లో సిరివెన్నెలతో ఒక్క పాటైనా రాయించుకోవాలని తపనపడుతుంటారు అంతా.

సాహిత్యాన్నే శ్వాసగా మార్చుకున్న సిరివెన్నెల ఆఖరి నిమిషం వరకు పాటలు రాస్తూనే ఉన్నారు. రీసెంట్ గా వచ్చిన కొండపొలం, నారప్ప సినిమాల్లో ఆయన పాటల రాశారు. అంతెందుకు.. మొన్న రిలీజైన ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ సాంగ్ కూడా సిరివెన్నెల కలం నుంచి వచ్చిందే.

తెలుగు పరిశ్రమలో దాదాపు హీరోలందరితో పనిచేసిన సిరివెన్నెల, తన కెరీర్ లో 11 నంది అవార్డులు అందుకున్నారు. 4 ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు. రెండేళ్ల కిందట పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. కెరీర్ లో 3000కు పైగా పాటలు రాసిన సిరివెన్నెల, కొన్ని సినిమాల్లో నటించారు కూడా.