సెంటిమెంట్ ని బ్రేక్ చేసారు !

Sunday,April 21,2019 - 11:02 by Z_CLU

టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ డెబ్యూ డైరెక్టర్స్ ని భయపెడుతూ వస్తుంది. మొదటి సినిమా ఎంత హిట్టైనా రెండో సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేక అపజయం అందుకుంటారనేది ఆ సెంటిమెంట్. చాలా మంది దర్శకుల విషయంలో ఈ సెంటిమెంట్ నిజమైంది కూడా. అయితే కొందరు దర్శకులు ఇప్పటికే అప్పట్లో ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేసారు. మళ్ళీ ఇప్పుడు ఓ ఇద్దరు దర్శకులు ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఆన్సర్ చెప్పారు.

‘నిన్ను కోరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాన రెండో సినిమాగా ‘మజిలీ’ తీసాడు. నాగ చైతన్య -సమంత జంటగా తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా సినిమా అందరికీ కనెక్ట్ అవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాతో మొదటి సినిమా కంటే పెద్ద హిట్టే కొట్టాడు శివ.

ఇక ‘మళ్ళీ రావా’ తో హిట్టు కొట్టిన గౌతం కూడా జెర్సీ తో అందరినీ మెస్మరైజ్ చేసాడు. నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. నాని కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీ అంటూ ప్రేక్షకులు కూడా తీర్పు ఇచ్చేసారు. సో రెవెన్యూ పరంగా కూడా నాని కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుందని ట్రేడ్ వర్గాల అంచన.

సో మొదటి సినిమా హిట్టయింది కదా అని వెంటనే సినిమా చేయకుండా మంచి కథ రాసుకొని కాస్త టైం తీసుకొని కథకు తగిన నటీ నటులను ఎంచుకొని ఓ విజన్ తో సినిమా తీస్తే ఎలాంటి సెంటిమెంట్ నైనా బ్రేక్ చేయొచ్చని నిరూపించారు శివ , గౌతం. సో వెంకీ కుడుముల , ప్రశాంత్ వర్మ, వేణు ఉడుగుల , వెంకటేష్ మహా, శశి కిరణ్ తిక్క లాంటి వాళ్ళు కూడా రెండో సినిమాతో హిట్టు కొడితే ఇక రెండో సినిమా సెంటిమెంట్ అనేది టాలీవుడ్ లో వినబడదు.