40 ఏళ్ల శంకరాభరణం

Sunday,February 02,2020 - 03:30 by Z_CLU

అపురూప దృశ్యకావ్యం, తెలుగుతెరపై తిరుగులేని క్లాసిక్ శంకరాభరణం నేటితో 40 ఏళ్లు పూర్తిచేసుకుంది. 1980, ఫిబ్రవరి 2న విడుదలైన ఈ సినిమా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచింది. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ లతో పాటు అన్ని విభాగాల్లో మెచ్చుకోదగ్గ చిత్రంగా నిలిచింది.

కళాతపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు దీన్ని నిర్మించారు. తెలుగులోనే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా అఖండ విజయం సాధించింది శంకరాభరణం.

అమెరికా లో మెయిన్ థియేటర్స్ లో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదే. ప్రతి తెలుగువాడు ఇది మన సినిమా అని గర్వంగా చెప్పుకొనే చిత్రం శంకరాభరణం. శాస్త్రీయ సంగీతంపై ఇష్టం తగ్గిపోతున్న రోజుల్లో వచ్చిన ఈ సినిమా చూసి, చాలామంది మళ్లీ క్లాసికల్ మ్యూజిక్ వైపు అడుగులేశారు.

ఈ సినిమాతో బాలసుబ్రమణ్యంకు ఉత్తమ నేపధ్య గాయకుడిగా తొలిసారి జాతీయ అవార్డు వచ్చింది. ఉత్తమ గాయకురాలిగా వాణి జయరాం, ఉత్తమ సంగీత దర్శకుడిగా కె.వి.మహదేవన్ జాతీయ అవార్డులు అందుకున్నారు. జంధ్యాల మాటలు, మహదేవన్ సంగీతం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం-వాణీజయరాం గాత్రం, జేవీ సోమయాజులు, మంజుభార్గవి, బేబీ తులసి, అల్లు రామలింగయ్యల నటన.. ‘శంకరాభరణం’ సినిమాని ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిపాయి.