శర్వానంద్ ఇంటర్వ్యూ

Thursday,May 11,2017 - 06:31 by Z_CLU

‘శతమానంభవతి’ సినిమాతో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న శర్వానంద్ “రాధ”గా థియేటర్లలో అడుగుపెట్టబోతున్నాడు. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ సినిమా తనకు మరో హిట్ ఇస్తుందంటున్నాడు శర్వా. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా హైలెట్స్ ను మీడియాతో పంచుకున్నాడు.

 

*రాధ కథేంటి ?

కొత్తగా ఉండే డిఫరెంట్ స్టోరీ అని చెప్పను కానీ ట్రీట్ మెంట్, నా క్యారెక్టర్ మాత్రం కొత్తగా ఉంటుంది. చిన్నప్పట్నుంచి భగవద్గీతకి బాగా అడిక్ట్ అయిపోయిన ఓ పిల్లాడు ఒకానొక సందర్భంలో కిందపడి పోలీస్ సహాయం అందుకుంటాడు. ఆ సిచ్యువేషన్ కు బ్యాగ్రౌండ్ లో భగవద్గీత వినిపిస్తుంటుంది. సో.. ఆపదలో ఉన్నప్పుడు వచ్చే పోలీస్ కృష్ణుడితో సమానమని నమ్ముతూ అప్పటి నుంచి పోలీస్ అంటే అమితంగా ఇష్టపడి చివరికి పోలీస్ అయ్యాక కృష్ణుడిలా ఫీలవుతూ సమాజంలో జరిగే అన్యాయాలపై తన స్టైల్ లో ఎలా పోరాడాడు అనేది ఈ సినిమా స్టోరీ.

*మీరు భగవద్గీత చదివారా..?

చదివాను కొన్ని శ్లోకాలు మాత్రమే.. అవి ఈ సినిమాలో కొన్ని సందర్భాల్లో చిన్నగా వాడటం కూడా జరిగింది. మొత్తం చదవలేదు…

*కుదిరితే లావణ్యతో మరోసారి నటించాలని ఉందన్నారు. ఆ కామెంట్ గురించి చెప్పండి..

లావణ్య లో నాకు బాగా నచ్చేది పాజిటివ్ నెస్. ఎప్పుడు హ్యాపీ గా నవ్వుతూ ఉంటుంది. తిట్టినా మొహంలో నవ్వే కనిపిస్తుంది. ఈ సినిమాలో బాగా నటించింది. ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. అందుకే మళ్ళీ నటించాలని ఉందని అన్నాను.

*మీరు నటించిన సినిమాల్లో హీరోయిన్స్ ఎవరైనా ఇబ్బంది పెట్టారా..? వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడిన సందర్భం ఏమైనా ఉందా?

అలాంటిదేం లేదు కానీ తెలుగు రాకుండా నా ముందు నిల్చొని.. భాష రాకుండా హిందీ-ఇంగ్లీష్ లో ఎమోషన్ లేకుండా డైలాగ్స్ చెప్తుంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతా. అందుకే సినిమా స్టార్ట్ అయినప్పుడే హీరోయిన్ ఎవరైనా తెలుగు డైలాగ్స్ నేర్పించండి అని ముందే చెప్పేస్తా.

*మీరు చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటారు… ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి?

పోలీస్ అనేవాడు ఏ ఆపదలో ఉన్నా ఆదుకుంటాడు..100కి ఫోన్ చేస్తే 365 రోజులు మనల్ని కాపాడే ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్.. మనం పండగలు చేసుకుంటే వాళ్ళు మనకి కాపలా కాస్తారు.. ఎండా, వాన, చలి పట్టించుకోకుండా మనకోసం పనిచేస్తుంటారు. వాళ్లకి ఓ ట్రిబ్యూట్ లాగా ఈ సినిమా ఉంటుంది. ఆ పాయింట్ నాకు బాగా నచ్చి ఈ సినిమా చేశా.

*ఈ సినిమాలో గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని ఇమిటేట్ చేసినట్టున్నారు ?

అలాంటిదేం లేదండి. ఆ కామెంట్ మరీ టూ మచ్.. ఆయనలా మనం చేయలేం. ఎవరి యాటిట్యూడ్ వాళ్ళది. నటుడిగా ఇమిటేట్ చేయకూడదని ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు నటించాలని నా భావన. అందుకే నా సినిమాల్లో నాలా నేనుంటా. ఎవ్వరిని ఇమిటేట్ చేయడం లాంటివేం ఉండవు.

*ఈమధ్య ఓన్లీ ఎంటర్టైన్మెంట్ నే నమ్ముకుంటు న్నట్టున్నారు….?

అవును నిజమే కెరీర్ స్టార్టింగ్ లో కొంచెం సీరియస్ క్యారెక్టర్లు చేశాను. ఈ మధ్య ఎంటర్టైన్ క్యారెక్టర్స్ చేస్తున్నా. రీజన్ ఏమీ లేదు. ఒక నటుడిగా థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడమే నా పని.. సీరియస్ క్యారెక్టర్ లు చేసి చేసి కాస్త బోర్ కొట్టేసింది.


*కెరీర్ స్టార్టింగ్ లో చేసిన సినిమాలు మీ కెరీర్ కి ఎలా ఉపయోగపడ్డాయనుకుంటున్నారు..?

నిజానికి అవి కమర్షియల్ యాంగిల్ లో పెద్దగా సక్సెస్ కాకపోయినా అవి నటుడిగా నన్ను నిలబెట్టి గుర్తింపు అందించాయి..నటుడిగా అప్పుడు చేసిన ఆ సినిమాలను ఎంజాయ్ చేశా.. ఇప్పుడు ఈ సినిమాలను కూడా ఎంజాయ్ చేస్తున్నా..

*శతమానంభవతి మీ కెరీర్ గ్రాఫ్ మార్చి ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించారా..?

కథ విన్నప్పుడు ఒక మంచి సినిమా అవుతుందని ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుందనుకున్నా. కానీ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని బిగ్ ఎమౌంట్ కలెక్ట్ చేస్తుందని, అవార్డులొస్తాయని అస్సలు ఊహించలేదు. ఆ సినిమా చేసినందుకు ఎప్పటికీ గర్వంగా ఫీలవుతా.

* ఈ మధ్య తమిళ సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి?

ఇక్కడ హ్యాపీ గా ఉంది.. మంచి కథేమైన విని ఎగ్జైట్ అయితే కచ్చితంగా చేస్తా.. ఈ మధ్యే శరవణన్ కూడా మళ్ళీ ఓ కథ చెప్పాడు. ప్రెజెంట్ తమిళ్ సినిమా చేయాలని ఇంటరెస్ట్ అయితే లేదు. కథ నచ్చితే అప్పుడు చూద్దాం.

* మీ సినిమాలపై పెరిగిన అంచనాలతో ఎలా ఫీలవుతున్నారు ?

ఒక నటుడిగా నన్ను నమ్మి థియేటర్స్ కి టికెట్ కొని వచ్చిన ప్రతీ ఆడియన్ ను బాగా ఎంటర్టైన్ చేయాలనుకుంటా.. అందుకే సెలక్టివ్ గా కథలు నచ్చితేనే చేస్తా. రాధ కూడా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది.

*శ్రీకాంత్ అడ్డాల, దశరథ్ తో సినిమాలు చేయబోతున్నారట. నిజమేనా?

వాళ్ళు అడుగుతున్నారు కథలు ఇంకా వినలేదు. ప్రెజెంట్ రాధ బిజీలో ఉన్నాను. ఇంకా ఏదీ కన్ఫర్మ్ చేయలేదు.. అంతా ఓకే అయ్యాక ప్రాజెక్ట్స్ గురించి చెప్తా…


*ప్రెజెంట్ మీ లిస్ట్ లో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు..?

ఒక ఐదారుగురు ఉన్నారు.. కథలు రెడీ చేస్తున్నారు.. వాటిలో ఇంకా ఏది కన్ఫర్మ్ అవ్వలేదు.

*సినిమా తర్వాత సినిమా స్టార్ట్ చేయడానికి కాస్త టైం తీసుకుంటారు..రీజన్ ఏంటి?

రీజన్ అంటే పెద్దగా ఏం లేదు.. ఏ కథైనా బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయ్యాకే ఫిక్స్ అవుతా. అదే నా ప్రాబ్లమ్. బౌండెడ్ స్క్రిప్ట్ లేకపోతే డెసిషన్ తీసుకోలేను. అందుకే సినిమా సినిమా కి కాస్త గ్యాప్.

*నిర్మాతగా మళ్ళీ సినిమా చేసే ఆలోచన ఉందా..?

ప్రస్తుతానికైతే సొంత ప్రొడక్షన్ లో సినిమా చేసే ఆలోచనే లేదు.. నిర్మాత అవ్వడం అంటే మామూలు విషయం కాదు.. సినిమా పూర్తయ్యే వరకూ టెన్షన్ తో కష్టపడాలి.. ప్రస్తుతానికి ఆ ఆలోచనతో పాటు టైం కూడా లేదు.

*మారుతి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా డీటెయిల్స్ ?

ఫాస్ట్ గా షెడ్యూల్స్ అవుతున్నాయి. ఫుల్ ఎంటర్టైనర్. సినిమా బాగా వస్తోంది. మహానుభావుడు అనే టైటిల్ అనుకుంటున్నాం. త్వరలోనే ఆ డీటెయిల్స్ చెప్తా.

*సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరెందుకు..?

నాకు సోషల్ మీడియాని వాడటం రాదు.. అందులో నాకు జీరో నాలెడ్జ్. అందులో ఎవరో మనకి ఒక కామెంట్ పెట్టి ఆ కామెంట్ చూసి మనం ఫీలయ్యి..మనం వాళ్ళని ఫాలో అయి, వాళ్ళు మనల్ని ఫాలో అయ్యి అవసరమా..? సినిమా ఆడి సినిమా గురించి మాట్లాడుకుంటే అంతే చాలు.