రాళ్లపల్లి మనకిక లేరు

Friday,May 17,2019 - 08:57 by Z_CLU

ప్రముఖ నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహారావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాళ్లపల్లి, ఈరోజు సాయంత్రం శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిపడ్డారు. వెంటనే మోతీనగర్ లోని ఆయన ఇంటి నుంచి దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ అదే హాస్పిటల్ లో కన్నుమూశారు రాళ్లపల్లి.

ఒక నటుడిలో ఎన్ని వేరియేషన్స్ కోరుకుంటారో అవన్నీ రాళ్లపల్లిలో ఉన్నాయి. ఆయనను చూస్తే ఓ కమెడియన్ గుర్తొస్తాడు. ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు గుర్తొస్తాడు. ఓ కామెడీ విలన్ గుర్తొస్తాడు. ఓ మధ్యతరగతి తండ్రి కనిపిస్తాడు. ఇలా ఒకటి కాదు.. తన కెరీర్ లో రాళ్లపల్లి దాదాపు అన్ని వేరియేషన్స్ లో కనిపించి మెప్పించారు.

ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోవడం రాళ్లపల్లి స్పెషాలిటీ. అందుకే ఆయన విలనీ చేసినా ఆడియన్స్ చూశారు. అదే ప్రేక్షకులు ఆయన కామెడీ చేస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. అలా తన 30 ఏళ్ల కెరీర్ లో దాదాపు 850 సినిమాలు చేశారు.


తూర్పు గోదావరి జిల్లా రాచపల్లిలో 1945 అక్టోబర్ 10న జన్మించిన రాళ్లపల్లి, కాలేజ్ స్టేజ్ నుంచి సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చారు. 1979లో ఇండస్ట్రీలోకొచ్చిన రాళ్లపల్లి, గతేడాది వరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తోంది జీ సినిమాలు.