17 ఏళ్ల సింహాద్రి.. మాస్ విశ్వరూపం

Thursday,July 09,2020 - 05:31 by Z_CLU

ఇరవై లోపు హీరో లెవరైనా తమ డెబ్యూ సినిమా గురించో లేదా కెరీర్ గ్రాఫ్ పెంచుకునే సినిమాలు చేయాలన్న ఆలోచనలో ఉంటారు. కానీ 17 ఏళ్ల క్రితం ఓ కుర్ర హీరో మాత్రం వాటిని అధిగమించి రికార్డులు తిరగరాశాడు. ఆంధ్రలో సింహాద్రి గా, కేరళలో సింగమలై గా రెచ్చిపోయి థియేటర్స్ లో పూనకాలు తెప్పించాడు. ఈ పాటికే మీకు అర్థమై పోయుంటుంది ఆ కుర్ర హీరో ఎవరన్నది. అవును తాత నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని అభిమానుల ఆశీస్సులతో చిన్న వయసులోనే ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్న ఆ కుర్ర హీరోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్. ‘సింహాద్రి’ సినిమా విడుదలై పదిహేడేళ్ళు పూర్తయిన సందర్భంగా ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.

2003, జులై 9

తారక్ నటించిన ‘సింహాద్రి’ థియేటర్స్ లోకొచ్చింది. అంతకుముందు ఎన్టీఆర్ కి ‘అల్లరి రాముడు’ ‘నాగ’ లాంటి అపజయాలున్నాయి. బెన్ ఫిట్ షోలకి అభిమానులు నిండిపోయారు. ‘స్టూడెంట్ నెంబర్ 1’ తో తారక్ కి సూపర్ హిట్ ఇచ్చిన రాజమౌళి మనకి ఈసారి ఫుల్ మీల్స్ పెట్టకపోతాడా అంటూ నందమూరి అభిమానులు ఆకలితో కుర్చీలో కూర్చున్నారు. సినిమా మొదలైంది తాత నందమూరి తారకరామారావు బొమ్మ పక్కనే ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వగానే అభిమానుల కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్ళోచ్చాయి. అక్కడి నుండి ఆధ్యంతం సినిమాను ఎంజాయ్ చేస్తూ పాటలకు విజిల్స్ వేస్తున్నారు ఫ్యాన్స్. సరిగ్గా ఇంటర్వెల్ బ్యాంగ్ కి భూమిక ఎన్టీఆర్ ని గునపంతో పొడిచే సన్నివేశానికి అందరూ షాక్ కి గురై నివ్వెరబోయి చూసారు. ఈ పిచ్చి పిల్ల ఎందుకిలా చేసింది. అసలు సింహాద్రి ఎవరు ? అతని కథేంటి..? ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ తాగినా కడుపులో అసలేం జరిగిందో తెలుసుకోవాలనే వేడి తగ్గట్లేదు ప్రేక్షకులకు. దమ్మేసే అలవాటు ఉన్నోళ్ళు ఒకటికి బదులు రెండు మూడు తాగే పరిస్థితి. అసలేం జరిగి ఉంటుంది..? అనే డైలమాలో పడ్డారు.

ఎప్పుడు బెల్ మొగుతుందా అంటూ క్యాంటీన్ దగ్గరున్న వారు మళ్ళీ లోపలి వెళ్ళే తరుణం కోసం ఎదురుచూస్తున్నారు. సింహాద్రి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవ్వబోతుంది రండి అన్నట్టుగా థియేటర్ బెల్ మోగడమే ఆలస్యం కుర్చీలకు అతుక్కుపోయారు. కేరళ ఎపిసోడ్ మొదలైంది. ఎన్టీఆర్, భూమిక మధ్య సన్నివేశాలు వస్తున్నాయి అవి పెద్దగా ఎక్కట్లేదు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ గొడ్డలి పట్టి రౌడీలను నరుకుతాడా అంటూ ఎదురు చూస్తున్న కళ్ళు బ్రహ్మి,వేణు మాధవ్ ట్రాక్ కూడా సంతోషంగా చూడలేకపోతున్నాయి. కాసేపటికి మాస్ కి పూనకాలు తెప్పించే రాజమౌళి టేకింగ్ తో సన్నివేశాలు వచ్చేసరికి థియేటర్ అంతా అరుపులతో హోరెత్తింది. అక్కడి నుండి తెరపై ఉన్నది ఎన్టీఆర్ అని చూస్తున్నది సినిమా అని మరిచిపోయి విలన్ పై తిరగబడ్డ తెలుగు బిడ్డగా పూజించబడుతున్న సింగమలై ను చూస్తూ లోలోపల మురిసిపోయారు ప్రేక్షకులు. ప్రతీ కమర్షియల్ సినిమాలో విలన్ పై హీరో తిరగబడటం, దాంతో ఆ ఊరు అతన్ని దేవుడిగా కొలవడం షరా మాములే. కానీ కొన్ని సినిమాల్లో మాత్రమే అలాంటి ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో క్లిక్ అవుతాయి. ‘సింహాద్రి’ కి అదే జరిగింది. కేరళ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ విజయానికి ఆయువుపట్టులా నిలిచి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళి రికార్డులు సృష్టించేలా చేసింది.

మొదటి భాగంలో సింహాద్రిగా రెండో భాగంలో సింగమలై గా తన నటనతో తెరపై మెరుపులు జిమ్మాడు ఎన్టీఆర్. యాక్షన్ ఎపిసోడ్ లో తారక్ హై వోల్టేజ్ ఎనర్జీ పెర్ఫార్మెన్స్ అభిమానులతో పాటు ప్రేక్షకులనూ మెప్పించింది. ‘సింహాద్రి’ చూసి ఎన్టీఆర్ కి అభిమానిగా మారిన ప్రేక్షకులెందరో. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి తిరుగులేదంటూ అభిమానులు కలర్ ఎగరేశారు. భూమిక , అంకిత ఇద్దరూ మంచి నటనతో సినిమాకు ప్లస్ అయ్యారు. ముఖ్యంగా భూమిక కి ఇది అప్పట్లో చాలెంజింగ్ రోల్ అనొచ్చు. ఓ పిచ్చి పిల్లగా నటిస్తూ తను మంచి నటి అని రుజువుచేసుకొని చాలా ఏళ్ళు అగ్ర కథానాయికగా పరిశ్రమలో కొనసాగింది. ఇక అంకిత గ్లామర్ షో కూడా సినిమాకు కలిసొచ్చింది. శరత్ సక్సేనా నటన సింగమలై పాత్ర తాలుకు ఎలివేషన్ కి సహాయ పడింది. ముఖ్యంగా బోటు లో నుండి వస్తూ సింగమలై అన్నా అంటూ సింహాద్రి కి కత్తి అందించే సన్నివేశం థియేటర్స్ లో జనాలకు రోమాలు నిక్కపొడిచేలా చేసింది. ముకేష్ రుషి , రాహుల్ దేవ్ పవర్ ఫుల్ విలనిజం ప్రదర్శించడంతో తారక్ హీరోయిజం సన్నివేశాలు బాగా పండాయి.

సరికొత్త రికార్డు సృష్టించే మాస్ కథను విజయేంద్ర ప్రసాద్ తనయుడి చేతిలో పెడితే దాన్ని తన ప్రతిభ గల టేకింగ్ తో అదిరిపోయే సినిమాగా తీర్చి దిద్ది సినిమా అభిమానులకు ఓ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు రాజమౌళి. ఇక పాటలతో థియేటర్స్ లో విజిల్స్ వేయించిన కీరవాణి తన నేపథ్య సంగీతంతో అభిమానులకు రోమాలు నిక్కపోడిచేలా పూనకాలు తెప్పించాడు.సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా విజయానికి టెక్నీకల్ సపోర్ట్ గా నిలిచాయి.

తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోయిన ‘సింహాద్రి’ పరుగు సిల్వర్ జుబ్లీ వరకూ ఎక్కడా ఆగకుండా కలెక్షన్ల లెక్క తగ్గకుండా దూసుకుపోయి తెలుగు సినిమా చరిత్రలో అరుదైన రికార్డు అందుకుంది. 150 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకొని..55 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టి చివరిగా నిర్మాత దొరస్వామిరాజు ముందు కాసుల వర్షం కురిపించింది. అందుకే సింహాద్రి గురించి తలుచుకుంటే డిస్ట్రిబ్యూటర్లకు లెక్కలు, థియేటర్స్ యాజమాన్యానికి తీరిక లేకుండా చేసిన రోజులు గుర్తొస్తాయి. ఏదేమైనా కంటెంట్ ఉన్న మాస్ బొమ్మకి ఎప్పటికీ తిరుగుండదని వసూళ్ళ వర్షం కురిపించే సత్తా వాటికే ఉంటుందని అప్పట్లో మరోసారి రుజువుచేసింది సింహాద్రి. అందుకే ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేసినా అతని ట్రాక్ రికార్డులో ముందు నిలిచే చిత్రంగా నిలిచిపోయింది ‘సింహాద్రి’.

-రాజేష్ మన్నె