సీనియర్ నిర్మాత 'దొరస్వామి రాజు' కన్నుమూత !

Monday,January 18,2021 - 11:42 by Z_CLU

ప్రముఖ సీనియర్ నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ దొరస్వామి రాజు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా  ఆరోగ్య సమస్యతో బాధ పడుతూ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం గుండెపోటుతో తుది శ్వాశ వదిలారు.

VMC ప్రొడక్షన్స్ సంస్థపై అక్కినేని నాగేశ్వరరావు గారితో సీతారామయ్య గారి మనవరాలు , నాగార్జునతో ‘అన్నమయ్య’, జూనియర్ ఎన్టీఆర్ తో ‘సింహాద్రి’ లాంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు.

వి.ఎం.సి ఆర్గనైజేషన్స్ (విఎంసి ప్రొడక్షన్స్, విఎంసి పిక్చర్స్, విఎంసి ఫిల్మ్స్, విఎంసి 1కంపెనీ, విఎంసి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, విఎంసి పిక్చర్ ప్యాలెస్) ఇలా బహుముఖ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యవస్థాపకుడు వి.దొరస్వామి రాజు (విడిఆర్). ఆయన చిత్ర నిర్మాత మాత్రమే కాదు. మాజీ ఎమ్మెల్యే కూడా. చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గం ప్రజలకు MLA గా సేవ చేసారు.

గతంలో టిటిడి బోర్డు సభ్యుడిగా, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా, పంపిణీ మండలి అధ్యక్షుడిగా, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇలా పలు కీలకమైన భూమికలను అత్యంత ప్రతిభతో నిర్వహించారు. దొర స్వామి రాజు గారు  ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత విజయవంతమైన తెలుగు చిత్రనిర్మాత, పంపిణీదారు, ప్రదర్శనకారులలో ఒకరు.

దొరస్వామి రాజు గారి మరణ వార్త విని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు గారితో పలువురు సినీ ప్రముఖులు ఆయనకి నివాళి అర్పించారు.