సంక్రాంతి సినిమాకు 50 రోజులు

Saturday,March 04,2017 - 10:17 by Z_CLU

ఈ సంక్రాంతికి సిసలైన సినిమా శతమానం భవతి. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అచ్చమైన పల్లెటూరు, సకుటుంబ కథా చిత్రం, కళ్లముందు కదలాడే పాత్రలు.. ఇలా అన్నీ నేచురల్ గా సెట్ అవ్వడంతో.. శతమానం భవతి మూవీ సిసలైన సంక్రాంతి హిట్ గా నిలిచింది. ఈరోజుతో ఈ సినిమా 50రోజులు పూర్తిచేసుకుంది. అయినప్పటికీ ఈ మూవీ లాంగ్ రన్ ఇంకా ముగియలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికీ  కొన్ని థియేటర్లలో ఈ సినిమా రన్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ రోజుకి 23 సెంటర్లలో శతమానభవతి సినిమా ఇంకా నడుస్తూనే ఉంది.

శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది శతమానంభవతి. అటు అనుపమకు కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ బెర్త్ ఫిక్స్ చేసింది ఈ మూవీ. సతీష్ వేగేశ్న డైరక్ట్ చేసిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ప్రకాష్ రాజ్-జయసుధ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా గట్టిపోటీ మధ్య సంక్రాంతి సీజన్ లో విడుదలైంది. ఓ వైపు చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150, మరోవైపు బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు థియేటర్లలో ఉన్నప్పటికీ… చిన్న సినిమాగా వచ్చిన శతమానం భవతి అందరి మన్ననలు అందుకుంది.

ఈ సినిమాతో శర్వానంద్, వరుసగా రెండోసారి సంక్రాంతి హీరో అనిపించుకున్నాడు. అటు ఓవర్సీస్ లో కూడా శర్వానంద్ మార్కెట్ ను డబుల్ చేసింది శతమానంభవతి సినిమా.