మాఫియా డాన్ గా మారబోతున్న శర్వానంద్

Monday,April 02,2018 - 01:28 by Z_CLU

శర్వానంద్-సుధీర్ వర్మ కాంబోలో సినిమాకు చాన్నాళ్ల కిందటే కొబ్బరికాయ కొట్టారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రాబోతోంది ఈ మూవీ. నాగచైతన్య క్లాప్ తో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సినిమా ఇప్పుడు సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ శుక్రవారం (ఏప్రిల్ 6) నుంచి మూవీ సెట్స్ పైకి వస్తుంది.

ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు అనే సినిమా చేస్తున్నాడు శర్వ. ఈ మూవీ ఓ కొలిక్కి రావడంతో సుధీర్ వర్మ సినిమాకు డేట్స్ ఎడ్జెస్ట్ చేశాడు. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం మూవీ సెట్స్ పైకి వస్తే, సుధీర్ వర్మ-శర్వ సినిమా షూటింగ్ వైజాగ్ పోర్ట్ లో స్టార్ట్ అవుతుంది.

ఈ మూవీ కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ వేస్తున్నారు. దాదాపు కోటి రూపాయల ఖర్చుతో ఈ సెట్ రెడీ అవుతోంది. సెట్ పూర్తయిన తర్వాత యూనిట్ ఇందులోకి షిఫ్ట్ అవుతుంది. మేజర్ షూటింగ్ అంతా ఇందులోనే.

మాఫియా బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాలో శర్వానంద్ డిఫరెంట్ మేకోవర్ లో కనిపించబోతున్నాడు. హలో మూవీ ఫేం కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా అనుకుంటున్నారు.