సావిత్రి జయంతి స్పెషల్

Wednesday,December 06,2017 - 10:03 by Z_CLU

ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఎవరైనా అద్భుతంగా నటిస్తే మహానటి సావిత్రితో పోలుస్తారు. 3 వందల సినిమాలకు పైగా నటించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సావిత్రి 81 వ పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆ మహానటి గురించి జీ సినిమాలు స్పెషల్ స్టోరీ…

 

తన 12 ఏళ్ల వయసులోనే హీరోయిన్ కావాలనే తపనతో మద్రాస్ రైలు ఎక్కిన సావిత్రికి బిగినింగ్ లో అన్ని ఫెయిల్యూర్సే. కరియర్ బిగినింగ్ లో డ్యాన్సర్ గా, చిన్నచిన్న క్యారెక్టర్స్ కే పరిమితమైన సావిత్రి ‘పెళ్ళి చేసి చూడు’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది.  సిల్వర్ స్కీన్ పై ఆమె డామినేటింగ్ పర్ఫామెన్స్ తో అప్పటి సినిమా దిగ్గజాలను కూడా ఇంప్రెస్ చేసేసింది.

 

1951 లో రిలీజైన ‘పాతాళ భైరవి’ సినిమాలో చిన్న డ్యాన్సర్ గా బిగిన్ అయిన సావిత్రి 1960 లో తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఏకంగా 22 సినిమాలు రిలీజయ్యాయంటే తన స్టామినా అర్థం చేసుకోవచ్చు.

సావిత్రి కరియర్ లో చెప్పుకోవడం మొదలుపెడితే ఆణి ముత్యాలెన్నో… మాయా బజార్ సినిమాలో శశిరేఖలా ఆవిడ నటించిన తీరు, ఆమె కరియర్ కే తలమానికం. ఆ క్యారెక్టర్ లో ఆవిణ్ణి తప్ప ఇంకొకరిని కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేం.

గుండమ్మ కథలో సావిత్రి నటనకు విమర్శకుల నుండి సైతం ప్రశంసలందుకుంది సావిత్రి. గుండమ్మ పెట్టే కష్టాలు భరిస్తూ, ఇంటి పనులన్నీ ఒక్కతే బాధ్యతగా చేసే క్యారెక్టర్ లో న్యాచురల్ గా ఒదిగిపోయింది సావిత్రి.

సావిత్రి గురించి మాట్లాడినప్పుడు మిస్సమ్మ గురించి ప్రత్యేకంగా ఒక పేజీ క్రియేట్ చేసుకోవాలి. మ్యూజికల్ హిట్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో మేరీగా, మహాలక్ష్మీ గా రెండు డిఫెరెంట్ షేడ్స్ లో కనిపించి తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసింది.

చిన్నప్పటి నుండే ANR సినిమాలు చూసి ఇన్స్ పైర్ అయిన సావిత్రి ఆయనతో కలిసి చాలా సినిమాల్లో  స్క్రీన్ షేర్ చేసుకుంది. వీరిద్దరూ కలిసి నటించిన అద్భుతమైన సినిమాలలో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది డాక్టర్ చక్రవర్తి. ఈ సినిమాలో మాధవి క్యారెక్టర్ లో సావిత్రి లీనమై నటించిన విధానానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే.

సావిత్రికి తిరుగులేని ఇమేజ్ ని తీసుకొచ్చిన సినిమా పాండవ వనవాసం. ఈ సినిమాతో ద్రౌపది పాత్రకు తిరుగులేని స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది సావిత్రి. NTR, SVR లాంటి నటులు కూడా సావిత్రి లేకుండా పాండవ వనవాసం సినిమాను ఊహించుకోలేం అన్నారంటే ఆ సినిమాపై సావిత్రి ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉండేదో ఇమాజిన్ చేసుకోవచ్చు.

‘రక్తసంబంధం’ సినిమా సావిత్రి కరియర్ లో పెద్ద సాహసం అనే చెప్పాలి. ఈ సినిమా కన్నా ముందు NTR సరసన ఎన్నో సినిమాల్లో నటించిన సావిత్రి, రక్త సంబంధం సినిమాలో చెల్లెలుగా నటిస్తుందనగానే సినిమా ఫ్లాప్ గ్యారంటీ అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలను తారుమారు చేసిందీ సినిమా. ఏకంగా సిల్వర్ జూబ్లీ సినిమాగా నిలిచింది.

ఇలా చెప్పుకుంటూ పోతే మహానటి సావిత్రి జీవితం పెద్ద గ్రంథమే అవుతుంది. అద్భుతమైన నటన, అంతకు మించిన వ్యక్తిత్వంతో ఫేవరేట్ స్టార్ గానే కాదు, ప్రతి జెనెరేషన్ కి ఇన్స్ పిరేషన్ గా నిలిచిన సావిత్రిని, ఆవిడ పుట్టిన రోజు సందర్భంగా స్మరించుకుంటుంది జీ సినిమాలు…