Sankranthi Movies - కొత్త హీరోల సందడి

Monday,January 10,2022 - 06:04 by Z_CLU

Sankranthi Movies.. New Heroes

సంక్రాంతి అంటే టాలీవుడ్ కి అతి పెద్ద సినిమా ఫెస్టివల్ సీజన్ అని చెప్పొచ్చు. ఈ సీజన్ లో ఎక్కువగా బడా సినిమాలే రిలీజ్ అవుతుంటాయి. బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోలు కలెక్షన్స్ తో పోటీ పడే బిగ్గెస్ట్ సీజన్ ఇది. అయితే ఈ ఏడాది మాత్రం ఓ ఇద్దరు డెబ్యూ హీరోలు సంక్రాంతి బరిలో తమ సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారు.

ఆ ఇద్దరూ మరెవరో కాదు. ఒకరు ఆశిశ్, మరొకరు అశోక్ గల్లా. ఈ ఇద్దరూ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ తోనే ఎంట్రీ ఇస్తున్నారు. ఆశిశ్ నిర్మాత ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అవుతుంటే, అశోక్ గల్లా మాత్రం తాత , మేన మామ ఆశీస్సులతో హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాడు.

దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఫస్ట్ టైం హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆశిశ్ ‘రౌడీ బాయ్స్’ అంటూ యూత్ ఫుల్ సినిమాతో సంక్రాంతి స్పెషల్ గా జనవరి 14న ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 15న మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’ సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు హీరోలకే కాదు యంగ్ డైరెక్టర్స్ కి కూడా ఛాలెంజింగ్. ‘హుషారు’తో దర్శకుడిగా ప్రూవ్ చేసుకొని సక్సెస్ అందుకున్నాడు హర్ష కొనుగంటి. అందుకే తమ ఆశిశ్ డెబ్యూ ఫిలిం అతని చేతిలో పెట్టారు దిల్ రాజు. ఇక చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. అందుకే మహేష్ మేనల్లుడి ఎంట్రీ బాధ్యతను అతనికి అప్పగించారు.

ఈ ఇయర్ అనుకోకుండా పొంగల్ బరిలో నిలిచిన ఈ ఇద్దరు యంగ్ హీరోలు తమ పోటీతో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. మరి ఈ కుర్ర హీరోలు వారి మొదటి సినిమాతో సంక్రాంతి హీరోలుగా మంచి విజయం అందుకొని సక్సెస్ ఫుల్ కెరీర్ స్టార్ట్ చేయాలని కోరుకుందాం.